నా జ్ఞాపకంలో ఓంపురి

Sun,January 8, 2017 01:44 AM

చేనేత బట్టలు ధరించాలంటూ మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడం, ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓంపురి చనిపోయారన్న వార్త. ఈ రెండు వార్తలు నా బాల్యాన్ని గుర్తుచేశాయి. పాతిక డబ్బాల పంచరంగుల దారాల్ని మింగే జైంట్‌వీల్ రాట్నం కళ్లముందు కదలాడింది.

ఓంపురిని తలుచుకోవడమంటే భారతీయ సినిమాకు చెయ్యెత్తి నమస్కరించడమే... ఓ చేనేత కళాకారుడు, కార్మికుడైన మా నాయినతో గడిపిన ఓంపురి జ్ఞాపకాన్ని గుండెల్లో దాచుకోవడం అంటే గర్వం పెదవుల మీద చిరునవ్వుగా వికసించడమే!


దర్శకుడు శ్యాం బెనెగల్, ఓంపు రి, షబానా ఆజ్మీ, నీనాగుప్తా తదితర సిన్మా ఆర్టిస్టులు నేత కార్మికుల జీవితం మీద 1985 లో సుష్మన్ అనే సిన్మా తీద్దామని మా ఊరు పోచంపల్లికి వచ్చారు. మా నాయిన ఇక్కత్ (ట్రై అండ్ డై-బట్టలపై బొమ్మలు నేసే) ఆర్టిస్టు. అందువల్ల మా ఊరుకు ఎవరు వచ్చినా ముందు మా తలుపే తట్టేవాళ్లు. సిన్మా టీంతో పాటు జీన్స్ ప్యాంటు, టీ షర్టు, గుమాయించే అత్తరు వాసనతో మచ్చల ముఖమున్న ఓంపురి మా ఇంట్లో దిగారు. సుమారు మూడు నెలలు మా ఊళ్లోనే. మా నాయిన నేసిన ఇక్కత్ డిజైన్ చూసి ఆశ్చర్యపోవడం, కుట్టు లేకుండా నేసిన మూడు కొంగుల చీర కట్టుకొని మురిసిపోయారు.

హీరోలు అంటే చిరంజీవి, బాలకృష్ణ గదా ఈయనేం హీరో, హీరో మగ్గం నేయడం ఏందీ? ఇదేం సిన్మా అని నేను పట్టించుకోలేదు. ఇప్పుడనిపిస్తున్నది. తెరమీద ఓంపురి చూస్తే అతని చూపూ, ఆ మచ్చల మొహంలోని ఉద్వేగం, దీనత్వం-మనసునీ, మెదడుని తాకుతూనే, మన ఒంటిని ఒరుసుకుపోతున్నట్టు-గోరటి వెంకన్న గొంతు లాగ.

సత్యజిత్‌రే సద్గతిలో ఓంపురిని చూడాలి. అలాగే గోవింద్ నిహ్లాని తమస్‌లో చూడాలి. కన్నీటి చెలిమె అయ్యి మెరుస్తాడు. ఓరి నాయనో ఎప్పటికీ మర్చిపోలే ము. అదేంటో ఆ నటన కాల్చివాత పెట్టినట్టు-మచ్చపో దు.. మంట తగ్గదు.

మా ఊరి షూటింగులో ఓంపురి అచ్చం మా నాయి నే. మచ్చల మొహంతో సహా (మా నాయినది కూడా అదే మాదిరి-అంబర్ మచ్చలు అంటాం గదా). ఇద్ద రూ నిలువు, పేక దారాల్లా కలిసిపోయేవారు. ఒక్కసారి జీన్స్‌ప్యాంటు, టీ షర్టు నుంచి, బనీను, దోతిలోకి మారిపోయే ఓంపురి ఇంకా గుర్తున్నారు. ప్రతి బోనాల పండుగకు ముందు పోతరాజులు డ్యాన్సులు చేస్తూ, డప్పుల దరువేస్తూ ఎడ్లబండి మీద మగ్గం నేస్తూ మా ఇంటి నుంచి గుడికెళ్లేలోపు చీరెనేసి మా నాయిన అమ్మవారికి సమర్పించడం మా ఊరి సంప్రదాయం. ఇది బాగా నచ్చి సిన్మాలో చేర్చారు. మా మనుషుల మధ్య కలిసిపోయి సగటు నేత కార్మికుడైన ఓంపురిని నేను అయితే అస్సలు పట్టించుకున్న పాపానపోలేదు. పోచంపల్లిని వాణిజ్య కేంద్రంగా మార్చేయడానికి వచ్చే విదేశీ టూరిస్టులతో నిత్యం రద్దీగా వుండే ప్రాంతానికి ఓ నటు డు సగటు నేత కార్మికుడి దైన్యాన్ని ప్రపంచానికి చూపెట్టడానికి మట్టినేలపై కూర్చోవాలనుకోవడం ఎంత గొప్ప విషయం. అన్నట్టు మూడునెల్ల క్రితమే సుష్మన్ సిన్మాని బ్రిటన్‌లో ప్రదర్శించి ఓంపురి నటనను వేనోళ్ల కొనియాడారట.

నటన అంటే ఆషామాషీ కాదని, సీరియస్ వ్యవహారమని-నిస్సహాయతనీ, వేదననీ, భయాన్నీ ఒక్కసారి గుండెల్లో నిలువుగా చీల్చి, నటనను మన నరాల్లోకి, నెత్తుటి ప్రవాహంలోకి డైరెక్టుగా ఇంజెక్టు చేసే నటుడని కనిపెట్టలేకపోయా.అసలే ఎగుడు దిగుడు చర్మమున్న మొహం, మార్చుకున్నట్టుంటారు. మనమేదో తప్పు చేసినట్టు చూస్తారు. అదేంటో నటిస్తున్నట్టో, పోనీ జీవిస్తున్నట్టో వుండదస లు. ఇప్పుడనిపిస్తోంది సిన్మాల్లో-ఒక స్పార్క్ రియాల్టీ మొహం మీద గుద్దినట్టుగా, ఒక కన్నీటి బొట్టు అప్రయత్నంగా బుగ్గమీద జారినట్టుగా.శ్రీశ్రీ కవిత్వం ఎలాంటిదంటే అది అంతరంగాన్ని తాకుతుంది. ఆ అంతరంగం అంటూ వున్నవాళ్లకి అం టాడు చలం. అలాగే ఓంపురిని నటునిగా ఆ అంతరంగ లోతుల్ని ధ్వనిస్తాడు. ప్రతిధ్వనిస్తాడు.
mruthyunjaya
సుష్మన్ సిన్మాలో రాములు పాత్రలో ఓంపురి తన భార్య గౌరమ్మ (షబానా ఆజ్మీ)తో అంటాడు ఆవేదనగా ఇది మగ్గం కాదు-ఒక ట్రాప్, దీంట్లో చిక్కుకొని బయటపడలేకపోతున్నాననిఆ సీన్‌లో ఓంపురి ప్రదర్శించిన హావభావాలు చేనేత దుస్థితికి అద్దం పడుతుంది.సహకార సంఘాల వైఫల్యంతో పాటు ఆధునిక పరిశ్రమ, వాణిజ్యం ధాటికి అమూల్యమైన సంప్రదాయ చేనేత కళ ఎలా కొట్టుకుపోయిందో ఓ నేత కార్మికుడి పాత్రలో ఓంపురి అభినయాన్ని గుర్తించలేకపోయా.స్టీరియో టైపు యాక్టింగ్ ైస్టెల్‌ను బ్రేక్ చేసి అర్ధసత్య, ఆక్రోష్ లాంటి సిన్మాల్లో కొత్త నటనను పరిచయం చేశారని తెలుసుకోలేకపోయా.సుష్మన్‌సిన్మా మొదట్లో ఊరేగింపుగా వచ్చే బోనాల శబ్దానికి ధూంధాంగా పోతున్న ఓంపురి నేత బండిని చూస్తే ఇప్పుడు తీన్మార్ వేయాలనిపిస్తోంది.ఓ లెజెండ్ యాక్టర్ మా నట్టింట్లో తిరుగాడుతున్నాడన్న స్పృహ లేకుండా-హైదరాబాద్ దూరదర్శన్‌లో అభిలాష సిన్మా చూశాను గదా అని బోరున ఏడువ డం, ఓంపురిని కట్ అండ్ యాక్షన్ గ్యాప్‌లో ఇక చూసే ఛాన్స్‌లేదని గుండెలు లబలబా కొట్టుకోవడం తప్ప చేసేదేముంది?

ఓంపురి చనిపోయాడన్న వార్త వినగానే ఆయన రామ్ లింగమ్ అని మా నాయినని పిలిచే పిలుపే గుర్తొచ్చింది. మా నాయినా గుర్తొచ్చాడు.ఓంపురిని తలుచుకోవడమంటే భారతీయ సినిమా కు చెయ్యెత్తి నమస్కరించడమే... ఓ చేనేత కళాకారుడు, కార్మికుడైన మా నాయినతో గడిపిన ఓంపురి జ్ఞాపకాన్ని గుండెల్లో దాచుకోవడం అంటే గర్వం పెదవుల మీద చిరునవ్వుగా వికసించడమే!
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ కార్టూనిస్టు)

1120
Tags

More News

VIRAL NEWS