అరెకరంలో అద్భుతం

Wed,July 4, 2018 11:39 PM

20 గుంటల భూమి.. రూ. 20 వేల పెట్టుబడి.. నాటిన తర్వాత 40 రోజుల నుంచి సగటున నిత్యం 2 క్వింటాళ్ల దిగుబడి.. కేజీ ధర సరాసరి రూ. 20 చొప్పున 50 రోజుల్లో 10 టన్నులకు రూ. 2 లక్షల రాబడి.. కూలీలు, రోజువారీ ఇతరత్రా ఖర్చులు పోను మొత్తం మూడు నెలల్లో రూ. 1.5 లక్షల మిగులుబడి.. తహశీల్దార్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ.. అరెకరం భూమిలోనే అద్భుతం ఆవిష్కరించిన ఓ యువ రైతు తొలి విజయ ప్రస్థానం ఇది.
rajender-reddy
వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన నేపథ్యం.. చిన్నప్పటి నుంచి సాగుతో ఉన్న అనుబంధం.. ఎప్పటికైనా తానూ వ్యవసాయం చేయాలనే ఆకాంక్ష.. వెరసి నల్లగొండ తహశీల్దార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఖాళీ సమయంను సాగు కోసం వెచ్చించారు మందడి నాగార్జున రెడ్డి. నల్లగొండ పట్టణం పక్కనే ఉండే గిరకబావిగూడెంలో తన భార్య కల్పన పేరిట ఉన్న భూమిలోని 20 గుంటల్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా ఆలోచించి ఆచరణలో పెట్టి.. అత్తమామల సహకారంతో బీర సాగును చేపట్టి అరెకరంలోనే మూడు నెలల్లో ఊహించని దిగుబడితో రూ. 2 లక్షల ఆదాయం ఆర్జించారు.

మట్టి పరీక్షలు చేసి.. పంట మార్పిడితో ముందుకు:

గతంలో తన మామ ఊట్కూరి నర్సి రెడ్డి వరి, మిర్చి పంటలు సాగు చేసిన తన నల్లరేగడి భూమిలో ఈసారి తానే వ్యవసాయం చేయాలని అయిదు నెలల కిందటే ఆలోచించారు నాగార్జున రెడ్డి. అనుకున్న వెంటనే మట్టిని సేకరించి పరీక్షలు జరిపించారు. ఏయే పంటల సాగుకు అనుకూలమో తెలుసుకున్న తర్వాత కూరగాయల సాగును ఎంచుకున్నారు. వేసవి కాలంలో ఎక్కువ ధర పలి కే బీర సాగుకు నిర్ణయం తీసుకున్న తర్వాత పందిరి సాగు ద్వారా అధిక రాబడి వస్తుందని నిపుణుల ద్వారా తెలుసుకొని అరెకరం లో శాశ్వత పందిళ్లు వేయించారు. కలుపు అధికంగా రాకుండా మల్చింగ్ పద్ధతిలో డ్రిప్ ద్వారా నీటిని సరఫరా చేస్తూ సాగు చేపట్టారు. పందిరి కోసం వెచ్చించిన శాశ్వత పెట్టుబడిని మినహాయి స్తే.. దుక్కి దున్ని సిద్ధం చేసేందుకు రూ. 2 వేలు, మల్చింగ్ కవర్‌కు రూ. 8 వేలు, గింజల కోసం రూ. 8 వేలు, ఎరువులకు రూ. 2 వేలు.. మొత్తం రూ. 20 వేల పెట్టుబడితో బీర గింజలు పెట్టారు. 7 అడుగులకు ఒక వరుస చొప్పున మొత్తం 60 వరుసలుగా బీర మొక్కలు పెంచారు.

దిగుబడితో అధిక లాభం: బీర గింజలు నాటిన తర్వాత నిత్యం ఉదయం స్వయంగా పంటను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఎరువులు, పురుగు మందులు వేశారు. డ్రిప్ ద్వారానే పురుగు మందులు వేసేందుకు వెంచూరి పద్ధతిని ఎంచుకున్నారు. విత్తనాలు నాటిన 40 రోజుల తర్వాత ప్రారంభమైన దిగుబడి 50వ రోజు నుంచి క్రమంగా పెరిగి నిత్యం 2 క్వింటాళ్లకు చేరింది. గరిష్ఠంగా ఒకేరోజు 5 క్వింటాళ్ల బీరకాయ దిగుబడి వచ్చిన రోజులు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం అక్కర్లేదు. ఎండలు గరిష్ఠంగా ఉండే మే, జూన్ నెలల్లో అధికంగా దిగుబడి రావడంతో ధర భారీగా పలికింది. గరిష్ఠంగా రూ. 35 కేజీ చొప్పున కూడా విక్రయించారు. సగటున రూ. 20కు ఎన్నడూ ధర తగ్గకపోవడంతో 50 రోజుల్లో వచ్చిన మొత్తం 10 టన్నుల దిగుబడితో రూ. 2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. వారం రోజులకోసారి వేసిన ఎరువులు, రోజువారీ కాయలు కోయడానికి చేసిన కూలీ ఖర్చులు పోను కనీసం రూ. 1.5 లక్షలు లాభం ఆర్జించారు.
- జూలకంటి రాజేందర్ రెడ్డి,

అధిక రాబడికి అనుకూలతలు

-గతానికి భిన్నంగా పంట మార్పిడి చేయడం,
-నేల స్వభావం తెలుసుకొని సాగు చేపట్టడం,
-తీగ జాతి కూరగాయలకు పందిరి సాగు ఎంపిక,
-కలుపు నివారణకు ఉపకరించిన మల్చింగ్ పద్ధతి,
-వేసవిలో దిగుబడి కోసం చేసిన ముందస్తు ప్రణాళిక,
-పట్టణం పక్కనే సాగుతో సులభమైన మార్కెటింగ్,
-లేత కాయలనే కోయడంతో మార్కెట్‌లో గిరాకీ
-నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

మా కాయల కోసం మార్కెట్‌లో ఎదురు చూడటం ఆశ్చర్యం

చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తితో అరెకరం భూమిలోనే కూరగాయల సాగు చేపట్టాం. మూస ధోరణిలో కాకుండా ఒక పద్ధతిలో మట్టి పరీక్షలు చేయించి పంటల సాగు ఎంపిక చేయడం.. క్రమం తప్పకుండా పర్యవేక్షించడం.. మా అత్తమామలు ఊట్కూరి నర్సిరెడ్డి, పద్మ.. వ్యవసాయ నిపుణుడైన మిత్రుడు గడ్డం శ్రీనివాస్ రెడ్డి సహకారం.. అన్నీ కలిసి ఊహించని దిగుబడి వచ్చింది. మూడు నెలల్లోనే లక్షన్నర ఆదాయం మిగులడం ఆనందంగా ఉన్నది. నల్లగొండ పక్కనే కావడంతో మార్కెటింగ్ సులభమైంది. మార్కెట్‌లో మా బీర కాయల కోసం ఎదురు చూసి వచ్చిన తర్వాత వ్యాపారులు కొనుగోలు చేయడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది.
-మందడి నాగార్జున రెడ్డి, రైతు, నల్లగొండ తహశీల్దార్

1694
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles