ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అందరూ అనుకుంటారు. సరికొత్త వస్తువులను వాడుకొనేందుకు సర్వదా సిద్ధంగా ఉంటారు. అలాంటిది ‘రెక్కలు లేని ఫ్యాన్లు’ వస్తున్నాయంటే వాడకుండా ఉంటారా? అమెరికాకు చెందిన పలు సంస్థలు ఈ సరికొత్త ఫ్యాన్లకు రూపకల్పన చేశాయి. రెక్కలు లేకుండానే ఫ్యాన్లను తయారు చేసి, తమ దేశవాసులకు అందుబాటులోకి తెచ్చాయి. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే ఈ ఫ్యాన్లు అమ్మకానికి వస్తున్నాయి. మామూలు సీలింగ్ ఫ్యాన్లకు మూడు లేదా నాలుగు రెక్కలుంటాయి. అవి తిరుగుతూ మనకు చల్లని గాలినిస్తాయి. కానీ, ఈ వినూత్న ఫ్యాన్లు థర్మల్ డెస్ట్రాటిఫికేషన్ టెక్నాలజీతో పనిచేస్తాయి. వీటికి ఎలాంటి రెక్కలూ ఉండవు. కేవలం 50 వాట్ల డీసీ కరెంటు మోటర్ మాత్రమే ఉంటుంది. ఇది గదిలోని వేడిగాలిని స్వీకరించి, డిస్కులద్వారా 360 డిగ్రీల్లో అంటే, గది నాలుగు మూలలకూ చల్లని గాలిని వెదజల్లుతుంది. అంతేకాక, అ ఫ్యాన్లు చాలా తక్కువ విద్యుత్తును వినియోగించుకొంటాయి. ఫలితంగా, కరంటు బిల్లూ గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇవి రెండు మోడళ్లలో లభిస్తున్నాయి. ఒకటి: ఎల్ఈడీ మోడల్, రెండోది: ఎల్ఈడీ రహిత మోడల్. అయితే, వీటి ఖరీదు మాత్రం కాస్త ఎక్కువగానే ఉన్నది. కనీస ధర రూ.22,500 నుంచి రూ.26,000 దాకా పలుకుతున్నాయి.