HomeEditpage Articles

ఇక్కడ ప్రజాస్వామ్యం - అక్కడ అప్రజాస్వామ్యం

Published: Sat,January 7, 2017 03:00 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

గత నవంబర్ 8న డిమానిటైజేషన్ కోరలు విప్పి కోట్లమంది సామాన్యులకు, పేదలకు, మధ్యతరగతి వర్గాలకు డెమనైజేషన్‌గా పరిగణించడంతో దేశమంతటా అందరి దృష్టి నోట్లరద్దు పైన, అది సామాన్య ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగిస్తున్న తీవ్ర నష్టం మీదనే ప్రధానంగా కేంద్రీకృతమైంది. అదే కాలంలో దేశంలో సంభవించిన ఇతర కీలక పరిణామాల మీద అందరి దృష్టి ప్రసరించలేదు.

గత రెండున్నరేండ్ల నుంచి సంభవిస్తున్నాయి. వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు విఘాతం కలిగించే అసహనం అనేక రూపాల్లో ఆందోళన కలిగిస్తున్నది. ఈ అనేక రూపాల్లో ఒకటి నోట్ల రద్దు. ఇది సరైన నిర్ణయం కాదంటున్న
వారి పట్ల అసహనం ప్రదర్శితమవుతున్నది. రాష్ర్టాల పట్ల, పార్టీల పట్ల అసహనం వ్యక్తమవుతున్నది.

prabhakarrao
ఈ ఇతర పరిణామాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది భారత ప్రజాస్వామ్యానికి సంబంధించినది. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు నోట్ల రద్దు ఆర్థికవ్యవస్థ సంక్షోభం కంటే ముఖ్యమైనది. దెబ్బ తగులగానే వెంటనే బాధ ఎంతగా ఉందో, దెబ్బ ఎంత తీవ్రంగా తగిలిందో తెలియదు. నోట్ల రద్దు తీవ్రత, అది కలిగించే నొప్పి, బాధ క్రమంగా తెలుస్తు న్నది. నోట్ల దెబ్బతో ఏర్పడింది హేర్‌లైన్ ఫ్రాక్చర్ కాదు, మేజర్ ఫ్రాక్చర్ అని, భారత ఆర్థిక వ్యవస్థ వెన్నెముక విరిగిందని. గత డ్బ్బై ఏండ్ల బహుముఖ కృషితో సాధించిన ఆర్థిక, సామాజిక అభివృద్ధి బుగ్గి పాలైందని ఈ దేశంలోని, ఇతర దేశాల్లోని ఆర్థికవేత్తలు విశ్లేషించి వివరిస్తుంటే ఎక్కెక్కి ఏడ్చే విషమ పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. యాభై రోజులు మీవి కావనుకొని ఓపిక పట్టండి, ఓరిమితో పొట్టలు మాడ్చండి, ఇక అన్నీ మంచి రోజులేనని చెప్పిన మాటలు కల్లలని, కబుర్లని వెల్లడైంది. కరెన్సీ, బ్యాంకింగ్ సదుపాయాలను యథాతథంగా ఇంకా పునరుద్ధరించలేదు.

ఇంతకుముందు వలె సామాన్యులు బ్యాంకుల్లో తమ కష్టార్జితాన్ని, న్యాయమైన సంపాదనను కొద్దిరోజులు దాచుకొని, అవసరమైనప్పుడు అవసరమైనంత తీసుకోగలిగే హక్కును భారత ప్రభుత్వం ఒక్క మాట దెబ్బతో తస్కరించింది. ఇది చిన్న పాటి తస్కరణ కాదు. కోట్ల మంది సామాన్యు లు క్యూలో ఇబ్బంది పడుతుంటే వివిధ రూపాల్లో పుష్కలంగా నల్ల సంపదలు ఉన్నవాళ్లు తమాషా చూస్తూ ఈ ప్రభుత్వాలు ఎంత తెలివి తక్కువవని పరిహాసం చేశారు. సామాన్య ప్రజాకోటికి ఈ దేశంలోని బ్యాం కుల మీద విశ్వాసం సన్నగిల్లింది. నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు, నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అని ఒక భావ కవి అన్నాడు. ఈ మాటలు ఒక కవి అంటే ప్రమాదం లేదు. కానీ, పాలకులు ఈ మాటలు అంటే ప్రమాదం. కోట్ల మంది ప్రజలు కష్టాలపాలు కాక తప్పదు. ఇది మంచి పని కాదని ఎందరు విజ్ఞులు చెప్పినా వినని వాళ్లు, వాస్తవాలను గుర్తించని వాళ్లు, తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అంటూ మొండికేసే వాళ్లు నిజంగా మూర్ఖు లే.

మూర్ఖుల మనసును రంజింపజేయడం సులభం కాదు. నోట్లర ద్దు బాధలను ప్రజలు సంతోషంతో భరిస్తున్నారని, ఎటువంటి గొడవలు, అల్లర్లు లేకుండా తమకే మద్దతిస్తున్నారని, నోట్లరద్దు నిర్ణయాన్ని హర్షిస్తున్నారనడం, పదే పదే అదే మాట అంటూ గోబెల్స్ ప్రచారం జరుపడం ఆత్మవంచన. నోట్లరద్దు నిర్ణయానికి, దాని విషమ పర్యవసానాలకు వ్యతిరేకంగా అల్లర్లు జరుగవచ్చని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భావించింది. ఇది దేశ ప్రజలకు ఆగ్రహం కల్గించే నిర్ణయమని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. అంతవరకు ఈ భావన బాగుంది. గత జలేతు బంధనం అన్నట్లు సుప్రీంకోర్టు నవంబర్ 8 నాటి నోట్ల రద్దు నిర్ణయం చట్టబద్ధమా లేక చట్ట విరుద్ధమా అన్న ప్రశ్నపై విచారణను సుప్రీంకోర్టు రాజ్యాంగ పీఠానికి నివేదించింది. ఈ రాజ్యాంగ పీఠం (కాన్‌స్టిట్యూషనల్ బెంచ్)ఎప్పుడు ఏర్పాటవుతుందో, ఎప్పుడు విచారణ ప్రారం భిస్తుందో, ఆ విచారణ ఎంతకాలం కొనసాగుతుందో, విచారణలో ఎటువంటి తీర్పు వస్తుందో ఎవరికీ తెలియదు. జరుగవలసిన నష్టమంతా జరిగింది. తమ పాలనలో దేశమంతా అభివృద్ధితో వెలుగు లు విరజిమ్ముతున్నదని, తమ అధినేత వికాస్ పురుష్ అని 2003 లో ఇండియా షైనింగ్ ప్రచారం చేశారు. అది విపరీత ప్రచారం. ఈ ప్రచారాన్ని తామెంత మాత్రం నమ్మడం లేదని 2004 ఎన్నికల్లో దేశ ప్రజలు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు.

నోట్లరద్దు దెబ్బతో దేశ ప్రజలు గిలగిల్లాడుతున్న క్లిష్ట పరిస్థితుల్లో భారత పార్లమెంట్ ఉభయసభల శీతాకాల సమావేశాలు జరిగాయి. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో కూలంకష చర్చ జరుగుతుందని, ప్రజల గోడును వెలిబుచ్చే అవకాశం ప్రజాప్రతినిధులకు పార్లమెంట్ వేదికపై లభిస్తుందని ప్రజాతంత్రవాదులందరూ గంపెడాశలు పెట్టుకున్నారు. నవంబర్ 8 రాత్రి టీవీలో గంభీరంగా ప్రసంగిస్తూ నోట్లరద్దు కబురును చల్లగా చెప్పి ప్రజల గుండెలదరగొట్టిన ప్రధాని పార్లమెంటు ఉభయ సభల ప్రారంభంలోనే ఒక ముఖ్య ప్రకటన చేసి నోట్లరద్దు గురించి వివరిస్తారని దేశ ప్రజలు, జాతీయ, అంతర్జాతీయ పరిశీలకులు ఆశించారు. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు, పార్లమెంటరీ నియమ నిబంధనలకు, సంప్రదాయాలకు మాతృక బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ.

అందువల్ల, మొదటి, రెండవ, మూడవ పార్లమెంట్ వరకు ఉభయ సభల్లో అతిరథ, మహారథులైన పాలకపక్ష, ప్రతిపక్ష పార్లమెంటేరియన్లు చర్చల సందర్భాలలో తరచూ బ్రిటిష్ మేధావి, న్యాయశాస్త్ర నిష్ణాతుడు ఎరిస్కిన్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ గురించి ప్రస్తావించి దానినే మార్గదర్శకంగా పరిగణించేవారు, గౌరవించేవారు. అనంతర కాలం పార్లమెంట్‌లో ఎరిస్కిన్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రస్తావనే వినిపించడం లేదు. పార్లమెంటరీ ప్రాక్టీస్ సంప్రదాయాలను గౌరవించినైట్లెతే ప్రధాని నోట్లరద్దు గురించి, అనంతర పరిణామాల గురించి పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటించి, ఆ ప్రకటన పై సమగ్ర చర్చకు అవకాశం ఇవ్వవలసి ఉంటుంది. కానీ, నోట్లర ద్దు విపరీత నిర్ణయంతో దేశంలోని కోట్లమంది ప్రజలు ఒక వంక అష్టకష్టాలు పడుతుండగా మన పార్లమెంట్ తన దారిన తాను వెళ్లింది. పదిహేను రోజులు సమావేశాలు జరిగినా ప్రధాని ప్రకటన చేయలేదు.

నోట్లరద్దుపై దేశ ప్రజల కష్టాలపై, ఇబ్బందులపై చర్చే జరుగ లేదు. నినాదాలతో, ప్రతి నినాదాలతో, వరు స వాయిదాలతో, వాకౌట్లు, బహిష్కరణలతో కనీసం ఒక్క నిమిషమైనా ఏ చర్చ జరుగకుం డా ఉభయసభల శీతాకాల సమావేశాలు వెలుతురు లేని వేడి మంటలతో ముగిశాయి. అవినీతి కేవలం ఒక్క నల్లధనం రూపంలోనే ఉం టుందనుకోవడం పొరపాటు. సమాజంలో అవినీతి అనేక వికృ త రూపాలు ధరిస్తున్నది. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఒక జటిల సమస్యపై పార్లమెంట్‌లో చర్చ జరుగక పోవడం అప్రజాస్వామ్యం-అవినీతి కూడా. ప్రజాస్వామ్య సంప్రదాయాల పరిరక్షణలో, పరిపోషణలో అన్ని రాష్ర్టాలకు మార్గదర్శత్వం వహించవలసిన కేంద్రం ఆ పవిత్ర విధినిర్వహణలో ఘోరం గా విఫలమవుతున్నది. అక్కడ కేంద్రంలో అప్రజాస్వామ్యం వెక్కిరిస్తున్నది. ఇక్కడ రెండున్నరేండ్లు మాత్రమే నిండిన తెలంగాణలో ప్రజాస్వామ్యం సహస్ర దళాలతో వికసిస్తున్నది.

అక్కడ ప్రజల క్లిష్ట సమస్యలపై ఎటువంటి ప్రస్తావన లేకుండా,చర్చలు లేకుండా సమావేశాలు ఘోరంగా విఫలమై వాయిదాపడ్డాయి. ప్రజాస్వామ్యం పరిహాసం పాలైంది. అందుకు భిన్నంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మొదటి రోజునుంచే అన్ని ప్రజాసమస్యలపై, అభివృద్ధి పథకాలపై, సంక్షేమ కార్యక్రమాలపై సాకల్యమైన, ఫలప్రదమైన చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ప్రధాని పార్లమెంట్ చర్చలను నిర్వహించలేకపోయారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమత్రి స్వయంగా సవ్యసాచి అయి పలు చర్చలకు స్ఫూర్తినిస్తున్నారు. అక్కడున్నది అప్రజాస్వామ్యం, ఇక్కడున్నది పరిణతి పొందిన ప్రజాస్వామ్యం. జాతిపిత గాంధీజీ అన్నారు. ..A democrat must be utterly selfless. He must think and dream not in terms of self or party but only of democracy. Democracy is not a state in which people act like sheep. Under democracy individual liberty of opinion and action is jealously guar-ded.... కానీ, ఆయన కలలను భగ్నంచేసే అవాంఛనీయ పరిణామాలు గత రెండున్న రేండ్ల నుంచి సంభవిస్తున్నాయి.వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు విఘాతం కలిగించే అసహ నం అనేక రూపాల్లో ఆందోళన కలిగిస్తున్నది.

ఈ అనేక రూపాల్లో ఒకటి నోట్ల రద్దు. ఇది సరై న నిర్ణయం కాదంటున్న వారి పట్ల అసహనం ప్రదర్శితమవుతున్నది. రాష్ర్టాల పట్ల, పార్టీల పట్ల అసహనం వ్యక్తమవుతున్నది. ఈ మధ్య జమ్మూ-కశ్మీరులో మంత్రివర్గ సమావేశం నుంచి ముఖ్యమంత్రి బయటికి రావలసిన అసహనం చెలరేగింది. మరో ముఖ్యమంత్రి ప్రధానిని అరెస్టు చేయాలని డిమాండు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. గత డ్బ్బై ఏండ్లలో ప్రధాని మీద కురియని విమర్శల విశేషణాలిప్పుడు కురియడం విశేషమే. రాజకీయ,ఆర్థిక నిరంకుశ ధోరణికి, సామాజిక అసహనానికి, ఫెడరలిజం సూత్రాలకు తిలోదకాలిచ్చే తీవ్ర వైఖరి ప్రాబల్యం వహిస్తున్న ఈ క్లిష్టదశలో దేశ ప్రజల ప్రజాస్వామ్య భావన అగ్ని పరీక్షకు గుర వుతున్నది.

1116
Tags
 ,