సృజనశక్తిని పెంచేదే విద్య

Sat,January 19, 2019 11:15 PM

తెలంగాణ రాష్ట్రం అనేక విషయాల్లో దేశానికే ఆద ర్శంగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే అతి ముఖ్య మైన విద్యారంగంలో సమూల, సమగ్ర మార్పు లు చేయవలసిన అవసరం ఉన్నది. మిగతా రంగాలకు, విద్యారంగానికి ఒక మౌలికమైన భేదం ఉన్నది. వ్యవసా యం, వైద్యం వంటివి స్థానిక ప్రాంతీయ, భౌగోళిక, వాతావరణ పరిస్థితులను అనుసరించి సాగుతాయి. కానీ విద్య అనేది మానవ వనరులను పెంపొందించేది కనుక ఇతర రాష్ర్టాలతో దేశాలతో సంబంధాలు నెలకొల్పి, సాగించే సాధనం కనుక ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు, కాలానికి అనుగుణంగా దేశీయ పరిస్థితులను సమన్వ యం చేసుకుంటూ ఈ రంగాన్ని తీర్చిదిద్దాలి. ముఖ్యంగా భాషా విధానాన్ని రూపొందించటంలో కేంద్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. దాని ఫలితంగా ఇప్పుడు దేశంలోని విద్యావంతులకు కూడా మాతృభాష రాదు, పర భాష ఇంగ్లీషూ రాదు. వారివారి నేపథ్యాన్ని బట్టి, పట్టుదల బట్టి కొందరికి తప్ప! ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో కొన్ని మౌలికమైన మార్పు లు చేస్తే మిగితా పథకాల లాగా దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది మన రాష్ట్రం. ఈ సమూల మార్పులు ప్రాథమిక దశ నుంచీ పరిశోధనా దశ దాకా చేయవలసి ఉన్నది. అన్ని స్థాయిలలో అవసరమైన మార్పులు చేస్తే విద్యార్థులలో కిం దిస్థాయి నుంచీ ఆలోచనా బలం, భావనా పటిమ, ఊహాశక్తి, సృజన శక్తి పెరిగి వారి విజయానికి తోడ్పడుతాయి. ప్రాథమిక దశ: ఇది పై స్థాయిలలో విజయానికి పునాది వంటిది. 5వ తరగతి పూర్తయ్యేసరికి 10, 11ఏండ్ల వయస్సు వచ్చే విద్యార్థులకు స్వభావం, ఆలోచనా సరళి, చిత్తవృత్తులు, భావాలు, ప్రపంచం, చుట్టుపక్కల మనుషుల పట్ల ప్రవర్తన మొదలైనవన్నీ ఏర్పడిపోతాయి. ఈ సమయంలో వారు ఆహ్లాదకరమైన వాతావరణంతో, ప్రేమాభిమానాలు చూపించే మనుషుల మధ్య పెరిగితే జీవితం పట్ల, ప్రపంచం పట్ల సకారాత్మక భావాలు, మానవీయత ఏర్పడి క్రమంగా పెరుగుతాయి. దీనికితోడు శారీరకంగా సున్నితంగా ఉంటారు కాబట్టి రక్షణ కూడా వారికి చాలా అవసరం. మనసుమీద, బుద్ధి మీద ఒత్తిడి కలిగించని వాతావరణం ఉండాలి.

తెలంగాణలో స్వయం పాలన మొదలయ్యాక అంగన్‌వాడీలు బలపడ్డాయి. 1వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చేరేవరకు చిన్నపిల్లలు రెండేండ్ల నుంచి ఈ అంగన్‌వాడీల్లో ఉంటారు. ఈ సెంటర్లలో 10వ క్లాసు, ఇంటర్ అంతకంటే పైకి చదివిన వారెవరైనా ఉంటే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి 3 నుంచి 5 ఏండ్ల పిల్లలకు మాటలు, కథలు చెప్పటం వంటివి చేస్తే చిన్న పిల్లలకు ఏకాగ్రత, ఇతరులు మాట్లాడినవి విని అర్థం చేసుకునే నైపుణ్యాలు అలవడుతాయి. ఇతర పిల్లలతో స్నేహంగా, సఖ్యంగా ఉండటం నేర్పించాలి. అది వారు పెరిగాక సామాజిక జీవితంలో పనికివస్తుంది. వారువాడే వస్తువుల, చూసే జంతువుల, చెట్ల బొమ్మలేయడం, వాటికి రంగులేయడం నేర్పిస్తే వారి పరిశీలనాశక్తి, కళానైపుణ్యాలు పెరుగుతాయి. తమ గురించి వారు ఆలోచించడం మొదలుపెడుతారు. ఈ రకమైన నైపుణ్యాలు పెంచడం వల్ల వారు తర్వాతి స్థాయి అయిన 1వ తరగతికి వెళ్లినప్పుడు స్పష్టంగా ఆలోచించటం, మాట్లాడటం వచ్చేస్తుంది. ఇలా శిక్షణ సాగటానికి బోధించేవారికి ప్రత్యేకంగా శిక్షణనివ్వాలి. పిల్లలు ఇంటినుంచి బరువులేమీ తేకూడదు. ప్రతి పిల్లవానికి ఒక నోటు పుస్తకాన్ని పెట్టి వారు రోజూ నేర్చుకుంటున్నవి అందులో బోధకులే రాయాలి. ఇక ఈ పిల్లల కు 9 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ ఆటలు పాటల ద్వారా బోధన పూర్తిచేసి, బోజనానంతరం 2 నుంచి 4 దాకా నిద్రపుచ్చి, 4 నుంచి 5.30 దాకా ఆడిస్తే పనులకు వెళ్లే వారి తల్లిదండ్రులకు సౌకర్యంగా ఉంటుంది. ఇక దీనికి పైస్థాయి అయిన ప్రాథమిక దశ 1 నుంచి 5వ తరగతి వరకు కొనసాగుతుంది. ఈ స్థాయిలో పిల్లలకు భాషలు నేర్చుకునే శక్తి అధికంగా ఉం టుంది. కాబట్టి మూడు భాషలు (మాతృభాష, రాష్ట్ర భాష, ప్రపంచ భాష వాటితో పాటు లెక్కలు బోధించాలి. మాతృభాష తెలుగు అయితే రాష్ట్ర భాష హిందీ ఉండాలి. బంజారా, కోయ, గోండు వారికి వారి వారి మాతృభాషలు నేర్చుకునే వెసులుబాటు కల్పించాలి. హిందీ బదులు తెలుగు ఉండాలి. దీని వల్ల రెండు లాభాలున్నాయి. ప్రతి విద్యార్థికి తమ మాతృభాష చదివే అవకా శం, ప్రభుత్వ ఉద్యోగం కోసం కావలసిన తెలుగు/ ఉర్దూ కూడా చదువుకోవ డం. 6వ తరగతి నుంచి తెలుగు/ఉర్దూతో పాటు తమ మాతృభాషతో పాటు హిందీ కూడా బోధించవచ్చు.

భాషా బోధన ప్రాథమిక దశలో రకరకాల కథల ద్వారా చేసే ప్రక్రియను అభివృద్ధి చెందిన దేశాలైన నార్వే, ఫిన్‌లాం డ్, స్వీడన్, స్విట్జర్‌లాండ్, డెన్మార్క్ ఉపయోగిస్తాయి. దినచర్యకు సంబంధించిన సంభాషణలు ఉపయోగిస్తూ చిన్న పిల్లలకు ఆయా భాషలు సులువుగా వచ్చేటట్టు చేస్తారు. కథలు చెప్పటం ద్వారా వినికిడి, ఆ తర్వాత వాటిని వారి అవగాహన బట్టి రాయించటం ద్వారా ఊహాశక్తి, పదాలు, వాక్యాల కూర్పు అలవడుతాయి. భాషలు ఎప్పుడూ అవసరాన్ని బట్టి నేర్చుకోవటం, వాటిని రోజూ వాడటం ద్వారా వస్తాయి, వృద్ధి చెందుతాయి. ఈ కథలు కూడా నిడివి పెంచుతూ చెప్పడం వల్ల తేలికగా చదువటం అలవాటవుతుంది. ఇలా ఐదేండ్లు మూడు భాషలు నేర్చుకోవ టం, ఉపయోగించటం వల్ల ఆయా భాషల నిపుణత్వాల న్నీ పట్టుబడుతాయి. చిన్నతనంలోనే వారేమైనా తప్పులు చేస్తే దిద్దటం వల్ల సరైన భాషా ప్రయోగాలు అలవడుతాయి. ఇక 6వ తరగతి నుంచి ఏ మాధ్యమంలో ఆ విద్యార్థులు చదువు కొనసాగించినా, సామాన్య, సామాజిక శాస్ర్తాల వంటివి తేలికగా అర్థం చేసుకోవడమే గాక, రాయగలుగుతారు. అందుకే 5వ తరగతి దాకా పాఠ్యాంశాలు ఏవి ఉన్నా భాష మీదే ఉపాధ్యాయులు దృష్టిపెడితే పై స్థాయిల్లో చదువు తేలికవుతుంది. ఇక ఐదు క్లాసులకీ కూడా మూడు భాషలు, లెక్కలు 9 గంటల నుంచి 1గంట దాకా గంట చొప్పున బోధించి భోజన సమయమయ్యాక ఇతర నైపుణ్యాలు, మానసిక పెరుగుదల మీద దృష్టిపెట్టాలి. ఈ స్థాయిలో 2 నుంచి 3 దాకా రెండురోజులు ఒక భాషలో వారి స్థాయి కథలు చదివించాలి. వారు విన్న కథలైనా చదివే అలవాటు చేయాలి. 3 నుంచి 4 గంటల దాకా సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి లలిత కళలు నేర్పాలి. ఇవి కూడా రెండు రోజులు ఒకటి చొప్పున నేర్పి అభ్యాసం చేయించాలి. కళా దృష్టి పెరుగుతున్న కొద్దీ మనిషిలో కరుకుదనం, నేర ప్రవృత్తి తగ్గుతుందని శాస్త్రీయ పరిశోధనల ద్వారా నిరూపితమైంది.

పైగా రోజంతా చదువే కాకుండా పిల్లలకు ఇతర అంశాల పట్ల కూడా అవగాహన, ఉత్సుకత పెరుగుతాయి. తర్వాత 4 నుంచి 5.30 దాకా ఆటలు ఆడిస్తే మానసిక ఉల్లాసంతో పాటు వారి ఆరోగ్యం, శరీర దారు ఢ్యం బాగుంటాయి. ఎదుగుదల బాగుంటుంది. ఇక అసలు సమస్య స్కూల్ బ్యాగు బరువు. దీనికి చాలా తేలిక పరిష్కారం ఉంది. పిల్లల టెక్స్ పుస్తకాలు, క్లాసు పుస్తకాలు వారి వారి క్లాసుల్లోనే ఉంచి కేవలం హోంవర్కు పుస్తకాలు 4, ఒక స్కూల్ డైరీ ఇంటికి పంపించాలి. హోంవర్క్ కూడా పుస్తకాల్లో ఉన్న దే చూసి రాసేటట్టు కాకుండా విన్న అంశాలకు ఊహాశక్తి జోడించి జవాబులు రాసేటట్టు ఇస్తే వారిలోని నైపుణ్యాలు బయటకు వస్తాయి. స్వయంగా ఆలోచించి రాయటం అలవాటవుతుంది.ఈ రకమైన బోధన నేడు జరుగకనే విద్యార్థులకు కంఠస్థం చేయటం అలవాటవుతుంది. ఎప్పుడైతే కేవలం జ్ఞాపకశక్తి మీదే ఆధారపడుతారో, అప్పుడు వారి భావనాశక్తి దెబ్బతిని సృజనాత్మకత అంతరిస్తుంది. ఇది లేకనే ఇప్పుడు మన పట్టభద్రుల్లో కూడా కావలసిన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు, నేర్చుకున్న అంశాలు జీవితంలో ఉపయోగించగలిగిన నైపుణ్యాలు సంతరించుకోవటమే విద్య. చదివింది జ్ఞానంగా వారి జీవితానికి ఉపయోగపడేదే అసలైన విద్య. ప్రాథమిక దశలో భాషలు మాత్రమే నేర్పించాలన్నది రెండు శాస్త్రీయ సిద్ధాంతాల మీద ఆధారపడి చెప్పడం జరిగింది. ఒకటి: భాషలు నేర్చుకునే నైపుణ్యం చిన్నతనంలో ఎక్కువగా ఉండి 14 ఏండ్ల నుంచి క్రమంగా తగ్గుతుంది. అందు కే భవిష్యత్తులో కావలసిన భాషలు (ముఖ్యంగా మాతృభాష, ఇంగ్లీషు) చిన్నప్పుడే నేర్పించాలి. రెండు: భాషా పటిమ లేని విద్యార్థులకు (5వ తరగతి కంటే ముందు) వస్తు సంబంధమైన సామాన్య, సామాజిక శాస్ర్తాలు నేర్పకూడదు. విన్న విషయం అర్థం చేసుకొని రాయగలిగినప్పుడే అవి బోధించాలి.
Kanakadurga
చదువు అన్నది ఒత్తిడి కలిగించకుండా ఉల్లాసంగా సాగాలి. అప్పుడు పిల్లలకు తమంతట తామే చదువాలన్న ఉత్సాహం, చదివే శక్తి కలుగుతాయి. ముఖ్య విషయం ఏమంటే విద్యారంగంలో ఎన్ని వసతులు, సేవలు, హంగులు అమర్చినా రెండే అంశాలు అతి ముఖ్యం. బోధించేవారి నిబద్ధత, నేర్చుకునేవారి ఉత్సుకత. ఉపాధ్యాయులకు సరైన శిక్షణ అందించి, సరైన పాఠ్యాంశాలు కూర్చగలిగితే ఈ రెండు అంశాలు సాధ్యమే! ప్రముఖ అమెరికన్ భాషా వేత్త నోమ్ చామ్‌స్కీ ఇలా అంటాడు. మనిషిలో అన్ని నైపుణ్యాలనీ నిర్ణయించేది అతని భాషా నైపుణ్యమే! ప్రాథమిక దశలో విద్యార్థులకు ఇది అందించగలిగితే ప్రతి విద్యార్థి ఇతర అన్ని నైపుణ్యాలు కూడా సంతరించకుంటాడు.

637
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles