TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Khammam News
2/4/2016 2:38:55 AM
ప్రారంభమైన తెలుగు నాటకోత్సవాలు
-ఆకట్టుకున్న ఈలెక్క ఇంతే నాటిక
భద్రాచలం, నమస్తే తెలంగాణ ఫిబ్రవరి 3 : భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలోని కళావేదికపై నిర్వహిస్తున్న 14వ అంతర్ రాష్ట్ర తెలుగు నాటకోత్సవాలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలుగా రాష్ట్రస్థాయి నాటిక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇందుకు కారకులైన ఆర్టీసీ ఉద్యోగులతోపాటు స్థానికుల సహకారం మరువలేనిదన్నారు. ఇటువంటి కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

రానున్న కాలంలో కూడా ఈ పోటీలు నిర్వహించాలని కోరారు. భద్రాచలం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ బుల్లికృష్ణ మాట్లాడుతూ... చిరు ఉద్యోగులైన ఎంతో గొప్ప ఈ కార్యాన్ని ఆర్టీసీ ఉద్యోగులు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు తాళ్లూరి పంచాక్షరయ్య, ఐటీసీ పీఎస్‌పీడీ మేనేజర్ విజయ్‌సారధి, కళాభారతి అధ్యక్షుడు పాకాల దుర్గాప్రసాద్‌రావు, మదర్‌థెరిస్సా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తిప్పన సిద్దులు, దేవస్థానం ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథచార్యులు, ఎంపీటీసీ వంశీకృష్ణ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు, రాము, సత్యనారాయణలతోపాటు భద్రాద్రి కళాభారతి ఫౌండర్ అల్లం నాగేశ్వరరావు, నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.

కుటుంబాలు బాగుంటేనే సమాజాం బాగుంటుంది... : చైతన్య కళాభారతి కరీంనగర్ వారు ప్రదర్శించిన ఈ లెక్క ఇంతే నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేసే విధంగా సాగింది. కుటుంబాలు బాగుంటూనే సమాజాం బాగుంటుందని ఇచ్చిన సందేశం ప్రేక్షకులను రంజింప చేసింది. సమాజానికి కుటుంబాలే పునాది కాబట్టి ఆ కుటుంబంలో తండ్రి బాధ్యతాయుతంగా ఉంటే అది కుటుంబంలో అందరికి భద్రత ఇస్తుందని చెప్పిన డైలాగ్‌లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలా కాకుండా బలహీనతలకు బానిసై బాధ్యతారాహిత్యంగా నడుచుకుంటే అది అనేక కష్టాలకు, ప్రమాదాలకు దారి తీస్తుందని అలాంటి కష్టమే ఓ కుటుంబానికి ఎదురైతే ఈ తల్లిపడ్డ మనోవేదన గురించి చూపించిన తీరు బాగుంది.

మనిషి అనే వాడు తాను బ్రతుకుతూ తన వాళ్లను బ్రతికించాలే తప్ప కేవలం తన సుఖం, స్వార్ధం చూసుకునేవాడు మనిషిగా పుట్టిన మనిషి అనిపించుకోలేడని ఈ లెక్క ఇంతే అని చెప్పిన నాటిక అపురూపంగా సాగింది. ఈ నాటికలో సత్యం పాత్రలో మంచాల రమేష్, రాజ్యం పాత్రలో జ్యోతి, సుందరం పాత్రలో సత్యనారాయణ, బుచ్చయ్య పాత్రలో శివరామ్‌లు నటించారు. కేఎస్‌ఎన్ శర్మ సంగీతం అందించగా ఉదయ్‌కుమార్ ఆహార్యం, గిరి రంగాలంకరణ చేశారు. ఈ నాటికను పరమాత్ముడు నటించగా మంచాల రమేష్ దర్శకత్వం వహించారు.
311
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd