పూజిద్దాం.. కాలుష్యాన్ని కాదు!

Wed,September 12, 2018 01:11 AM

ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చిన్న విగ్రహాలతో పాటు పెద్దపెద్ద విగ్రహాల విషయంలో కూడా మట్టి విగ్రహాలను, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను ప్రతిష్టించేవిధంగా మంటపాల నిర్వాహకులకు అవగాహన కల్పిస్తే పర్యావరణానికి మరింత మేలు చేసినవారమవుతాం. చివరగా మనం తెలుసుకోవాల్సిందేమంటే మన పూర్వీకులు ప్రతి విషయాన్ని పద్ధతి ప్రకారం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. మనం చేయాల్సిందల్లా వాటిని యథాతథంగా పాటించడమే.
ganesh-chaturthi
ప్రతి పండుగను వ్యాపారమయం చేయడంలో ప్రపంచం ఎల్లప్పుడూ ముందుంటుంది. భారతీయ సంప్రదాయ విధానంలో ప్రతి పండుగ పరమార్థం పర్యావరణ పరిరక్ష ణే. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనటువంటి జీవన విధానం మన దేశంలో ఉన్నది. ప్రకృతితో మమేకమై జీవించే ఈ దేశంలో పంచభూతాలను గౌరవించే సంప్రదాయం ఉన్నది. మన జీవితంలో ప్రతి అణువణువులో మమేమకమైన ప్రకృతిని స్మరించుకోవడమే భారతీయ పండుగల పరమార్థం. అలా మనదేశంలో ఉగాది, సంక్రాంతి, వినాయకచవితి, బతుకమ్మ, దసరా లాంటి పండుగల పరమార్థం ప్రకృతిని స్మరించుకోవడమే.వినాయకచవితి విషయానికి వస్తే పురాణాల ప్రశస్తిని పక్కనపెడితే ఈ పండుగ కూడా ప్రకృతి పండుగే. వానకాలం మొదలయ్యే ముందర చెరువుల పూడికతీసే సంప్రదాయం మనదేశంలో ఉండేది. వానకాలం మధ్య లో వచ్చే భాద్రపద శుద్ధచవితి రోజున వచ్చే వినాయక చవితి పండుగ కూడా చెరువు పూడికతో తీసిన మట్టితో గణపతి ప్రతిమలను చేసి ఆ విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం సంప్రదాయం.

ముఖ్యంగా వినాయకుడి కి 21 పత్రులతో పూజించడం ముఖ్యమైన విషయం. ఈ పండుగ వాన కాలం మధ్యలో రావడం, వర్షాలు పడటం వల్ల నదుల్లో, కాలువల్లో, చెరువుల్లోకి కొత్త నీరు రావడం జరుగుతుంది. ఈ కొత్తనీరు వల్ల ప్రజల కు ఆరోగ్య సమస్యలు రాకుండా ఔషధ గుణాలు గల మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, గఱిక, దుత్తూరపత్రం, బదరీపత్రం, అపామార్గపత్రం, తులసీపత్రం, చూతపత్రం, కరవీరపత్రం, విష్ణుపత్రం, దాడిమీపత్రం, దేవదారుపత్రం, మరువకపత్రం, సింధూరపత్రం, జాజి ఆకులు, గండకీపత్రం, శమీపత్రం, అశ్వత్థపత్రం, అర్జునపత్రం, అర్కపత్రం లాం టి పత్రులతో పూజ చేసి, నవరాత్రుల అనంతరం ఆ పత్రాలతో సహా చెరువుల్లో, నదుల్లో నిమజ్జనం చేయడం పండుగ విధానం. ఆ కాలంలో చెరువులు, బావులు, నదులు లాంటి వర్షాధార నీటి వనరులు తప్ప అధునాతన జల సౌకర్యాల్లేవు. నీళ్ళు తాగాలన్నా, స్నానాలు చేయాలన్నా, కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా అందరికీ అందుబాటులో ఉండేవి ముఖ్యంగా బావులు, చెరువులు, అక్కడక్కడ నదులే. ఈ జలాశయాల్లోని నీళ్లు శుభ్రపడటానికి ఉపయోగపడేవిధంగా వినాయక పూజకు ఈ 21 ఓషధీ పత్రాలను నిర్ణయించి, జలాశయాల్లో నిమజ్జనం జరిగేవిధంగా పూజా విధానాలను మన పూర్వీకులు రూపొందించారు.

అలా జరుపుకుంటున్న వినాయకచవితి పండుగను స్వాతంత్య్ర పోరా ట సమయంలో ప్రజలను మరింత సంఘటితపరుచడం కోసం లోకమా న్య బాలగంగాధర్‌తిలక్ గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రజల్లో దేశభక్తి, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడానికి ప్రారంభించిన గణేష్ ఉత్సవాలు నేడు ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవిధంగా తయారయ్యాయి. నాడు దైవభక్తి, దేశభక్తి మిళితమై ఉత్సవాలు నిర్వహిస్తే, నేడు రణగొణ ధ్వనులు, సినిమా పాటలు, ప్లాస్టిక్ పూల వంటి వాటితో ఉత్సవాలు నిర్హహిస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు పెరిగేకొద్దీ కాలనీకొక గణేష్ మంటపం దాటి వీధివీధికో గణేష్ మంటపాలు నెలకొంటున్నాయి. ప్రకృతిని సంరక్షించుకోవాలనే సంకల్పం తో మొదలైన పండుగలను కాలుష్యానికి కారకాలుగా తయారుచేస్తున్నాం. వినాయకచవితి సందర్భంగా మట్టితో వినాయకున్ని చేసి, తర్వాత చెరువుల్లో, కాలువల్లో, నదుల్లో నిమజ్జనం చేయడం పండుగ పరమార్థం. కానీ నేడు వీధివీధికో వినాయక మంటపం పెట్టడం వల్ల ఎక్కువ విగ్రహా లు అవసరమవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విగ్రహాలు తయా రుచేసే విధంగా మట్టితో కాకుండా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను ఉపయోగించి విగ్రహాలు తయారుచేయడం మొదలుపెట్టారు. వీటితోపాటు రకరకాల సైజులు, వివిధ రూపాలుగా వినాయకుని విగ్రహాలు తయారుచేసి రసాయనిక రంగులు వాడి ఆకర్షణీయంగా చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రజలు మట్టి వినాయకున్ని మరిచిపోయి, ప్లాస్టిక్ వినాయకుడికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇంటిలో పూజించే విగ్రహాల నుంచి అతిపెద్ద విగ్రహాల వరకు మొత్తం రసాయనాల వినాయకుడే. నవరాత్రులు పూర్తయిన తర్వాత ఈ విగ్రహాలను చెరువుల్లో, నదుల్లో నిమజ్జనం చేయడం వల్ల నదులు, చెరువులు కాలుష్యమయమవుతున్నాయి.
Ravikanth
ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల్లో జిప్సవ్‌ు, సల్ఫర్, పాస్ఫరస్, మెగ్నీషియం వంటి రసాయనాలు ఉంటాయి. ఆ రసాయనాలు నీటిలో కరిగి జీవరాశులు కూడా అంతరిస్తున్నాయి. అంతేకాకుండా మట్టి విగ్రహాలతో పోలిస్తే ఈ విగ్రహాలు త్వరగా నీటి లో కలిసిపోవు. విగ్రహాల రంగు ల్లో ఉండే మెర్క్యురీ, లెడ్, కాడ్మి యం, కార్బన్ వంటి రసాయనాలు నీటిని మరింత విషపూరితం చేస్తాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి వారు మట్టి వినాయకులనే పూజించాలని ప్రచారం నిర్వహిస్తున్నా రు. ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేట్ మరెన్నో స్వచ్ఛంద సంస్థలూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజలు మట్టి వినాయకుడిని పూజించే విధంగా చైత న్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రభు త్వ, స్వచ్ఛంద సంస్థల కృషి వల్ల కొంతమేరకు ఇంటిలో పూజించే విగ్రహాల వరకు మాత్రం ప్రజలు మట్టి విగ్రహాలనే పూజిస్తున్నారు. అది కూడా చాలా పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా విగ్రహాలను పంచడం వల్ల ప్రజల్లో మార్పు వచ్చింది.

అయితే, నిమజ్జనం విషయానికి వస్తే హైదరాబాద్ మహానగరంలోని ఒక్క హుస్సేన్‌సాగర్లోనే ఏటా దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనమవుతాయని లెక్కలు చెబుతున్నాయి. ఈ విగ్రహాల ప్రతిష్ఠాపన హైదరాబాదే కాకుండా పల్లెల్లో కూడా పోటాపోటీగా లక్షల సంఖ్యలో పెట్టడం జరుగు తున్నది. మట్టి వినాయకులను వాడాలని చేస్తున్న ప్రచారం చిన్న విగ్రహా ల విషయంలో చాలావరకు మార్పు తెచ్చినా, వినాయక మంటపాల్లో పెద్దపెద్ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడం, వాటిని చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సంకల్పం నెరవేర డం లేదు. కాబట్టి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చిన్న విగ్రహాలతో పాటు పెద్దపెద్ద విగ్రహాల విషయంలో కూడా మట్టి విగ్రహాలను, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను ప్రతిష్టించే విధంగా మంటపాల నిర్వాహకులకు అవగాహన కల్పిస్తే పర్యావరణానికి మరింత మేలు చేసినవారమవుతాం. చివరగా మనం తెలుసుకోవాల్సిందేమంటే మన పూర్వీకులు ప్రతి విషయాన్ని పద్ధతి ప్రకారం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. మనం చేయాల్సిందల్లా వాటిని యథాతథంగా పాటించడమే. అదే మనం మన సంసృ్కతికి, పూర్వీకులకు ఇచ్చే అతిపెద్ద గౌరవం.

377
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles