ఎస్‌హెచ్‌జీల ద్వారా పాలసేకరణ, ఉత్పత్తుల అమ్మకాలకు డీఆర్డీఏ ప్రణాళికలు
మినీ డెయిరీ, చిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు
మహిళలతో పాటు 10వేల మంది పాడి రైతులకు లబ్ధి
సంగారెడ్డి జిల్లాలో రెండు ప్రైవేటు మెగా డెయిరీ ప్లాంట్లు నెలకొల్పే అవకాశం
సంగారెడ్డి, మార్చి 16 (నమస్తే తెలంగాణ):మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నాణ్యమైన పాలు, డెయిరీ ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చేందుకు డీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. పాలు సేకరించి వాటిని ప్రాసెసింగ్ చేసి సొంత బ్రాండింగ్‌తో పెరుగు, పన్నీర్, చీజ్, నెయ్యితో పాటు ఐస్‌క్రీమ్ తయారు చేయించి విక్రయించేలా కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకోసం సంగారెడ్డి
జిల్లాలో దాదాపు పదివేల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించడంతో పాటు పాడి సంపద ఎక్కువగా ఉన్న జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గాల్లో పాలసేకరణ కేంద్రాలు, మిల్క్ చిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. పాడి ఉత్పత్తులకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎస్‌హెచ్‌జీల బ్రాండ్‌కు మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సంగారెడ్డి మార్చి 16 (నమస్తే తెలంగాణ): పాడి పరిశ్రమకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. ఈ రంగం లాభసాటిగా ఉండటంతో పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) దృష్టి సారించింది. జిల్లాలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ద్వారా డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు డీఆర్టీఏ ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. పాల సేకరణ, పాల ఉత్పత్తుల తయారీ అమ్మకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా లాభాలు చేకూరటంతో పాటు పాడి రైతులకు మంచి ధరల లభిస్తున్నది. ప్రజలకు కల్తీ లేని పాలు, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో పాడి ఉత్పత్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల ద్వారా పాలు సేకరణ అమ్మకాలు చేపట్టేలా డీఆర్టీఏ కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం సంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మినీ డెయిరీ యూనిట్లను ఏర్పాటు కసరత్తు చేస్తున్నది. పాల సేకరణ కేం ద్రాలు, మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను తయారు చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో త్వరలోనే రెండు పెద్ద డెయిరీ యూనిట్లు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జహీరాబాద్ ప్రాంతంలో హట్సన్ డెయిరీ పరిశ్రమ, సంగారెడ్డి ప్రాంతంలో హెరిటేజ్ డెయిరీ యూ నిట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు పరిశ్రమల ఏర్పాటైతే స్వయం సహాయక బృం దాలు పాడి రైతుల నుంచి సేకరించిన పాలను పరిశ్రమలకు విక్రయించి లాభాలు గడించేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్వయం సహాయక సంఘాలు ద్వారా పాల సేకరణ అమ్మకాలకు డీఆర్డీఏ సన్నద్ధం అవుతున్నది.
పాలు, పాల ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్
సంగారెడ్డి జిల్లాలో పాలు, పాల ఉత్పత్తులకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. సంగారెడ్డి జిల్లాలో 32,395 మంది పాడి రైతులు ఉన్నారు. రైతుల వద్ద 1,07,825 ఆవులు, గేదెలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 53,912 పాలు ఇచ్చే ఆవులు, గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజు 1,21,303 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. 1,21,303 లీటర్ల పాలల్లో విజయ డెయిరీ అత్యధికంగా 25,000 లీటర్ల పాలను రైతుల నుంచి సేకరిస్తున్నది. ఆ తర్వాత ప్రైవేట్ డెయిరీ సంస్థలైన హెరిటేజ్ 10వేల లీటర్లు, జెర్సీ 5వేలు, శకుంతల 5 వేలు, సరస్వతీ 5వేలు, కరింజ 3వేలు, తిరుమల 2వేల లీటర్ల పాలను పాడి రైతుల నుంచి సేకరిస్తున్నది. మొత్తంగా జిల్లాలో 50,000 వేల లీటర్ల పాలను సేకరించటం జరుగుతున్నది. పాడి రైతులు నేరుగా 20 వేల లీటర్లకుగాపై అమ్మకాలు జరుపుతున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా పాల సేకరణకు అవకాశాలు ఉంది. దీంతో డీఆర్డీఏ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల ద్వారా పాలసేకరణ, అమ్మకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం పాడి సంపద ఎక్కువగా ఉన్న జహీరాబాద్, సంగారెడ్డి, అందోల్ నియోజకవర్గాల్లో పాలసేకరణ కేంద్రాలు, మిల్క్ చిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. స్వయం సహాయక సంఘాల ద్వారా 10 వేల పాడి రైతుల నుంచి పాలు సేకరించి అమ్మకాలు జరిపేందుకు డీఆర్డీఏ కసరత్తు చేస్తున్నది. స్వయం సహాయక సంఘాలు డెయిరీ రంగంలోకి ప్రవేశించటంతో పాడి రైతులకు లాభం చేకూరటంతోపాటు పాడి రైతులకు మేలు జరుగనున్నది.
సొంతంగా పాల ఉత్పత్తి అమ్మకాలకు అవకాశం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాకు డెయిరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. స్వయం సహాయక సంఘాలు తాము సేకరించిన పాలను ప్రాసెసింగ్ చేసి పెరుగు, పన్నీర్, ఛీజ్, నెయ్యితోపాటు ఐస్ క్రీం తయారు చేయవచ్చు. తమ పాల ఉత్పత్తులను సొంతబ్రాండ్తో మార్కెట్లో అమ్ముకాలు జరిపి లాభాలు గడించే అవకాశం ఉంది. మహిళా సంఘాలకు అవసరమైన పెట్టుబడులు అందించేందుకు బ్యాంకులు సముఖంగా ఉన్నాయి. దీం తో డీఆర్డీఏ మహిళా స్వయం సంఘాలను పాడి పరిశ్రమవైపు మళ్లీంచేందుకు సన్నద్ధ అవుతున్నది.