e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home సంపద రియల్టీకి ఉజ్వల భవిష్యత్తు

రియల్టీకి ఉజ్వల భవిష్యత్తు

  • రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలతోనే
  • హైదరాబాద్‌ నిర్మాణ రంగం అభివృద్ధి
  • ఇతర మెట్రో నగరాలతో పోల్చితే ఇక్కడే ధరలు తక్కువ
  • సొంతింటి కల సాకారానికే ‘మెగా ప్రాపర్టీ షో’
  • ‘నమస్తే’తో క్రెడాయ్‌ హైదరాబాద్‌ జనరల్‌ సెక్రెటరీ వీ రాజశేఖర్‌రెడ్డి

తెలంగాణలో నిర్మాణ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) హైదరాబాద్‌ శాఖ జనరల్‌ సెక్రెటరీ వీ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు నిర్మాణ రంగం మరింత బలోపేతం కావడానికి దోహదపడ్డాయన్నారు. వ్యవసాయం, ఫార్మా, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్‌ రియల్టీ అభివృద్ధి చెందిందని వివరించారు. దేశీయ నిర్మాణ రంగానికే దిశా-నిర్దేశం చేస్తున్న క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోనే నేటికీ ఫ్లాట్ల రేట్లు తక్కువగా ఉన్నాయని, అందుకే అమ్మకాలు మెరుగ్గా జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ అభివృద్ధి ముఖచిత్రం పరిగణనలోకి తీసుకుంటే రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే నగర ఆస్తుల ధరలు 30-40 శాతం వృద్ధి చెందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాల పరంగా 39 శాతం వృద్ది నమోదైందన్నారు. హైదరాబాద్‌ హైటెక్స్‌ వేదికగా 3 రోజుల పాటు జరిగే 10వ ఎడిషన్‌ ప్రాపర్టీ షో వివరాలు, రాష్ట్రంలో రియల్‌ రంగం పురోగతిపై రాజశేఖర్‌రెడ్డి మాటల్లోనే..

రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు కొత్త పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేస్తున్నాయి. ఏ దేశంలో లేనివిధంగా టీఎస్‌ బీ పాస్‌ వంటి నూతన పారిశ్రామిక విధానాలు తెలంగాణలో అమలవుతున్నాయి. వీటివల్లే అనేక పరిశ్రమలు, కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయి. ఈ పరిణామం దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌ మహానగరంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అద్భుతంగా కొనసాగడానికి కలిసొచ్చింది. స్థిరాస్తి పరిశ్రమకు సంబంధించి అనుమతుల గడువు పొడిగించడం, వాయిదాల పద్ధతిలో అనుమతుల ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించడంతో కొత్త ప్రాజెక్టులు ఇటీవల భారీగా పెరిగాయి. కొవిడ్‌ సమయంలోనూ 6.7 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కార్యాలయాల లీజింగ్‌ పూర్తయింది. క్రమంగా ఏడాదిలో 10 మిలియన్లకు చేరుకుంటుంది. ఈ లీజింగ్‌ పెరిగేకొద్దీ ఉపాధి అవకాశాలు.. తద్వారా ఇండ్లకు డిమాండ్‌ ఉంటుంది. వచ్చే ఐదు నుంచి పదేండ్లపాటు ఈ వృద్ధి కొనసాగే అవకాశం ఉన్నది. హైదరాబాద్‌ నగరంలో నూతన గృహాలకు గణనీయంగా 150 శాతం వృద్ధి ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ (వైఓవై)లో కనిపించిందని ఇటీవలి నైట్‌ ఫ్రాంక్‌ సర్వేలో తేలింది. టీఎస్‌ బీ పాస్‌ పథకంతో నిర్మాణ రంగ సంస్థలకు, వినియోగదారులకు ఎంతో మేలు జరిగింది. రియల్టీ అభివృద్ధిలో విశేషంగా కృషి చేసిన సీఎం కేసీఆర్‌, యంగ్‌ అండ్‌ డైనమిక్‌ మినిస్టర్‌ కేటీఆర్‌కు మా క్రెడాయ్‌ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.

- Advertisement -

50వేల మంది సందర్శిస్తారని అంచనా
మూడు రోజులపాటు జరుగుతున్న ఈ ప్రదర్శనను 50వేల మంది సందర్శిస్తారని అంచనా వేస్తున్నాం. ఈ ప్రాపర్టీ షోలో అన్ని వర్గాల ప్రజలు తమ బడ్జెట్‌లోనే సొంతింటి కలను నేరువేర్చుకోవచ్చు. రూ.40 లక్షల నుంచి రూ.4, 5 కోట్ల వరకు ఫ్లాట్స్‌ ఉన్నాయి. బిల్డర్లు డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఫ్లాట్స్‌, హై యండ్‌ స్కై విల్లాలు, ఇండిపెండెంట్‌ గృహాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి.

కలల స్వర్గాన్ని ఎంపిక చేసుకునే చక్కని వేదిక
అత్యంత విశ్వసనీయమైన ప్రాపర్టీ ఎక్స్‌పో ఇది. కొవిడ్‌ దృష్ట్యా మరింత విశాలమైన స్టాల్స్‌, సమావేశ మందిరాలను ఏర్పాటు చేశాం. ఈ ఏడాది యూత్‌ వింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. తరచూ శానిటైజ్‌ చేయడం, ప్రతి స్టాల్‌ వద్ద శానిటైజర్‌ అందుబాటులో ఉంచడంతోపాటు మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేశాం. సందర్శకుల భద్రతకు అన్ని జాగ్రత్తలు చేపట్టాం. రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులకు మాత్రమే అవకాశం కల్పించాం. ప్రతి ఒక్కరి అవసరాలు, బడ్జెట్‌కు తగినట్లుగా స్థిరాస్తులను ఒకే గొడుగు కింద ప్రదర్శిస్తున్నాం. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోని ప్రాజెక్టుల వివరాలన్నీ ఒకే చోట లభించడం ద్వారా వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటుంది. వారు ఎక్కడ, ఎలాంటి ఇంటిని కావాలని కోరుకుంటున్నారో అలాంటి ఇండ్లు ఏ ప్రాజెక్టు ద్వారా నేరవేరుతాయే వెతుక్కోవడానికి చక్కని వేదికగా ఈ ప్రాపర్టీ షో ఉంటుంది. ఈ ప్రదర్శన మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

కొనుగోలులో అప్రమత్తత అవసరం
అనుమతి ఉన్న, రెరాలో నమోదు చేసిన ప్రాజెక్టుల్లోనే ఇండ్లు కొనుగోలు చేయాలి. ప్రస్తుతం మార్కెట్లో సగం ధరకే ఫ్లాట్‌ అంటూ, ముందస్తు బుకింగ్‌ల పేరుతో అనైతిక వ్యాపారానికి కొందరు తెరతీశారు. ప్రధానంగా మార్కెట్‌కు క్యాన్సర్‌గా మారిన యూడీఎస్‌ (అవిభాజ్య స్థలం)పై కొనుగోలుదారులు జాగ్రత్త పడాలి. అప్రమత్తంగా ఉండకపోతే నష్టం తప్పదు.

స్థిరాస్తి మార్కెట్‌ వృద్ధికి ఇవే దోహదం
హైదరాబాద్‌లో ఐటీ రంగం బాగున్నది. పలు కొత్త పరిశ్రమలు నగరం చుట్టుపక్కలగల చందన్‌వెల్లి, సుల్తాన్‌పూర్‌ ప్రాంతాల్లో వస్తున్నాయి. ఫార్మా సిటీ రాబోతున్నది. దీనికితోడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తితో సాగునీటి సౌకర్యంతో వ్యవసాయ రంగం పుంజుకున్నది. అగ్రీ ఎకానమీ పెరగడం కూడా స్థిరాస్తి మార్కెట్‌ వృద్ధికి దోహదం చేస్తున్నది. ఏ ఒక్క రంగంపైనో ఆధారపడి కాకుండా అన్ని విధాలుగా మెరుగ్గా ఉండడంతో మార్కెట్‌ పెరుగుతున్నది. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు అత్యంత ప్రాధాన్యత కేంద్రంగా హైదరాబాద్‌ నిలుస్తున్నది. ముఖ్యంగా భారీ బహుళజాతి సంస్థ (ఎంఎన్‌సీ)లు ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతున్నాయి. ఇవన్నీ కూడా పరోక్షంగా స్థిరాస్తి మార్కెట్‌ వృద్ధికి దోహదం చేస్తున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement