నిజాం పాలనలో తెలుగు బోధన


Sat,January 19, 2019 01:29 AM

ఆధునిక తెలంగాణ చరిత్రలో అసఫ్‌జాహీల పాలన గురించి, ముఖ్యంగా చివరి నిజాం కాలానికి సంబంధించి మేధావుల్లో భిన్న దృక్పథాలు, విశ్లేషణలు, సూత్రీకరణలున్నాయి. తెలు గు భాష, సంస్కృతి, సాహిత్యం పట్ల నిజాం ప్రభుత్వ విధానాలపై చరిత్రకారుల్లో బేధాభిప్రాయాలున్నాయి. మొత్తంగా నిజాం రాజ్యంలో ఉర్దూ బోధనాభాషగా ఉన్నప్పటికీ, మిగితా ప్రాంతీయ భాషల పట్ల ముఖ్యంగా తెలుగుభాషలో విద్యాబోధనకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సుముఖంగా ఉన్నట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ప్రైవేట్ ఖాన్గీ పాఠశాలల్లో తెలుగు బోధనాభాషగా కొనసాగింది. ఈ స్కూల్స్ ప్రధానంగా విద్యావంతులైన వ్యక్తుల అజమాయిషీలో నిర్వహించబడినాయి. గ్రామంలో అక్షరాస్యత, గ్రంథపఠనలో నిష్ణాతులైన బ్రాహ్మ ణ, సాతాని, శ్రీవైష్ణవ శాఖలకు చెందినవారు ఉపాధ్యాయులుగా ఉన్నా రు. మత, సాంస్కృతిక, పౌరాణిక అంశాలు, గణితం, వ్యాకరణం పాఠ్యాంశాలుగా ఉన్నాయి. అయితే ఖాన్గీ పాఠశాలలను నిజాం ప్రభుత్వం గుర్తించలేదు. అందువల్ల తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ప్రభు త్వ ఉద్యోగాలకు అనర్హులు. నైజాం పాలనలో తెలుగు మాధ్యమ విద్య వివక్షకు గురైంది. అయినా తెలుగు భాషా, సంస్కృతులను పరిరక్షించుకునేందుకు పలువురు విద్యావంతులు కృషిచేశారు.


ఇరువయ్యో శతాబ్దం మొదటి దశకంలో దళితుల్లో విద్యావ్యాప్తి చేసిన ఘనత ఆది హిందూ ఉద్యమ నాయకుడు భాగ్యరెడ్డి వర్మకు దక్కుతుంది. సంఘ సంస్కరణలో భాగంగా ఆయన 1910లో మొదటి దళిత పాఠశాలను స్థాపించాడు. ఆ తర్వాత మొత్తం 26 తెలుగు మీడియం పాఠశాల లను స్థాపించి, 2,500 మంది దళిత విద్యార్థులకు స్వచ్ఛందంగా విద్యాబోధన జరిపించాడు. అయితే కొంతకాలం తర్వాత పాఠశాలల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆర్థిక సహాయం చేయాలని నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను కోరాడు. అందుకు నిజాం ప్రభుత్వం అంగీకరించి ఆ పాఠశాలలను 1934లో అధీనంలోకి తీసుకున్నది. 1934లో నిజాం ప్రభుత్వం డిప్రెస్డ్ క్లాసెస్ విద్యావ్యాప్తి పథకాన్ని ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగా నిమ్న వర్గాలకు 101 ప్రత్యేక తెలుగు మీడియం పాఠశాలలను స్థాపించి 3,514 విద్యార్థులను చేర్చుకున్నది. 1945 నాటికి వాటి సంఖ్య 186కు పెరిగింది. వాటిలో 8,764 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. వాటికి తోడుగా మిగితా ప్రభుత్వ పాఠశాలల్లో వేల సంఖ్య లో అట్టడుగువర్గాలకు చెందిన విద్యార్థులు ప్రవేశం పొందారు. దీన్నిబట్టి 1930-40 దశకాల్లో హైదరాబాద్ రాజ్యంలో దళిత, బడుగు వర్గాల్లో విద్యావ్యాప్తి జరిగిందనే విషయం స్పష్టమవుతున్నది.

ఆదివాసీ, సంచారజాతుల్లో విద్యాభివృద్ధి చేయడానికి నిజాం ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. ముఖ్యంగా 1940 దశకంలో కుమ్రం భీం తిరుగుబాటు తర్వాత ట్రైబల్ సమస్య పరిష్కారానికి బ్రిటిష్ విద్యావేత్త హైమన్‌డార్ఫ్ సూచన మేరకు గోండు, కోయ, చెంచు లంబాడా/బంజా రా జాతుల్లో అక్షరాస్యత పెంచడానికి ఆశ్రమ పాఠశాలలను స్థాపించారు. మొదటిసారిగా 1943లో రూ.46,267 గ్రాంట్‌తో నిజాం ప్రభుత్వం గోండ్ ఎడ్యుకేషన్ పథకాన్ని ప్రారంభించింది. దీనికి అనుగుణంగా పూర్వ పు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ తాలూకాలోని మర్లవాయిలో గోండ్ విద్యార్థులకు పాఠశాల, టీచర్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. గోండి భాషలో తొలిసారిగా ముప్ఫై మంది విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలో విద్యాబోధన జరిగింది. ఆ తర్వాత జిల్లాలో మొత్తం 72 పాఠశాలలు స్థాపించబడినాయి. విద్యార్థులకు అర్థమయ్యేట్లు గోండి భాషలో దేవనాగరి లిపిలో పుస్తకాలు ముద్రించబడినాయి. గోండి రీడింగ్, గోండి ప్రైమరీ లాంటి పుస్తకాల ముద్రణకు నిజాం ప్రభుత్వం రూ.1.34 లక్షల గ్రాంటు ను మంజూరుచేసి, విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసింది. గోండు ఎడ్యుకేషన్ పథకం తరహాలోనే 1946లో వరంగల్ జిల్లాలో ప్రభుత్వం కోయ జాతి విద్యాభివృద్ధికి కృషిచేసింది. ఎల్లెందు తాలూకా సుదిమళ్లలో మొట్టమొదట కోయ విద్యాకేంద్రాన్ని స్థాపించి వందలాది మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించింది. పూర్వపు వరంగల్ జిల్లాలో బంజారా/లంబాడా తెగకు చెందినవారు అధికంగా నివసించారు. వారిలో అక్షరాస్యతను పెంపొందించడానికి మహబూబాబాద్ తాలూకా తొర్రూరులో పాఠశాల, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని నిజాం ప్రభుత్వం ప్రారంభించి వందల సంఖ్యల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించింది.
adapa
బంజారా భాషకు లిపి లేనందువల్ల తెలుగు, దేవనాగరి లిపిలో పాఠ్యపుస్తకాలు ముద్రించింది. బంజారా బాలశిక్ష, బంజారా రీడర్, బంజారా వయోజన చార్ట్, బంజారా నాటకం లాం టి పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసింది. బంజారా ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక టీచర్లు వారి మాతృభాషలోనే విద్యాబోధన చేశారు. అదేవిధంగా చెంచు జాతి ప్రజలు మహబూబ్‌నగర్ జిల్లాలో అధికంగా నివసించారు. 1948 లో మన్ననూర్‌లో ప్రభుత్వ పాఠశాల స్థాపించబడింది. దానిలో 77 మం ది బాల, బాలికలకు ఉచిత విద్యనందించి, వారిలో ప్రతిభ కలిగినవారికి ప్రభుత్వం మెరిట్ స్కాలర్‌షిప్‌లు ఇచ్చి ప్రోత్సహించింది. దానికి తోడు ఉన్నత విద్యనభ్యసించడానికి గోండు, కోయ, బంజారా, చెంచు విద్యార్థుల్లో ప్రతిభావంతులైన వారికి తగిన ప్రోత్సాహకాలను నిజాం ప్రభు త్వం అందించింది. తద్వారా వెనుకబడిన జాతుల్లోని మొదటితరం ఆధునిక విద్యను అందుకొని ఉపాధి రంగంలో అడుగుపెట్టింది. విద్యావంతులైన ఆదివాసీ యువతరం తమ జాతిలో నూతన ఆకాంక్షలను రేకెత్తించి చైతన్యవంతమైన అస్తిత్వ, ఆత్మగౌరవ ఉద్యమాలను నిర్మించారు. ఆశ్రమ పాఠశాలల స్థాపన, మాతృభాషలో ఆదివాసీ సమూహాలకు ఉచిత విద్యాబోధన అనేది మీర్ ఉస్మాన్‌అలీఖాన్ పాలనాకాలంలో ప్రవేశపెట్టిన ముఖ్యమైన విద్యా సంస్కరణగా పేరొందింది. తెలంగాణలో చెలరేగిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాల ప్రభావం కూడా నిజాం విద్యావిధానంపై ఉన్నదని చెప్పవచ్చు. 1930-40 దశకాల్లో నిజాం ప్రభు త్వం చేపట్టిన విద్యాభివృద్ధి పథకాలు స్వాతంత్య్రానంతరం సమగ్ర గిరిజన అభివృద్ధి పథకాలకు బీజాలు వేశాయి.

776
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles