ఇంట్లో అందమైన మొక్కలుంటే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. లివింగ్ రూమ్, బాల్కనీలో పచ్చని మొక్కలను పెంచితే ఇల్లంతా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అయితే, ఇండోర్ మొక్కలను పెంచడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంట్లో పెంచాలనుకునే మొక్కలపై పూర్తి అవగాహన ఉండాలి.
వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి.
కుండీల్లో పెంచే మొక్కలకు నీళ్లు పోసే సమయంలో నీరు కింద పడి ఇల్లంతా తడిగా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే కుండీలను ట్రేలలోగానీ, రెండు కుండీలను గానీ వాడితే మంచిది.
కొన్నిరకాల మొక్కల వేర్లు మట్టిలో భారీగా విస్తరిస్తాయి. అలాంటి వాటిని చిన్న కుండీల్లో పెంచవద్దు.
ఇండోర్ మొక్కలు తక్కువ నీటిని తీసుకుంటాయి. అలాంటివాటికి ఎక్కువ నీరు పోస్తే చనిపోయే ప్రమాదం ఉంటుంది. వీటికి వారంలో ఒకటి రెండుసార్లు నీరు పోసినా సరిపోతుంది. కుండీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, మట్టిలో ఒక అంగుళం మేర తడి లేనప్పుడు నీళ్లు పోస్తే మంచిది.
కొన్ని మొక్కలు ఎక్కువగా తెగుళ్లబారిన పడుతుంటాయి. అలాంటివాటిని పెంచకపోవడమే బెటర్.
ఆకులకు ఫంగస్ సోకినట్లు గుర్తిస్తే వెంటనే కట్ చేసేయాలి. లేకుంటే ఫంగస్ విస్తరించి మొక్కకూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది.
కొన్ని రకాల మొక్కలు పూర్తిగా నీటిలోనే పెరుగుతాయి. అలాంటి వాటికి కనీసం 15 రోజులకు ఒకసారైనా నీటిని మార్చాలి.