MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Mahboobnagar News
5/28/2015 6:01:35 AM
మిషన్ కాకతీయకు ఊపిరి..ఊర చెరువు
fiogf49gjkf0d
-తొలి పలుకులు రచించిన మంత్రి హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రి
-వనపట్ల దీర్ఘకవితకు
-పలువురి ప్రశంసలు
-సాహితీ నీరటి..
-సంగిశెట్టి శ్రీనివాస్
తెలంగాణ ఉద్యమంలో పాలమూరు గడ్డ నుంచి వొల్లెడ, మశాల్ అను రెండు దీర్ఘకవితా పుస్తకాలను రచించి యావత్తు తెలంగాణ కవుల మనస్సులను తన కవితాశక్తితో వశపరచుకున్న కవిగా వనపట్ల సుబ్బయ్య సాహిత్య లోకంలో సుపరిచితుడే. వొల్లెడ సినారె పురస్కారాన్ని అందుకోగా, మశాల్‌పై యూనివర్సిటీలలో పత్ర సమర్పణలు జరిగాయి. వనపట్ల సుబ్బయ్య కలం నుంచి జాలువారిన మరో దీర్ఘకవిత ఊర చెరువు ఈ దీర్ఘకవితలో రెండు భాగాలున్నాయి. మొదటిది చెరువు వలపోత కాగా రెండోది కవి తలపోత. వలపోతలో చెరువు తనకు పట్టిన దుస్థితిపై కుమిలిపోతూ తన వ్యథను మనకు చెప్పుకోగా, తలపోతలో కవి చెరువు ఏ విధంగా ఉంటే బాగుంటుందో తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు వెలుగుతదని ఆశావాద దృక్పథంతో ఈ దీర్ఘకవితను కవి ముగించాడు. చెరువు తన గురించి తాను చెప్పుకుంటూ బాధపడుతూ లొట్టపీసుల కంపతారులు నన్ను బంధించినా ఒక్కరన్నా చెర విడిపియ్యలే అని రాయడం సమైక్యాంధ్ర పరిపాలన ఎంతటి నష్టాన్ని తెలంగాణకు చేసిందో, గొలుసుకట్టు చెరువులను పట్టించుకోక సాగునీటి వసతులను ఏ విధంగా మనకందకుండా చేసిందో తెలుపుతున్నది. సుబ్బయ్య చెరువులో సర్వమానవ సమానత్వాన్ని దర్శించడం విశేషం.

మీరు మనుషులై రెండు గ్లాసులు పాటిస్తే నేను బుద్ధుడిలా సమానత్వాన్ని పాటిస్తి అన్ని మతాలు వదిలిన తెప్పలను నా అలల ఎదలపై ఆడించి, మత సామరస్యాన్ని పెంచి, సామాజిక న్యాయాన్ని పంచిన అనే కవితా వాక్యాలలో చెరువును బుద్ధుడిగా, అంబేద్కర్‌గా, కవిగా పోల్చడం ఆయనలోని కుల, మత రహిత సమాజ కాంక్షకు అద్దం పడుతోంది. చెరువు సమస్త పండుగలకు, వృత్తులకు, పంటలకు, జీవరాశికి, జలరాశికి ఏ విధంగా ఆధారమవుతుందో దానితో సమాజానికి ఎ లాంటి తాత్తిక సంబంధముందో ఈ దీర్ఘ కవితలో మనం చదవవచ్చు. ప్రధానంగా కవి తన ఊరి చెరువుతో తన చిన్ననాటి నుంచి ఉన్న అనుబంధాన్ని, సంబంధాన్ని, ఆత్మీయతను, ఆనందాన్ని ఇందులో పొందుపర్చాడు. ఈ కవితలో పాలమూరు మాండలికాలు పుష్కలంగా పొంగి పొర్లినవి. శాస్త్రవేత్తలు ఒండులోని సారాన్ని గురించి చెప్పిన విషయాలతో పాటు చెరువులు బాగుంటేనే సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు బాగుంటాయని చెప్పడం కవి లోకానుభవానికి నిదర్శనం. చెరువుపై తెలంగాణ నుంచి వచ్చిన ఒకటి రెండు దీర్ఘ కవితల్లో ఊర చెరువు ఒకటి కావడం పాలమూరు సాహిత్యలోకానికి గర్వకారణం. కవి ఆశించినట్లు మిషన్ కాకతీయ విజయవంతమై పల్లెలు పట్నాలన్నీ తిరిగి పంట సిరుల ఊటలుగా, మూటలుగా మారాలని ఆశిద్దాం.

మిషన్ కాకతీయతో కరువు కథ ముగిసినట్లేనని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టీ.హరీష్‌రావు, సుబ్బయ్య కత్తి ఎంత పదునైననదో చెబుతూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, చెరువుల పునరుద్ధరణతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పరిపుష్టం అవుతుందో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, సాహితీ నీరటి అంటూ ప్రముఖ రచయిత సంగిశెట్టి శ్రీనివాస్, ఉద్యమకవి వనపట్ల సుబ్బయ్య అంటూ పాలిటెక్నిక్ విశ్రాంత ప్రిన్సిపాల్ రాసిన నాలుగు మాటలు ఊరచెరువు దీర్ఘ కవితను మరింత బలానివ్వగా సుబ్బయ్య బాధ్యతను కూడా పెంచాయి...
- సంబరాజు రవిపక్రాశ్‌రావు
సెల్ : 9491376255
429
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd