FRIDAY,    December 14, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Rangareddy News
2/24/2016 12:35:50 AM
అయ్యో మహేశ్వరా..
-శిథిలమవుతున్న మహేశ్వరం గడికోట
-ఆనవాళ్లు కోల్పోతున్న కాకతీయుల నాటి అద్భుత కట్టడాలు
-చారిత్రాత్మక సంపదను పట్టించుకోని పురావస్తు శాఖ అధికారులు

మహేశ్వరం : కాకతీయుల నాటి గడికోటను ఔరంగజేబు దాడిలో మహేశ్వరం గడికోటతో పాటు శ్రీశివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు. అప్పటి నుంచి గత ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వాల హయాంలో పాలకులు ఈ కట్టడాల పరిరక్షిస్తామని, పర్యాటక కేంద్రంగా చేస్తామని చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి.

1672 నాటి కట్టడాలు...
తానీషా నవాబుల వద్ద పనిచేసిన అక్కన్న మాదన్నలు 1672లో శిథిలావస్థలో ఉన్న శ్రీశివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని పుణరుద్ధరించడానికి నిర్ణయం తీసుకున్నారు. అప్పటి రాజధాని గోల్కొండ కోటకు పశ్చిమ భాగాన 37 కిలోమీటర్‌లో ఈ ఆలయం ఉంది. ఈ కోటను పరిశీలిస్తే 1677లో కట్టిన నిర్మాణంలా ఉంది. ఇక్కడ కొన్ని నిర్మాణాలు శిథిలమైనప్పటికీ చూడడానికి రాతి కట్టడం చూడ చక్కదనంగా ఉంటుంది. ఇందులోని కట్టడాలన్నీ ఓరుగల్లు కోట నిర్మాణం మాదిరిగా ఉండడంతో కాకతీయలు కాలం నాటిదేననడానికి బలం చేకూర్చుతోంది.

ఈ గడికోటలో శ్రీరాముడు, విష్ణుగంగ, కోదండ రామస్వామి ఆలయాలున్నాయి. ప్రస్తుతం ఈ ఆలయాలు శిథిలమయ్యాయి. ఈ నిర్మాణమంతా ఏకశీలతో ఉండడం విశేషం. నిర్మాణాల చుట్టూ ఆర్చీలు, మధ్యలో ఉన్న కొలను, కోదండ రామస్వామి ఆలయం వెనక అక్కన్న, మాదన్నల కచేరి కేంద్రం ఉన్నాయి. ఒక శిలేఖానా (ఆయుధాగారం) ఉంది.

సమీపంలోనే కోదండరామస్వామి ఆలయం, శివగంగ పుష్కరిణి, విష్ణు భగవాన్, ఆంజనేయస్వామి ఆలయం కూడా అక్కన్న మాదన్నలు నిర్మించినట్లు ప్రతీతి. ఈ ఆలయాలను ఎనిమిదేళ్ల కాలంలో పూర్తి చేశారు. 1677లో ఈ ఆలయం పునర్మిర్మాణాల సమయంలో శ్రీశైలం దర్శనానికి వెళ్లిన ఛత్రపతి శివాజీ కూడా ఈ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఔరంగజేబు దాడి నాటి శిథిలాలు ఇప్పటికీ మూగ సాక్ష్యాలు ఉన్నాయి. చిన్న ఆలయాలను భక్తుల సహాయంతో అభివృద్ధి చేశారు.

మహేశ్వరం చుట్టూ చారిత్రాత్మక ఆలయాలే...
మహేశ్వరం ప్రాంతాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లినట్లు ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి. అక్కన్న, మాదన్న కాలం నాటి నుంచే ఇక్కడ ఆలయాలు వెలిసినట్లు తెలుస్తోంది. నేటికీ పలు గ్రామాల్లో శివలింగాలు బయల్పడుతూ ఇక్కడి వైభవోపేతమైన చరిత్రకు దర్పంగా నిలుస్తున్నాయి. మహేశ్వరం మండల కేంద్రం చుట్టూ ఆలయాలన్నీ చరిత్రాత్మకమైనవే. మంకాళ్‌లో మహాంకాళమ్మ ఆలయం, సిరిగిరిపురంలో లక్ష్మీదేవి ఆలయం, ఘట్టుపల్లిలో శ్రీ వీరాంజనేయస్వామి, జెన్నాయాగూడలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు అక్కన్న, మాదన్నలు నిర్మించినవే.

మహేశ్వరం ఆలయ సమీపంలో ప్రతిష్ఠించాలనుకున్న ఆంజనేయ స్వామి విగ్రహం దారి మధ్యలో ఉన్న ఘట్టుపల్లి వద్ద ఎడ్లబండిపై తెస్తుండగా కిందపడిపోయింది. దీంతో ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించడంతో నేడు ఘట్టుపల్లి వీరాంజనేయస్వామి ఆలయంగా పేరొచ్చింది. ఉత్తర దిశలో మంఖాల్‌లోని కాళీకాదేవి ఆలయం ఉండేది. దీంతో ఆ గ్రామానికి మహాంకాళీపురం నామం ఉండగా ఆ తరువాత మంకాళ్‌గా ఏర్పడింది.

పద రేకుల్లా శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం...
కాకతీయుల కాలంలో రాజరాజేశ్వర స్వామి ఆలయం నెలకొల్పడంతో ఈ గ్రామానికి మహేశ్వరం అని పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. మహేశ్వరం ముఖద్వారంలో శివగంగలో కొలువుదీరిన ఈ ఆలయం సౌందర్యోపాసకులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ ఆలయ నిర్మాణం గమనిస్తే పద్మాకారంలో ఉంటుంది. గంగ మధ్యలో ఉన్న శివాలయం దాని చుట్టూ ఉప ఆలయాలుగా శ్రీహరిహరేశ్వరుడు, శ్రీమల్లీశ్వరుడు, శ్రీఅవిముక్తేశ్వరుడు, శ్రీఅఘోరేశ్వరుడు, శ్రీఅమరేశ్వరుడు, శ్రీఅమృతేశ్వరుడు, శ్రీగంగాధేశ్వరుడు, శ్రీఇష్టకామేశ్వరుడు, శ్రీముకేశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీఏకాంబేశ్వరుడు, శ్రీమణికర్ణికేశ్వరుడు, శ్రీమహానందీశ్వరుడు, శ్రీఅమరావతీశ్వరుడు, శ్రీకాశీపతీశ్వరుడు, శ్రీమంగళ గౌరీశ్వరుడు ఆలయాలు పద రేకుల్లా ఉంటాయి. ఈ అద్భుత కళా నిర్మాణంతో ఉన్న ఈ ఆలయాన్ని అక్కన్న, మాదన్నలు పునరుద్ధరించినట్లు ప్రతీతి. ఇవి అష్టాదశ ఆలయాలు కావడం విశేషం.

శివపార్వతుల ఆలయాలతో పాటు మరో పదహారు ఆలయాలు దీని చుట్టూ కొలువుదీరాయి. శివగంగ మధ్యలో ఉన్న రాజేశ్వరిదేవీని, పైన రాజేశ్వరుడి రాజుగా పరిగణించినందుకే ఈ ఆలయానికి రాజరాజేశ్వర స్వామి ఆలయం పేరు వచ్చింది. సహజంగా శివుడి తల భాగంలో గంగ ఉంటుంది. ఇక్కడ మాత్రం గంగలోనే శివుడు ఉండడంతో ఆయన కింది భాగంలోనే రాజేశ్వరీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ శివగంగలో పుణ్య స్నానమాచరిస్తే సమస్త దోష నివారణ అవుతుందని భక్తులు విశ్వసిస్తారు.
271
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd