అచలయోగికి అక్షర నివాళి

Sat,May 5, 2018 01:05 AM

తెలంగాణ ఉద్యమంతో సాహిత్య ప్రపంచంలో ఒక నూతన దృక్పథం వికసించింది. అనేక పాయలుగా సాగిన సాహిత్య యానాన్ని అస్తిత్వ చేతనతో సమగ్రంగా చూసే విశాలత్వం ఏర్పడింది. తెలంగాణ సాహిత్యాన్ని సంస్కృతిని సుసంప న్నం చేసిన మహనీయుల కృషిని పరిశోధించి, ప్రకాశింపజేయాలనే నిర్మాణాత్మక కార్యాచరణ ప్రారంభమైంది. ఆ ప్రయత్నంలో భాగంగా తెలం గాణ వికాస సమితి పుస్తక ప్రచురణను చేపట్టింది. మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు జీవితం, తాత్విక చింతనను పరిచయం చేసే పుస్తకం తెస్తున్నందుకు తెలంగాణ వికాస సమితి గర్విస్తున్నది.
madigamahayogam
గతంలో మొదటి చెంచు మహాసభ, తెలకపల్లి రామచంద్రశాస్త్రి జీవితం సాహిత్యం (సంస్మరణ సంచిక), నాగరకందనూలు కథలతో పాటు ఎరుక, జనశంకరుడు కవితా సంపుటాలను ప్రచురించింది. తెలంగాణ సాహిత్య చరిత్రను పునర్నిర్మించే సందర్భంలో, తొలి తెలుగు దళిత కవిగా చరిత్రకారులు భావిస్తున్న దున్న ఇద్దాసు తత్త్వాలకు ఎనలేని ప్రాధాన్యం ఉన్నది. సమాజ దు:ఖాన్ని నివారించేందుకు, మనిషిలోని అహంకారాన్ని ఇతర మాలిన్యాల ను రూపుమాపేందుకు ఇద్దాసు సంకీర్తనా మార్గాన్ని ఎంచుకున్నాడు. అట్టడుగు ప్రజల ఆవేదన, వర్ణ, వర్గ ఆధిపత్యంపై నిరసన ఇద్దా సు తత్త్వాలలో వ్యక్తీకరించిండు. తెలంగాణ సాహిత్య చరిత్రలో చిరకాలం నిలబడిపోయే ఇద్దాసు రచనలు, జీవిత చరిత్రతో కూడిన పుస్తకం ప్రచురించడం మా సంస్థకు గర్వకారణం. ఆధ్యాత్మిక ప్రపంచంలో జ్ఞాన మార్గాశ్రయులైన వారు రచించి ప్రచలింపజేసిన కీర్తనా వాజ్మయ మే తత్త్వాలు. తత్త్వం అంటే వారి దృష్టిలో జీవుని ఆవేదన, పరమాత్మను చేరే చింతన. ఉపనిషత్సారం అనదగిన తత్త్వ గీతాలెన్నో తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి ఊరిలో ప్రజల నాలుకల మీద సజీవంగా ప్రతి ధ్వనిస్తున్నాయి. అచల సిద్ధాంతం పునాదిగా తత్త్వాలు రాసిన వారిలో ఇద్దాసు ప్రముఖుడు. నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన ఇద్దాసు శిష్యగణం మాత్రం పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు.

తత్త్వకవులు మానవుని ముముక్షువుగా మార్చేందుకు, ఒక అస్తిత్వ భావన వైపు తీసుకుపోవడానికి తత్త్వాన్ని ఉపయోగించుకున్నారు. మాన వ సమాజానికి ఆత్మీయ సంస్కారాన్ని అందించే సాధనాల్లో తత్త్వం శ్రేష్ఠ మైనదిగా భావించారు. అది సత్య దర్శనాన్ని, సమ్యక్ దృష్టినీ కలిగించి సాత్వికతను బహిర్గతం చేస్తుందని విశ్వసించారు. సామాన్యుల హృదయాలను కదిలించే లక్ష్యంతో వారు, జ్ఞాన సంబంధమైన విషయాలను వచనంలో కాకుండా రాగయుక్తంగా, పాడుకోవడానికి అనుగుణంగా, అద్భుతమైన కవితాత్మతో రచించారు. నిరక్షరాస్యుడు పశువుల కాపరి అయిన ఇద్దాసు, గహనమైన వేదాంత రహస్యాలను అలవోకగా సరళంగా సుబోధకంగా వివరించిండు.
ఉపనిషత్తుల్లో చెప్పబడిన యోగ విషయాలు, నాడులు, షట్చక్రాలు, పంచీకరణ రహస్యాలు దున్నఇద్దాసు తత్త్వాల్లో చెప్పబడ్డాయి.

ఆరు చక్రములను దిరిగె
ఆరు హంసల బందుజేసి
మీది చక్రము మీద దిరిగె

బోధ హంసను గూడుకొని దారా మాయ ను దారా లో షట్చక్రాల ప్రస్తావనను చూడవ చ్చు. ఇందులో యోగరహస్యం మార్మికంగా చెప్పబడింది.
వేదాలు, శాస్ర్తాలు, పురాణాలు చదివి విశేషజ్ఞానం సంపాదించిన వారు కూడా మాయ కు లోకువైనారని, దానిని దాటాల్సిన అవసరముందని తత్త్వాల్లో పొందుపరిచాడు.

కర్మలోనే పుట్టిపెరిగి
కర్మలో సంకీర్తినంది
కర్మమనె దేవతను గట్టి
బంధనంబు చేసి మాయను దారా మాయ ను దారా
ఇల్లు సంసారమ్ము ఆలు
పిల్లలన్నదె రాజయోగము
అహము జంపి గూటిలోన
దీపమెలుగున్నంతలోనే దారా మాయను దారా

ఇదన్న సంసారం, కులవృత్తి చేస్తూ రాజయోగ సాధన చేసిన తన స్వానుభవాన్ని పై తత్త్వంలో పొందుపరిచిండు. సంసారంలోనే నివృత్తి సాధించడం తత్త్వకారుల లక్షణం.
ఇద్దాసు చిన్న నాటనే నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో గురువుల వద్ద జేరి జ్ఞానాన్ని పొందిండు.
వాసిగ తుంగతుర్తి వాసుని మరుగుజేరి ఆత్మనుగన్న ఇద్దాసయ్య గారు మీరయ్యగారా? ఆత్మనుగ న్న వారయ్య గారూ!
తనలో పరమశివుడిని దర్శింపజేశాడు. తనను ఛీత్కరించిన బ్రాహ్మణులకు బాహ్యశుద్ధి కన్నా అంతశ్శుద్ధి గొప్పదని తెలిపిన సందర్భంలో ఇదన్న పాడినట్లు చెబుతున్న తత్త్వంలో నిజమైన అయ్యవార్ల కుండాల్సిన లక్షణాలను చెప్పాడు. వారి కనులు తెరిపించా డు. ఆత్మను తెలుసుకున్నవారు నిజమైన బ్రాహ్మణులని, సింహానికి కుక్క కు, పులికి పిల్లికి, కామధేనువుకు మామూలు ఆవుకు భేదం తెలుసుకొని మెలగవలెనని ఇదన్న సూచించాడు. దీనిలో అన్యాపదేశంగా తత్త్వకారుల గొప్పతనాన్ని చెప్పాడు.
తోటను శరీరంగా భావించి చెప్పిన ఎంత సంతోషకరమోయమ్మా! ఈ తోట లోపలి వింతలెవరికి తెలియవు సుమ్మా అనే తత్త్వంలో వేదాంతపరమైన భావనను మార్మికతతో ఇదన్న చెప్పిండు. తన గురువైన పెనుగొండ బసవయ్య దయచేత శరీరానికి సంబంధించిన రహస్యాలను తాను తెలుసుకున్నానన్నాడు.

ఆరుపూవుల తోట, పదహారు లొట్టిపిట్టలు, కరణాలు నలుగురు, కాపు లారుగురు, కావలి యిద్దరు, అష్టగజమూలు, ముప్పది మూడు ముసద్దీలు, నలభై నలుగురు మొదలగు పదబంధాలలోని సం ఖ్యలు యోగ, వేదాంత, ఆధ్యాత్మపరమైన అంశాలు ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నవి. ఇలా చెప్పడం అచల తత్త్వ లక్షణం. ఇద్దాసును అచల తత్త్వ సాధనలో శిఖరాగ్రానికి చేరుకున్నడు.
దున్న ఇద్దాసు ఆత్మతత్త్వాలలో అచల సంప్రదాయంలోని అన్ని విషయాలున్నవి. మాయలో కొట్టుకొనిపోతున్న జనులకు మేలుకొలుపులు, గురువుల గొప్పతనం, కర్మబంధాన్ని దాటాల్సిన తీరు, జనన మరణ రహస్యాలు, శరీర నిర్మాణంపై మార్మిక బోధనలు, సద్గురువు లక్షణాలు, ప్రాణాయామాది యోగ సాధనపై ఎక్కుపెట్టిన విమర్శలు, ప్రకృతి విపత్తులు, మంగళహారతులు ఇదన్న తత్త్వాలలో కనబడుతయి. కరువు రక్క సి బారినపడిన సమాజాన్ని రక్షించాలనే గొప్ప మానవతావాదిగా ఇదన్న మనకు కనిపిస్తడు. ఇద్దన్న పరంపర కొనసాగుతున్నది. సాహిత్యం సామాజిక అంతరాలను తొలగించేందుకు తెలంగాణ వాగ్గేయధార అవిచ్ఛిన్నం గా పురోగమిస్తున్నది.
srinivas
(వ్యాసకర్త: సీఎం ఓఎస్డీ, తెలంగాణ వికాస సమితి అధ్యక్షులు )
(నేడు రవీంద్రభారతిలో మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు పుస్తకావిష్కరణ సందర్భంగా.. ఆ పుస్తకం ముందుమాటలోంచి
కొన్ని భాగాలు...)

903
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles