e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home సంపద శివార్లకే మొగ్గు!

శివార్లకే మొగ్గు!

  • ఆరోగ్యవంతమైన గృహాలవైపు నగరవాసుల చూపు

నగరవాసులు పచ్చదనాన్ని కోరుకుంటున్నారు. ఆరోగ్యవంతంగా జీవించేందుకు ఇష్టపడుతున్నారు. ఇందుకోసం.. కోర్‌ సిటీలో సొంతిల్లు ఉన్నప్పటికీ,శివార్లలోని ప్రకృతి ఒడిలో రెండో ఇంటిని నిర్మించుకొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ నైట్‌ఫ్రాంక్‌
నిర్వహించిన ‘ఇండియన్‌ బయ్యర్‌ సర్వే -2021’లో.. తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో 97శాతం మంది పచ్చదనానికే మొదటి ఓటు వేశారు. ఇందుకు కొవిడ్‌ ముఖ్య కారణమనీ, ఆరోగ్య సంరక్షణకే నగరవాసులు అధిక ప్రాధాన్యమిస్తున్నారని ‘నైట్‌ఫ్రాంక్‌’ ప్రతినిధులు చెబుతున్నారు.

కరోనా ప్రభావంతో నగరవాసులు ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకోసం నగర శివారుల్లో విశాలమైన భవనాలు నిర్మించుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. భాగ్యనగరంలో ఇప్పటికే సొంతిల్లు ఉన్నవారిలో 50 శాతం మంది, కొత్త ఇంటి కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. అది కూడా వచ్చే 12 నెలల్లోనే పూర్తి చేస్తామని అంటున్నారు. ‘లివింగ్‌ ఇన్‌ ద టైమ్స్‌ ఆఫ్‌ కొవిడ్‌-19’ పేరుతో ‘నైట్‌ఫ్రాంక్‌’ సంస్థ నిర్వహించిన సర్వేలో భాగ్యనగరవాసులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 97 శాతం మంది పచ్చదనంతో కూడిన ప్రాంతానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణతోపాటు పనిచేసే ప్రాంతానికి దగ్గరలో నివాసం ఉండేందుకు మరికొందరు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఇండ్లు విలాసంగా ఉంటున్నాయే తప్ప, జీవన ప్రమాణాలను పెంచేవిగా ఉండటం లేదని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.

‘కరోనా’ నేర్పిన పాఠాలు

- Advertisement -

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి, మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించింది. ఆ అనుభవంతోనే ఇంటి విషయంలో నగరవాసుల అభిరుచులు మారిపోయాయి. ఇన్నాళ్లూ కోర్‌ సిటీలో ఉంటేనే మేలనుకున్నవాళ్లు.. ఇప్పుడు శివార్లకు పరుగులు పెడుతున్నారు. ఇరుకు ఇండ్లతోనే సరిపెట్టుకొన్నవాళ్లు.. విశాల భవనాలవైపు అడుగులేస్తున్నారు. వారి ఆసక్తిని గుర్తిస్తున్న రియల్టర్లు.. కొనుగోలుదారులు కోరుకొన్న విధంగా ప్రాజెక్టులను డిజైన్‌ చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఐదు నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులను ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో ఇంటి కోసం 300 చదరపు గజాల నుంచి 1200 చదరపు గజాల దాకా స్థలాన్ని కేటాయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేస్తున్న నగరవాసులు తమకు నచ్చినట్లుగా, విశాలమైన భవంతులను నిర్మించుకొంటున్నారు.

కావాల్సినంత భూమి

నిన్నమొన్నటి దాకా ఔటర్‌ రింగురోడ్డును దాటి వెళ్లని నగరవాసులు.. ఇప్పుడు నగరానికి దూరంగా వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఓఆర్‌ఆర్‌ నుంచి 10-20 కి.మీ దూరం వరకూ ఇండ్లను నిర్మించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయా ప్రాంతాలన్నీ ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) పరిధిలో విస్తరించి ఉండగా, అభివృద్ధికి ఢోకా ఉండదని భరోసాగా ఉంటున్నారు. ఈ మేరకు శివార్లలో కావాల్సినంత భూమి ఉండగా, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కూడా భారీ వెంచర్లను అభివృద్ధి చేస్తున్నాయి. అందుకు నిదర్శనంగా.. గచ్చిబౌలి
ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ – శంకర్‌పల్లి మార్గంలో, మోకిల – కొండకల్‌ మధ్య సుమారు 50 నుంచి 100 ఎకరాల్లో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రాజెక్టులు చేపట్టాయి.

అక్కడ ఫాంహౌస్‌లు!

నగరం నలువైపులా నివాస ప్రాంతాలు విస్తరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పొడవునా 20 నుంచి 30 కి.మీ వరకూ వెంచర్లు వెలుస్తుండగా, నగరవాసులే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే శంషాబాద్‌, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, చేవెళ్ల మండలాల పరిధిలోని సుమారు 84 గ్రామాల పరిధిలో మాత్రం లే అవుట్లపై నిషేధం ఉన్నది. జంట జలాశయాలుగా ఉన్న గండిపేట, హిమాయత్‌సాగర్‌ చెరువుల పరిరక్షణ కోసం తీసుకువచ్చిన 111 జీవోతో ఆయా గ్రామాల పరిధిలో లే అవుట్లకు అవకాశం లేదు. దీంతో ఇక్కడ భూములను కొనుగోలు చేసుకొని, ఫాంహౌస్‌లు ఏర్పాటు చేసుకొంటున్నారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్ల మధ్య నివాసం ఉండేందుకు వీలుగా ఇండ్లను నిర్మించుకొంటున్నారు.

ధర తక్కువ.. స్థలం ఎక్కువ!

ఔటర్‌ రింగురోడ్డు లోపలి స్థలాల ధరలు భారీ స్థాయిలో ఉన్నాయి. కొన్నిచోట్ల తక్కువగా ఉన్నా.. అవి కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా లేవు. 15-20 ఏండ్ల క్రితమే గ్రామపంచాయతీలుగా ఉన్న ప్రాంతాల్లో లే అవుట్లు చేసినప్పటికీ, రోడ్ల విస్తీర్ణం తక్కువగా ఉండటం, రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్‌, పార్కులు.. లాంటి సౌకర్యాలు కానరావడం లేదు. ఈ నేపథ్యంలో ఓఆర్‌ఆర్‌ దాటిన తర్వాత చుట్టూ 20-30 కిలోమీటర్ల వరకు హెచ్‌ఎండీఏ పరిధే ఉండటం, అక్కడ కొత్తగా ఏర్పాటవుతున్న వెంచర్లలో అన్ని మౌలిక వసతులూ కలిస్తుండటంతో నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.

బరిగెల శేఖర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement