e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home సంపద లగ్జరీ ప్రాజెక్టులన్నీ వెస్ట్‌లోనే..

లగ్జరీ ప్రాజెక్టులన్నీ వెస్ట్‌లోనే..

  • విల్లా, గేటెడ్‌ కమ్యూనిటీలకు పెరుగుతున్న ప్రాధాన్యత
  • 56 అంతస్తులతో హై రైజ్‌ భవనాలు
  • ఓఆర్‌ఆర్‌తో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు

సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ మహానగరానికి ఐటీ కారిడార్‌ ఓ మణిహారంలా మారింది. జాతీయ, అంతర్జాతీయస్థాయి కంపెనీలు పెట్టుబడులతో క్యూ కడుతున్నాయి. దీంతో ఏటా లక్షల్లో ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఇలా నగరంలోని వెస్ట్‌జోన్‌.. అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందిప్పుడు. హైదరాబాద్‌లో పేరెన్నికగల రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో బెంగళూరుకు చెందిన పలు కంపెనీలు వెస్ట్‌జోన్‌లో రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో దూసుకుపోతున్నాయి. భారీ ఎత్తున తమ ప్రాజెక్టులను చేపట్టాయి. దీంతో ‘వెస్ట్‌ జోన్‌ ఈజ్‌ బెస్ట్‌ జోన్‌’ అనేలా తయారైంది. జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ నుంచి మొదలయ్యే ఐటీ కారిడార్‌ మొత్తం వెస్ట్‌ జోన్‌ పరిధిలోకే వస్తుండటంతో కార్యాలయాలు, నివాస ప్రాంతాలు ఒకేచోట ఏర్పాటుకు అవకాశం ఉండటంతో అభివృద్ధి వేగవంతమైంది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా ఇటువైపే నివాసం ఉండటానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి చుట్టు పక్కల పది కిలోమీటర్ల పరిధిలోనే భారీ సంఖ్యలో నిర్మాణ రంగ ప్రాజెక్టులు కొత్తగా వస్తున్నాయి. లగ్జరీ విల్లా, గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులన్నీ ఇటువైపే ఏర్పాటవుతున్నాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో నివాసం ఉండే సంపన్నులు, వ్యాపారవేత్తలు సైతం వెస్ట్‌జోన్‌లోని నానక్‌రాంగూడ, కోకాపేట, గచ్చిబౌలి ప్రాంతాల్లోని గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివాసాలను సొంతం చేసుకునేందుకు అమితాసక్తిని చూపిస్తున్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు..
గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. అలాంటి ఓఆర్‌ఆర్‌ వెస్ట్‌జోన్‌ అభివృద్ధిలో అత్యంత కీలకంగా మారింది. ఇటు ఐటీ కారిడార్‌ను, అటు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిపే ప్రధాన వారధిగా ఓఆర్‌ఆర్‌ మారింది. ఓఆర్‌ఆర్‌పై 8 వరుసల ప్రధాన రహదారి (మెయిన్‌ క్యారేజ్‌వే)తోపాటు ఇరువైపుల 2 లేన్‌లతో సర్వీసు రోడ్లు, భవిష్యత్తు రైల్వే కారిడార్‌ కోసం 25 మీటర్ల వెడల్పుతో ఖాళీ స్థలం ఉండటం అదనపు ఆకర్షణగా మారింది. ఓఆర్‌ఆర్‌ నిర్వహణను సైతం హెచ్‌ఎండీఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. 158 కిలోమీటర్ల పొడవున్న ఓఆర్‌ఆర్‌ చుట్టూ రూ.134 కోట్లతో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయగా, అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం కోట్లాది మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించింది. వీటితోపాటు తెలంగాణ ప్రభుత్వం గత రెండేండ్లలో 137 లింకు రోడ్లను ప్రతిపాదిస్తే అందులో మెజారిటీ లింకు రోడ్లన్నీ వెస్ట్‌జోన్‌లోనే ఉన్నాయి.

- Advertisement -

ఎకరం రూ.60 కోట్లు..
వెస్ట్‌జోన్‌లోని కోకాపేటలో ఇటీవల హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నిర్వహించిన ఆన్‌లైన్‌ భూముల వేలంలో ఎకరం ధర ఏకంగా రూ. 60 కోట్లు పలికింది. గ్రేటర్‌ శివారులో జీహెచ్‌ఎంసీ పరిధి అవతల నార్సింగి మున్సిపాలిటీలో ఉన్న కోకాపేటలో ఈ స్థాయిలో ధర పలకడం అంటే ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యతే. హైదరాబాద్‌ మహానగరానికి మణిహారం లాంటి ఔటర్‌ రింగు రోడ్డు ఒక ఆకర్షణ అయితే, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ అదనపు ఆకర్షణ. ఇలా రెండింటిని ఆనుకొని ఉన్న కోకాపేట వెస్ట్‌ జోన్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.

పెద్ద ఎత్తున హైరైజ్‌ భవనాలు
హైదరాబాద్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టులన్నీ వెస్ట్‌ జోన్‌ కేంద్రంగా నిర్మాణంలో ఉన్నాయి. 12 అంతస్తులకు మించి చేపట్టే భారీ బహుళ అంతస్తుల భవనాల్లో 95 శాతం హైరైజ్‌ భవనాలు మాదాపూర్‌, కొండాపూర్‌, రాయదుర్గం, నానక్‌రాంగూడ, గచ్చిబౌలి, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల, తెల్లాపూర్‌, నల్లగండ్ల కేంద్రంగానే వస్తున్నాయి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వెళ్లే ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తయిన భవనాలు 56 అంతస్తులతో నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్ని భవనాల నిర్మాణం కోసం జీహెచ్‌ఎంసీ,హెచ్‌ఎండీఏల నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. భవిష్యత్తులో వెస్ట్‌జోన్‌లో 60 నుంచి 100 అంతస్తుల వరకు ఉండే భవనాలు వచ్చేందుకు వీలుందని రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే సాస్‌ ఇన్‌ఫ్రా 56 అంతస్తులతో ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా, 30 అంతస్తులతో మై హోం కన్‌స్ట్రక్షన్స్‌ హై హోం అవతార్‌ పేరుతో ఒక ప్రాజెక్టును పూర్తి చేసింది. దాని పక్కనే రాజపుష్ప 39 అంతస్తుల్లో మరో భారీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్టును ప్రకటించింది. వీటితోపాటు అపర్ల, హాల్‌ మార్క్‌, వర్టెక్స్‌, అక్యురేట్‌ చిమ్నీ, పౌలోమి, జీఎఆర్‌ వంటి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు హైరైజ్‌ భవనాలను నిర్మిస్తున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement