చచ్చిపోయిన ఒక బర్రె ఇచ్చెనంట!


Sat,January 19, 2019 01:31 AM

మన తాతలు నేతులు తాగారని చెప్పి పొంగిపోవడం, భుజాలు ఎగురేయడం హద్దుల్లో ఉన్నంతవరకు తప్పేమీ కాకపోవచ్చు. గత వైభవాన్ని తలచుకొని, తీరికగా నెమ రేసుకుంటూ సంతృప్తి పొందే స్వేచ్ఛ ప్రతి ఒకరికి ఉండవలసిందే. 120 ఏండ్ల కిందట మహాకవి గురజాడ రచించిన రసవత్తర నాటకం కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు జంద్యాలు కూర్చు తూ ఇంగ్లీష్ చదువులను తిడుతూ మన వేదాల్లో అన్నీ ఉన్నాయట అంటాడు. అవధానులు కేవలం సనాతనత్వం, ప్రాచీనత పట్ల పరమ అభిమానంతో ఆ మాటలు అన్నాడు, ఆయనకు స్వార్థం లేదు, రాజకీయాలు అసలే లేని అమాయకుడు, అజ్ఞాని ఆయన. ఇప్పటి సంగతి వేరు. ఇప్పుడు అజ్ఞానం, మూర్ఖత్వం, రాజకీయాలు, మతోన్మాదం మేళవించి తాండవిస్తున్నాయి. 104 ఏండ్ల నుంచి ఏటా దేశంలో ఏదో ఒక చోట ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్రానంతరం అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దాదాపు ఏటా ఇం డియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ప్రారంభించి సైన్స్ విషయాలే మాట్లాడి సైంటిఫిక్ టెంపర్‌మెంట్‌కు స్ఫూర్తినిచ్చేవాడు. అష్టగ్రహ కూట మి జరుగబోతున్నదని (ఈ మధ్య ఎన్నికల సమయాన తెలంగాణలో ఒక కూటమి ఏర్పడినప్పుడు సీఎం కేసీఆర్ కర్రు కాల్చి వాత పెట్టడం, ఆ వాత నుంచి ఆ కూటమి ఇంకా కోలుకోకపోవడం జగద్విదితం!). అందరు భయపడ్డప్పుడు, అదొక మూఢ విశ్వాసం అని నెహ్రూ భావించారు. అలహాబాద్‌లో బ్రిటిష్ పాలకులు ఓసారి కుంభమేళా సందర్భాన గంగ స్నానాన్ని నిషేధించారు.
Prabhakar-Rao
ఆ నిషేధాన్ని ధిక్కరించి గంగ స్నానం ఆచరించడానికి పండిత్ మదన్‌మోహన్ మాలవీయ తమ అనుచరుల తో వచ్చారు. బ్రిటిష్ పోలీసులు అడ్డుకున్నారు, బారికేడ్లు పెట్టారు. మాలవీయాజీ హఠాత్తుగా వెళ్లి గంగ ప్రవాహంలో దుంకారు. అనుచరులంతా తమాషా చూస్తూ నిల్చున్నారు. నెహ్రూ ఒక్కడే పోలీసు బలగాన్ని ఖాతరు చేయకుండా గంగలో దుంకి మాలవీయాజీకి అండగా ఉన్నారు. ఆ తృటిలో నెహ్రూ ప్రేరణ కలిగించింది దేశభక్తి, పెద్దమనిషి మాలవీయ పట్ల ఉన్న గౌరవం మాత్రమే. సైద్ధాంతికంగా విధానపరంగా మాలవీయాజీ, నెహ్రూ ఉత్తర దక్షిణ ధృవాలు. కుంభస్నానంలో నెహ్రూ కు ఆసక్తి లేదని అందరికీ తెలుసు. పాలకుల, రాజకీయ నాయకుల ప్రమేయం, జోక్యం, ప్రభావం లేకుండా వందేండ్ల ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరిగి దేశంలో శాస్త్రీయ, వైజ్ఞానిక భావనలకు స్ఫూర్తినిచ్చాయి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ స్థాపకులు ఇద్దరు ఆంగ్లేయ సైంటిస్టులు. అంతవరకు సవ్యంగా, సజావుగా, సామరస్యపూర్వకంగా, ఫలప్రదంగా కొనసాగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో రాజకీయ విస్ఫోటనం ఏదో జరిగి ఆ సంస్థ ఫిజిక్స్‌లో, కెమిస్ట్రీలో కలవర కారకమైన మార్పు వస్తున్న సంకేతాలు కనిపించాయి. ఏటా ఇండియన్ సైన్స్ కాం గ్రెస్ సమావేశాల్లో పాల్గొని క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్న దేశ, విదేశీ సైంటిస్టుల్లో (వారిలో కొందరు నోబెల్ బహుమతి గ్రహీతలు) ఇక ఈ సమావేశాలకు దూరంగా ఉండటం మంచిదన్న అభిప్రాయం బలపడుతున్నది. ఎందువల్ల ఈ మార్పు సంభవిస్తున్నది, కారణాలేమిటి? ఈ (2019) జనవరి తొలివారంలో 3-7 తేదీల్లో పంజాబ్‌లోని జలంధర్ లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ తీరుతెన్నులపై, సమావేశ ప్రసంగాల సరళిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. శాస్త్రీయ ప్రాతిపదిక, వైజ్ఞాని క ఆధారాల్లేని అంశాలతో కూడిన, కట్టు కథలు, పిట్ట కథలు, పుక్కిటి పురాణాలతో నిండిన, వాస్తవ నిరూపణ కొరవడిన, దురభిమాన పూరి త ప్రసంగాలను నిర్వాహకులు ఏవిధంగా అనుమతిస్తున్నారని అనేకులు ప్రశ్నిస్తున్నారు. అయిదేండ్ల కిందట కేంద్రంలో ప్రభుత్వం, పాలకులు మారినప్పటి నుంచి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో, దేశమంతటా వివిధ వేదికలపై ఈ ఆధారరహిత, అశాస్త్రీయ ప్రలాపాల ప్రచారం జోరుగా జరుగుతున్నది. తత్ఫలితంగా దేశంలో వైజ్ఞానిక పరిశోధనలకు, ప్రగతికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఏర్పడుతున్నది.


ప్రపంచ ప్రఖ్యాత భౌతిక, గణిత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అపార మేధోమధనం అనంతరం ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం (థియరీ ఆఫ్ రిలేటివిటీ) తప్పని మొన్న జలంధర్ సైన్స్ కాంగ్రెస్‌లో ఒకాయన వేదాలను ఉదహరిస్తూ అన్నాడు. ఐన్‌స్టీన్ తప్పని నిరూపించే విశ్లేషణాత్మక, తర్క వితర్క పరిశోధనా పత్రాన్ని ఈయన సమర్పించినట్లయితే, ఆ పత్రంపై కూలంకషంగా చర్చ జరిగినట్లయితే వైజ్ఞానిక ప్రపంచం నిజంగా హర్షించేది. అది జరుగలేదు. అగ్నిహోత్రావధానులు అన్నట్లు వేదాల్లో అన్నీ ఉన్నాయి అని అనడం సులభం. నిరూపించి నిజానిజాలను నిర్ధారించడం ముఖ్యం. ప్రధాని నుంచి గ్రామ పంచ్ వరకు, చాలక్‌లు, సంచాలక్‌లు అందరూ వేదాల్లో అన్నీ ఉన్నాయి అంటూ నిర్విరామ జపం చేయవచ్చు. వేదాల్లో నిజంగానే అన్నీ ఉంటే సంతోషించని, గర్వపడని భారతీయుడు ఉండడు. వేదాల్లో అన్నీ ఉన్నాయని కళ్లు మూసుకొని అన్నవాళ్లు, తందాన తాన అంటూ వంత పలికినవాళ్లు మాత్రమే దేశభక్తులు, హై హై నాయకా అంటూ సై కొట్టనివాళ్లు దేశద్రోహులు అనడం సమంజసం కాదు. బ్రిటిష్ పాలకులు దత్తపరిచిన సెడిషన్ (దేశద్రోహం) చట్టం ఈరోజు పాలకులకు బాగా ఉపయోగపడుతున్నది. ఇప్పటికే దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం ముందు మూడో, నాలుగో దేశద్రోహం కేసులు విచారణలో ఉన్నాయి. క్రమంగా దేశద్రోహం ముద్ర పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని అనిపిస్తున్నది. ఈ పెరుగుదలకు కారణాలేమిటో సామాజిక శాస్త్రజ్ఞులు పరిశీలించాలి. ఈ ముగ్గురు, నలుగురు లేక 30 మంది దేశద్రోహులు భారత ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర జరుపుతున్నారంటే భారత ప్రభుత్వం ఎంతో బలహీనంగా ఉందనిపిస్తున్నది. మోదీజీ ప్రభుత్వం అయిదేండ్ల కిందట అంకురించగానే కేదార్‌నాథ్‌లోనో, బద్రీనాథ్‌లోనో ఒక వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపిం చి, వేదాల్లోని ఆధ్యాత్మిక, ధార్మిక, మార్మిక, వైద్య, ఆరోగ్య, అస్త్రశస్త్ర, క్షిపణి సంబంధ, అంతరిక్ష, సంగీత, సాహిత్య, సాంకేతిక తదితర అంశాలపై సమగ్ర పరిశోధనలను ప్రోత్సహించి ఉంటే, ఇండియన్ సైన్స్ కాం గ్రెస్‌లోనే కాదు, ప్రపంచ సైన్స్ వేదికపై కూడా మన వేదఘోష అద్భుతంగా వినిపించేది. 120 ఏండ్ల కిందట షికాగో (అమెరికా), యూరప్ దేశాల్లో పర్యటించిన వివేకానందస్వామి మా వేదాల్లో అన్నీ ఉన్నాయి అనలేదు. అమెరికా, యూరప్ దేశాల నుంచి వైజ్ఞానికంగా మనం నేర్చుకోవలసింది చాలా ఉందని తన మాతృదేశం వాళ్లకు చెప్పాడు.

నాడే, వేదకాలంలోనే, మనోళ్లు ఖండాంతర క్షిపణులను, అంతరిక్షింలోకి చొచ్చుకపోయే వ్యోమనౌకలను, అణ్వాయుధాలను, టెలివిజన్ సదుపాయం గల (లైవ్ టెలికాస్ట్ సదుపాయం ఉన్నది గనుకనే సంజయుడు కౌరవ అధిపతి ధృతరాష్ర్టునికి కురుక్షేత్ర సంగ్రామం గురించి కళ్లకు కట్టినట్లు వివరించగలిగాడని వేదిస్టులు అంటారు!) కమ్యూనికేష న్ వ్యవస్థను, బోఫోర్స్‌ను మించిన శతఘ్నులను, రాఫెల్స్‌ను తలదన్నే యుద్ధ విమానాలను సృష్టించగలిగారని, క్లిష్టమైన శస్త్ర చికిత్సలను అవలీలగా చేయగలిగారన్నారు. నాడే భార్యాభర్తలకు ఎటువంటి ఆయాస ప్రయాసల్లేకుండా టెస్ట్ ట్యూబ్ బేబీలను ఉత్పత్తి చేశారని, వంద మంది కౌరవులు టెస్ట్‌ట్యూబ్ బేబీలేనని ఒకాయన, పెద్దమనిషే, జలంధర్ సైన్స్ కాంగ్రెస్‌లో బల్లగుద్ది చెప్పారు. ద్రోణాచార్యుల వారు కుంభ సంభవులే గదా! వేదాల్లోకి వెళ్లితే ఇంతటితో తెగదు, అది వేదారణ్యం.

ఆంగ్ల పాలకులు పెట్టిన భిక్ష సెడిషన్ చట్టం ఒకటి నోరుమూయించే చట్టం ఉన్నప్పటికీ ధైర్యంగా నోరు విప్పినవాళ్లు కొందరు ఎళ్లకాలాల్లో కొల్లలుగా ఉంటున్నారు. గోరఖ్‌పూర్ పీఠాధిపతి, ప్రస్తుత యూపీ సీఎం సన్యాసి ఆదిత్యనాథ్‌జీకి కోపం వస్తే ఎన్‌కౌంటర్ జరుగుతుందని తెలిసినా కొందరు గొంతు విప్పడానికి సాహసిస్తున్నారు. యోగి సంవత్సర పదవీకాలంలో యూపీలో 11 వందల పోలీస్ ఎన్‌కౌంటర్లు జరిగాయని తెలిసి సుప్రీంకోర్టుకు మూర్ఛ వచ్చినంత పనయింది. వేదాల్లో ఎన్ని నిగూఢ సంపదలు ఉన్నప్పటికీ మంచి గతమున కొంచెమేనోయి అని ఓ మహాకవి వందేండ్ల కిందటనే అన్నారు. గతంలోనే మంచి అంతా ఉందని గర్జించేవాళ్లకు సమాధానంగా ఆయన ఈ మాట అని ఉంటా రు. తెలంగాణ ఆధునిక కవి ఒకరు ఎన్ని సంపదలుడిన నేమి ఫలము, చచ్చిపోయిన ఒక బర్రె యిచ్చెనంట పగిలిపోయిన కుండెడు పాలు మాకు, నిద్దురను వీడు తమ్ముడా పొద్దువోయే అంటూ అమిత వేదనను వ్యక్తపరిచారు. ఆధునిక తెలుగు కవులకు, రచయితలకు గతమంతా గబ్బిలాలు వేలాడుతున్న చీకటి కూపం వలె కనిపించింది. తిరోగమన వాదులు మాత్రమే గతాన్ని గాఢంగా ప్రేమిస్తారని, పురోగమించడం వాళ్లకు ఇష్టంకాదని ఆధునిక మేధావులు, బుద్ధిజీవులు, ప్రగతిశీలురు భావిస్తారు. ప్రగతిశీలుర కోవలో ప్రథముడైన మహాకవి దాశరథి మాటలివి.. అంతా వెనుకటే ఉందని ఆనందపడే పెద్దలు ఇవాళ యేమీ లేదని యేడ్పు మొహం పెట్టారు..? కవులు, రచయితలు, మేధావులు ఎవరేమి చెప్పినా గత అయిదేండ్ల నుంచి వేదాల్లో అన్నీ ఉన్నా యి అని పదేపదే అంటున్నవారు పవిత్ర వేదాలను సైతం వక్రభాష్యాలతో తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని అనుకుంటున్నారు. చిత్తశుద్ధితో వేద వాఙ్మయాన్ని, ప్రాచీన భారతీయ విజ్ఞాన నిధులను శోధించి, వెలికి తెచ్చిన ఆధునిక యుగ శాస్త్రవేత్తలు, విజ్ఞాన విదులు కొందరు లేకపోలేదు. రసాయనిక శాస్త్ర రంగంలో ప్రపంచ ప్రసిద్ధుడు అయిన పి.సి. రే (1920లో ఆయన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు) హిందూ రసాయనిక శాస్త్రం చరిత్ర పేరిట రెండు సంపుటాల ఉద్గ్రంథం రచించారు. ప్రాచీన హిందూ సకారాత్మక శాస్ర్తాలు అంశంపై తత్త్వవేత్త బ్రజేంద్రనాథ్ సీల్ అమూల్య పరిశోధన జరిపారు. ఆధునిక విజ్ఞాన శాస్ర్తాలకు అత్యధిక ప్రాధాన్యం లభించినప్పుడే స్వతంత్ర భారతదేశం సర్వతోముఖాభ్యుదయాన్ని సాధించగలుగుతుంది, సందేహం లేదు.

869
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles