e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home సంపద రియల్‌ మహారాజు

రియల్‌ మహారాజు

  • కరోనాలోనూ మహా నగరంలో రియల్‌ జోరు
  • ఒక్క రంగారెడ్డిలోనే ఐదు నెలల్లో 1.05 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌
  • కోకాపేట వేలంతో నగరానికి పెరిగిన అంతర్జాతీయ సంస్థల తాకిడి
  • ఈ ఏడాది ప్రథమార్ధంలో నగరానికి రూ.5వేల కోట్లకు పైగా రియల్టీ పెట్టుబడులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ మహా నగరం.. రియల్‌ రంగంలో పెట్టుబడులకు ఇప్పుడిది స్వర్గధామం. కరోనా సంక్షోభంలో దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఈ రంగం తిరోగమనాన్ని సూచిస్తుండగా.. హైదరాబాద్‌లో మాత్రం గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తుంది. అంతేకాదు.. రిజిస్ట్రేషన్‌ లావాదేవీల్లోనూ గత ఏడాదిన్నర కాలంగా జరుగుతున్న క్రమ విక్రయాలు సాధారణ రోజులకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. అందుకే జేఎల్‌ఎల్‌.. నైట్‌ఫ్రాంక్‌.. 99ఏకర్స్‌.. అన్‌రాక్‌.. సర్వే సంస్థ ఏదైనా! ఈ రంగంలో హైదరాబాద్‌.. ఇతర మెట్రో నగరాల కంటే ముందంజలో ఉన్నట్లుగా వెల్లడిస్తున్నాయి. ఇక… జాతీయ సగటుతో పోల్చినా తెలంగాణ రియల్‌ రంగం రికార్డులను నమోదుచేసింది. 2020-2021 ప్రథమార్థంతో పోలిస్తే.. అమ్మకాలు తెలంగాణలో 2-4 రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. ఇందుకు అద్దం పట్టినట్లుగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కోకాపేట వేలం భారీ రికార్డులను నమోదు చేసింది.

24 లక్షల చదరపు అడుగుల విక్రయం
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు.. నిర్మాణ, రియల్‌ రంగాల్లో ప్రదర్శిస్తున్న పారదర్శకత.. అందుకు అనుగుణంగా వేల కోట్లతో కల్పిస్తున్న మౌలిక వసతులు.. రియల్టీ పెట్టుబడులను గణనీయంగా ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు నివాసయోగ్య కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయంగా ఐటీ, పారిశ్రామిక రంగాల్లో నగరానికి పెట్టుబడుల వస్తున్న క్రమంలోనూ ఈ-కామర్స్‌ కంపెనీల కొనుగోళ్లు కూడా విపరీతంగా పెరిగాయి.ఈ నేపథ్యంలో 2021 ప్రథమార్ధంలో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం మంచి వృద్ధిని నమోదు చేసి.. రూ.5వేల కోట్ల పెట్టుబడులను రాబట్టినట్లుగా అంచనా. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే దాదాపు రూ. 2,800 కోట్ల పెట్టుబడులను సాధించగా… దేశవ్యాప్తంగా రియల్టీలో వచ్చిన పెట్టుబడుల్లో ఇది 42 శాతం కావడం విశేషం. దీంతో పాటు లాక్‌డౌన్‌ సమయం కలుపుకొని తర్వాత మూడు నెలల్లో ఏకంగా రూ.1,500 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినట్లుగా మార్కెట్‌వర్గాలు వెల్లడించాయి. ఈ ఆరు నెలల్లో హైదరాబాద్‌ రియల్‌ రంగంలో 24 లక్షల చదరపు అడుగుల స్థలాలు అమ్ముడవగా… అందులో 54 శాతం స్థలాలను ఈ-కామర్స్‌ కంపెనీలే కొనుగోలు చేయడం గమనార్హం.

- Advertisement -

కరోనాలోనూ తగ్గని రిజిస్ట్రేషన్లు..
వాస్తవానికి కరోనా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను కుదేలు చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ రియల్‌ రంగంలోనూ కరోనా ప్రభావం ఉన్నప్పటికీ… అది తాత్కాలికమేనని గత ఏడాదిన్నరగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,68,372 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో రూ.1,545.04 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1,05,402 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో ఏకంగా రూ.1,122.32 కోట్ల రాబడి వచ్చింది. అదేవిధంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,03,050 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో రూ. 937.73 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 34,350 రిజిస్ట్రేషన్లతో సుమారు రూ.312 కోట్ల ఆదాయం వచ్చింది. కోర్‌ హైదరాబాద్‌ పరిధిలో మే-జూలై వరకు 5,881 రిజిస్ట్రేషన్లతో రూ.133.63 కోట్ల ఆదాయం వచ్చింది. తద్వారా లాక్‌డౌన్లు, కరోనా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ రియల్‌ జోరు కొనసాగుతుందనేందుకు ఈ అంకెలు అద్దం పడుతున్నాయని అధికారికవర్గాలు చెబుతున్నాయి.

‘త్రిపుల్‌’కు పెరిగిన డిమాండు..
నివాస గృహల అమ్మకాల్లో హైదరాబాద్‌ గణనీయమైన వృద్ధిరేటును నమోదు చేసింది. అదే సమయంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలోనూ అదే స్థాయి వృద్ధి రేటు ఉందని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అధ్యయన సంస్థ సర్వేల్లో తేలింది. గతేడాది అమ్మకాలతో పోల్చితే నివాస గృహాల అమ్మకాల్లో 150 శాతం వృద్ధి రేటు కనబర్చింది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభాల వృద్ధి ఏకంగా 278 శాతంగా ఉంది. కాగా కరోనా దరిమిలా మాత్రం కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పు రావడం కీలక పరిణామం. వర్క్‌ ఫ్రం హోం, ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సి రావడంతో నగరంలో మునుపటికంటే త్రిపుల్‌ బెడ్‌రూం ఇళ్లకు డిమాండు గణనీయంగా పెరిగింది. సాధారణంగా 1బీహెచ్‌కే డిమాండు తక్కువగానే ఉంటుంది. అయితే 2బీహెచ్‌కే డిమాండు గతేడాది 47 శాతం ఉంటే ఈ ఏడాది 31 శాతానికి పడిపోయింది. అదే 3బీహెచ్‌కే డిమాండు గతేడాది 44 శాతం నుంచి ఇప్పుడు 56 శాతానికి పెరగడం కొనుగోలుదారుల అభిరుచుల్లో గణనీయమైన మార్పు వచ్చిందనేందుకు నిదర్శనం. అంతేకాదు… 4బీహెచ్‌కే ఆపై ఇళ్లకు కూడా ఐదు నుంచి 11 శాతానికి డిమాండు పెరిగింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement