తూతూ మైమై...


Sat,October 5, 2019 12:59 AM

ఆఫ్గనిస్థాన్‌కు మొట్టమొదట సేనలను పంపి ఆక్రమించింది రష్యా. రష్యా వచ్చిందన్న సాకుతో తమ సేనలను పంపింది, మతోన్మాదతాలిబన్లను సృష్టించింది, తాలిబన్లకు అన్నివిధాలా సహాయపడటానికి పాకిస్థాన్‌ను ఉపయోగించుకున్నది అమెరికా. ఐదేండ్ల కింద ఉక్రెయిన్‌కు తన సేనలను పంపి దేశ ద్రోహులను, తిరుగుబాటుదారులను ప్రోత్సహించింది రష్యా. దెయ్యాలు వేదాలను వల్లించడం అంటే ఇదే! ఐదు నెలల కిందట ట్రంప్ ప్రభుత్వం వాణిజ్యరంగంలో భారతదేశానికి ఉన్న ప్రత్యేకస్థానాన్ని రద్దుచేసింది. హ్యూస్టన్ సమావేశం తర్వాత ఈ స్థానం తిరిగి భారతదేశానికి లభిస్తుందని ఆశించినవారికి ఆశాభంగం తప్పలేదు. హౌడీ మోదీ సమావేశంలో భారతదేశం చాలా బాగుందని ప్రకటించిన ప్రధాని మోదీజీ ఢిల్లీ తిరిగి రాగానే భారత ఆర్థికరంగం పరిణామాలు మరింత నిస్పృహ కలిగించాయి. అభివృద్ధి రేటు మరింత తగ్గిందన్న వాస్తవం కళ్లెదుట కనిపించింది.

Prabhakar-Raoo
గత శతాబ్దం ప్రథమ అర్ధభాగంలో మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు సంభవించాయి. అప్పుడప్పుడే ఉత్పత్తి అవుతున్న అణ్వాస్ర్తాలను అమెరికా జపాన్‌లోని నాగసాకి, హిరోషిమాలపై ప్రయోగించి వినాశనాన్ని సృష్టించడంతో రెండవ ప్రపంచయుద్ధం ముగి సింది. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ (జర్మనీ), ముస్సోలినీ (ఇట లీ), కుముజో (జపాన్) నాయకత్వంలోని నాజీ, ఫాసిస్టు శక్తుల భయంకర కూటమిని ఓడించడానికి కమ్యూనిస్టు సోవియట్ యూనియన్, క్యాపిటలిస్టు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు వాటి సైద్ధాంతిక విభేదాలను తాత్కాలికంగా విస్మరించి చేయికలిపి ఒక కూటమిగా ఏర్పడక తప్పలేదు. రెండవ ప్రపంచయుద్ధం ముగిసి నాజీ, ఫాసిస్టు అమానుష శక్తుల కూటమి కుప్పకూలినా ఇతర విపత్కర, దుష్ట పరిణామాలు ప్రపంచమంతటా సంభవించాయి. ప్రత్యక్ష యుద్ధం స్థానంలో, రెండు విభిన్న సైద్ధాంతిక వ్యవస్థలకు నాయకత్వం వహిస్తున్న రెండు అగ్ర రాజ్యాలు సోవియట్ యూనియన్, అమెరికాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కోల్డ్‌వార్, శీతల యుద్ధం మొదలైంది. రెండవ ప్రపంచయుద్ధం ముగిసి నా, వలసవాదం, సామ్రాజ్యవాదం అంతం కాలేదు. బ్రిటిష్ పాలకులు భారత సైనిక బలాలను, ఆర్థిక వనరులను రెండవ ప్రపంచయుద్ధంలో ఉపయోగించుకున్నారు. గాంధీ మహాత్ముని అహింస, శాంతియుత సత్యాగ్రహం మార్గంలో అపూర్వ ఉద్యమాలు నడిపి విముక్తిపొందిన స్వతంత్ర భారతదేశం స్ఫూర్తితో రెండవ ప్రపంచయుద్ధం తర్వాతనే ప్రపంచమంతట వలస, సామ్రాజ్యవాదం అంతమైంది.

రెండు ప్రపంచ యుద్ధాల, ప్రాంతీయ ఘర్షణల వినాశనాన్ని కళ్లార చూసిన ప్రపంచ ప్రజ లు ఇక యుద్ధాలు, వినాశనాలు వద్దనుకున్నారు. ప్రపంచమంతట శాం తి ఉద్యమాలు, యుద్ధోన్మాద వ్యతిరేకత బలపడినాయి. తెలుగుతో సహా అనిభాషల్లో శాంతిసందేశ సాహిత్యం పుంఖానుపుంఖంగా వచ్చింది. యుద్ధోన్మాదానికి, ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా ఇప్పుడా స్ఫూర్తి, ఉద్యమశీలత కన్పించడం లేదు. కవులు, రచయితలు గొంతు విప్పడం లేదు. వివిధ సమస్యల శాంతియుత పరిష్కారం, సదవగాహన, సఖ్యత, సామరస్యం, అభివృద్ధి, వికాసం, సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా 74 ఏం డ్ల కిందట 1945లో అవతరించిన ఐరాస, అందులో భాగమైన భద్ర తామండలి ఈ లక్ష్యాల సాధనకు ఎంతవరకు ఉపకరిస్తున్నాయన్న ప్రశ్న ఈ రోజు శాంతికాముకుల హృదయాల్లో ఉత్పన్నం కావడం సహజం.

ఐరాస తన లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమైన ప్పుడు, ప్రస్తుతం ఐరాసలో సభ్యత్వం గల దాదాపు రెండువందల దేశా లు, ముఖ్యంగా అగ్రదేశాలుగా చలామణి అవుతున్న సంపన్నదేశాలు, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం (వీటో అధికారంతో) ఉన్న అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ సమితి ఆశయాలను, లక్ష్యాలను గౌరవించనప్పుడు అంతర్జాతీయ అశాంతికి కారణమయ్యే ఘర్షణలు, ప్రాం తీయ యుద్ధాలు సంభవిస్తాయి. ఇప్పుడు ఇదే జరుగుతున్నది. ఐరాస అవతరించినప్పటి నుంచి పశ్చిమ ఆసియా అంతర్గత సమస్యలతో, ఘర్షణలతో అగ్నిగుండంగా మారింది. ఈ అగ్నిగుండంలో అటు అమెరికా, ఇటు రష్యా నిరంతరంగా సమిధలు వేస్తూ రగుల్కొల్పుతున్నా ఐరాస చేతులు ముడుచుకొని కూర్చుంటున్నది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని (1954లో జవహర్‌లాల్ నెహ్రూ, చౌఎన్‌లై ప్రతిపాదించిన పంచశీల సూత్రాల్లో ఇదొక సూత్రం) ఇటీవల భారత ప్రధాని మోదీజీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నీతిబోధ చేశారు. రెండు నెలల నుంచి ఓపెన్ జైలుగా మారిన కశ్మీర్ గురించి ఎవరూ మాట్లాడరాదని చెప్పడానికి!

ఆఫ్గనిస్థాన్‌కు మొట్టమొదట సేనలను పంపి ఆక్రమించింది రష్యా. రష్యా వచ్చిందన్న సాకుతో తమ సేనలను పంపింది, మతోన్మాద తాలిబన్లను సృష్టించింది, తాలిబన్లకు అన్నివిధాలా సహాయపడటానికి పాకిస్థాన్‌ను ఉపయోగించుకున్నది అమెరికా. ఐదేండ్ల కిందట ఉక్రెయిన్‌కు తన సేనలను పంపి దేశ ద్రోహులను, తిరుగుబాటుదారులను ప్రోత్సహించింది రష్యా. దెయ్యాలు వేదాలను వల్లించడం అంటే ఇదే! ఈ అగ్రరాజ్యాలు వాటి స్వార్థ ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న సైనిక కూటము ల, ఇతర కూటముల కుట్రలను, కుటిల రాజకీయాలను చిత్తుచేయడానికి ఐరాస ఆశయాలకు అనుగుణంగా 25 ఏండ్ల కిందట నెహ్రూ, మార్షల్ టిటో, గమాల్ అబ్దుల్ నాసర్, సుకర్నో, ఫిడెల్ కాస్ట్రో, ఎన్‌క్రుమా, పాట్రిస్‌లుముంబా తదితరుల నాయకత్వంలో అవతరించిన అలీనో ద్యమం క్రమంగా వందకు మించిన దేశాల సభ్యత్వంతో అంతర్జాతీయ రంగంలో ఒక బలమైన శక్తిగా రూపొందింది. తొలినుంచి అలీనోద్యమం అంటే అమెరికాకు ఎక్కడలేని మంట. అలీన విధానం, అలీనోద్యమం కారణంగా భారతదేశం తమకు ఉపగ్రహం కావడం లేదని అమెరికన్ పాలకులు-వారి పార్టీ ఏదైనప్పటికీ ఆగ్రహించారు. అలీన ఉద్యమం విచ్ఛిత్తి కోసం అమెరికా ఎదురుచూసింది.

2014లో ఏర్పడిన మోదీజీ ప్రభుత్వపు అనాసక్తి, అలక్ష్యధోరణి కారణంగా అలీన ఉద్యమం నిర్వీర్య మై విచ్ఛిన్నమైంది. ఇవే కారణాల వల్ల దక్షిణ ఆసియా దేశాల సహకార సం స్థ సార్క్ అంతరించబోతున్నది. ఇండియాను ఉపగ్రహం చేసుకోవడానికి యూఎస్‌ఏకు, ట్రంప్ ప్రభుత్వానికి రాజమార్గం ఏర్పడింది. ఈ మధ్య హ్యూస్టన్‌లో, హౌడీ మోదీ కార్యక్రమంలో భారత ప్రధాని మోదీజీ చేతులెత్తి అగ్లేబార్ ట్రంప్ సర్కార్ నినాదం ఇవ్వడంతో, అమెరికా ఫర్ అమెరికన్స్ అన్న నినాదం ఇచ్చిన ట్రంప్ ఇండియా ఫర్ అమెరికా అంటూ నినదించినా అడ్డులేదు. ఎందుకంటే, గత 72 ఏండ్లలో ఎన్నడూ లేనిది ఇప్పుడు, గత ఆరేండ్ల నుంచి, ఇండియా దటీ జ్ భారత్‌పై యూఎస్‌ఏ ఆధిపత్యం నడుస్తున్నది. ట్రంప్ చెప్పగానే, ఆదేశించగానే, ఇరాన్ నుంచి చౌకగా, అవసరమైనంత లభిస్తున్న చమురును కొనడం మానేసి అమెరికాలో ఎక్కువ ధరలకు కొనడానికి తలవంచాం. రష్యా నుంచి యుద్ధ విమానాలను కొనవద్దని ట్రంప్ ఆదేశించాడు-రష్యా నుంచి కొనడం మానేస్తాం; తన అంతర్జాతీయ వ్యూహంలో భాగంగా రేపు ట్రంప్ మన సరిహద్దు దేశం కమ్యూనిస్టు చైనా పైకి కత్తి దూయమంటాడు; మనం కత్తి దూయడమే కాదు ఏకే 47ను ఎక్కుపెట్టడానికి సిద్ధమవుతాం.

కాలం ఆగదు. అప్పుడే రెండు నెలలైంది కశ్మీరుకు తాళంవేసి, కశ్మీరు ప్రజల గొంతు నులిమి. ఆగస్టు 9 ఇంతవరకు క్విట్ ఇండియా చరిత్రాత్మక దినంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది, భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఉజ్వల ఘట్టమైంది. ఈ ఆగస్టు 5 డెత్ టు డెమొక్రసి దినమైంది; స్వతంత్ర భారతదేశపు అంతర్జాతీయ ప్రసిద్ధికి, గౌరవ మర్యాదలకు కళంకం కలిగించింది. ఒకవంక ఇది మా అంతర్గత సమస్య అంటూనే ప్రధాని మోదీజీ స్వయంగా దేశదేశాలకు వెళ్లి కశ్మీరులో తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. కశ్మీరుకు మాత్రం వెళ్లడంలేదు. తమ చర్యల వల్ల కశ్మీరుకు ఏ విధంగా లాభం జరుగుతుందో వివరించడం లేదు. రెం డునెలల నుంచి దేశం శిరోభాగం కశ్మీరు బంధనాల్లో చిక్కుకొని అమిత వేదనతో అలమటిస్తున్నా మిగతా దేశం హృదయం చలించకపోవడం, స్పందించకపోవడం ఒక విభ్రాంతికర విచిత్ర సన్నివేశం. హ్యూస్టన్ హడావుడి, జాతిపిత బిరుదు ప్రదానం అనంతరం ఐరాస 74వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో కేవలం 15 నిమిషాలు లాంఛనప్రాయంగా ప్రసంగించిన ప్రధాని మోదీజీ కశ్మీరు ముచ్చట తీయలేదు.

తన లఘు ప్రసంగంలో చోటుచేసుకోవలసినంత ప్రధాన అంశం కశ్మీరు కాదని బహుశా ప్రధాని మోదీజీ భావించి ఉంటారు. తర్వాత ప్రసంగించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన యాభై నిమిషాల ప్రసంగంలో అధి కభాగాన్ని కశ్మీరుకే కేటాయించాడు. ఇమ్రాన్ ప్రసంగంలో తమ సమస్యకు చాలా ప్రాధాన్యం లభించినందుకు కశ్మీరు ప్రజలు తమ ఇండ్లలో కూర్చొని సంబురాలు చేసుకున్నారట. భారతదేశం ప్రపంచానికి బౌద్ధం ఇచ్చిందని ప్రధాని మోదీజీ ఐరాస ప్రసంగంలో అన్నారు. గయాలో జ్ఞానోదయమైన బుద్ధుడు నిజానికి భారతీయుడు కాడు-ఆయన నేపాలీ. అన్నిదేశాలు, సకల ప్రపంచం తన కుటుంబం అని భావించి శాంతి సందేశం అందించిన మహా పురుషుడు బుద్ధుడు. క్రీస్తు పూర్వం 270 ఏండ్ల కిందట సకల భారతావనిని ఆక్రమించాలన్న అభిలాషతో కళింగను గెలిచి, అక్కడి రక్తపుటేరులను చూసి, హాహాకారాలను విని, హృదయం చలించి బౌద్ధమార్గం అనుసరించిన చక్రవర్తి అశోకుడు. ఆయన మార్గంలో మనం నడువగలమా?! ఇమ్రాన్ ప్రసంగానికి ఐరాస లో జవాబు ప్రసంగం చేసింది భారత విదేశాంగశాఖలోని ఒక జూనియ ర్ ఉన్నతాధికారిణి. గతంలో విజయలక్ష్మి పండిత్ ఐరాస అధ్యక్షురాలు-వి.కె.కృష్ణమీనన్, ఎం.సి.చాగ్ల, సర్దార్ స్వరణ్‌సింగ్, బెనగల్ నర్సింగరా వు, సి.పి.రామస్వామి అయ్యర్ వంటి ఉద్ధండులు భారతదేశం పక్షాన ఐరాసలో అద్భుత ప్రసంగాలు కావించారు.

1957లో భద్రతామండలిలో కశ్మీర్‌పై కృష్ణమీనన్ 8 గంటలు ఎడతెగకుండా ప్రసంగించి రికార్డ్ సృష్టించారు. హిట్లర్‌తో స్ఫూర్తిపొందిన ఆర్‌ఎస్‌ఎస్‌లో మోదీజీ సభ్యుడని ఇమ్రాన్ తన ప్రసంగంలో అన్నాడు. ఐరాస రెండు వందల దేశాల అధినేతలు, ప్రతినిధులు విన్నారు-భారత విదేశాంగశాఖ అధికారిణి జవాబీ ప్రసంగంలో ఈ మాటకు జవాబు లేదు. తూతూ మైమై ప్రసంగాలతో ఒరిగేది, జరిగేదేమీ ఉండదు. హౌడీ మోదీ కార్యక్రమం తర్వాత హఠాత్తుగా జరిగింది కమ్యూనిస్టు చైనా ధోరణిలో భారతేదేశం పట్ల కాఠిన్యం హెచ్చడం. అమెరికాలో మోదీజీ వారం రోజుల పర్యటన తర్వాత ఈ కాఠిన్యం చాలా స్పష్టంగా కన్పించింది. న్యూక్లియర్ ఫ్యూయ ల్ సప్లయ ర్ గ్రూపులో భారతదేశం సభ్యత్వానికి చైనా మరోసారి అడ్డుపడింది. ట్రంప్ వల్ల భారతదేశానికి కలిగిన ప్రయోజనం శూన్యమని హఠాత్పరిణామాలు స్పష్టం చేశాయి.

ఐదు నెలల కిందట ట్రంప్ ప్రభుత్వం వాణిజ్యరంగంలో భారతదేశానికి ఉన్న ప్రత్యేకస్థానాన్ని రద్దుచేసింది. హ్యూస్టన్ సమావేశం తర్వాత ఈ స్థానం తిరిగి భారతదేశానికి లభిస్తుందని ఆశించినవారికి ఆశాభంగం తప్పలేదు. హౌడీ మోదీ సమావేశంలో భారతదేశం చాలా బాగుందని ప్రకటించిన ప్రధాని మోదీజీ ఢిల్లీ తిరిగి రాగానే భారత ఆర్థికరంగం పరిణామాలు మరింత నిస్పృహ కలిగించాయి. అభివృద్ధి రేటు మరింత తగ్గిందన్న వాస్తవం కళ్లెదుట కనిపించింది. కశ్మీరుతో పాటు భారతదేశమంతట, ముఖ్యంగా శాంతిభద్రతలకు భంగం కలుగుతున్న ప్రాంతాల్లో మోహరించిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళా ల వారికి నెలనెల ఇచ్చే రూ. 3 వేల భృతిని ఈ సెప్టెంబర్ నుంచి ఇవ్వడం లేదన్న కఠోర సత్యం వెల్లడైంది. దేశ వ్యవహారాల శాఖ ఈ భృతికి అవసరమైన రూ. 800 కోట్లను విడుదల చేయడం లేదని ఒక చేదుకబురు బయటపడింది! నానాటికి తీసికట్టు నాగం బొట్టు అంటారు అందువల్లనే.

343
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles