TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Khammam News
3/10/2016 3:46:46 AM
అస్తమించిన అజ్ఞాత సూర్యుడు
ఖమ్మం, నమస్తేతెలంగాణ : నమ్మిన సిద్ధ్దాంతమే ఊపిరిగా.. సమస్త పీడిత ప్రజల విముక్తే ఆశయంగా.. తుపాకి ఒక్కటే కాదు, బలమైన ప్రజాఉద్యమాన్ని నిర్మించి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ఆవిష్కరించాలని అనునిత్యం తపనపడిన అజ్ఞాత సూర్యుడు రాయల సుభాష్‌చంద్రబోస్ అలియాస్ రవి(70) అస్తమించారు. నైతిక విలువలే ప్రామాణికంగా, మార్క్సిజం, మావో ఆలోచనా విధానమే జాతి విముక్తికి మార్గమని భావించి రాజీలేని పోరాటం నడిపిన యోధుడు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత 25 సంవత్సరాలుగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ, పార్టీ శ్రేణులకు దిశాదశను నిర్ధేశించిన ఆయనది ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామం. 1947 లో రాయల గోపాలకృష్ణయ్య, రాంబాయమ్మ దంపతులకు జన్మించిన బోస్ విద్యార్థి దశనుంచే వామపక్ష రాజకీయాలకు ఆకర్షితుడయ్యారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదివారు.

1967లో నక్సల్బరీ, శ్రీకాకులం రైతాంగ పోరాటాల తో చదువుకు స్వస్తిపలికారు. సమాజంలో నెలకొన్న పెట్టుబడిదారి, పెత్తందారి వ్యవస్థలను రూపుమాపాలనే నినాదంతో డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు రాయకుండానే ఉద్యమబాట పట్టారు. అంతకు ముందే కమ్యూనిస్టు యోధుడు బత్తుల వెంకటేశ్వరరావుతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ స్థాపించి విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

సీపీఎం నుంచి విభేదించి అజ్ఞాతంలోకి..
మొదట్నుంచీ సిద్దాంతం, నియమావళికే కట్టుబడిన రాయల సీపీఎంలో నెలకొన్న భిన్నరాజకీయాలతో 1967లోనే విభేదించారు. ఆనాటి సీపీఎం అగ్రనేతల్లో ఒకరైన బసవ వెంకటేశ్వరరావుతో కలిసి బయటికి వచ్చారు. అప్పుడే విప్లవోద్యమాన్ని నడిపిస్తున్న చార్‌మంజుదార్ పంథాకు ఆకర్షితుడై అదే ఏడాది సీపీఐ(ఎంఎల్) పార్టీలో చేరిన ఆయన తుపాకీ చేతపట్టి, అజ్ఞాతంలోకి వెళ్లారు. తొలుత 1967 నుంచి 1972 వరకు చార్‌మంజుదార్ న అనుచరునిగా ఆర్‌వోసీలో పనిచేశారు.

జిల్లాలోని పాల్వంచ దండకారణ్యంలో కీలక భాద్యతలు నిర్వర్తిస్తూ పేదల విముక్తే ధ్యేయంగా పోరాటం సాగించారు. అదేక్రమంలో 1971 నుంచి చండ్రపుల్లారెడ్డి, రామనర్సయ్య విప్లవపంథాలో చేరిన సుభాష్‌చంద్రబోస్ పోరాటాన్ని మరింత విస్తృత పరిచారు. 1980లో ప్రజాప్రంధా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎదిగి క్రియాశీలక పోరాటాలకు నాయకత్వం వహించారు. 1992లో ప్రజాపంధా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆనాటి నుంచి తుదిశ్వాస విడిచే వరకు కేంద్రకమిటీ సభ్యుడిగా కొనసాగటం విశేషం.

కుటుంబమంతా విప్లవ పంధాలోనే..!
ఖమ్మం జిల్లాలో పుట్టిన రాయల సుభాష్‌చంద్రబోస్ దేశ విప్లవ రాజకీయాల్లోనే చెరగని ముద్రవేశారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కుటుంబమంతా ఇప్పటికీ విప్లవపంధాలోనే కొనసాగుతున్నారు. ఆయన భార్య రాయల రమాదేవి పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. సోదరులు రాయల చంద్రశేఖర్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, మరొక తమ్ముడు రాయల నాగేశ్వరరావు న్యూడెమోక్రసీ తరుపున పిండిప్రోలు గ్రామ సర్పంచ్‌గా పలుమార్లు ఎన్నికయ్యారు. కులం అంటే కుళ్లు, మతం అంటే మత్తురా అనే సిద్ధాంతాన్ని తూచ తప్పకుండా ఆచరించిన రవి, తన కూతరుకు కులాంతర వివాహం జరిపించి ఆదర్శానికి నిలువెత్తు నిదర్శనమయ్యారు.

49 ఏండ్ల సుధీర్ఘ ప్రస్థానంలో చిన్న మచ్చకూడా కనిపించదు. బతికినంత కాలం నీతి, నిజాయితీ, నైతిక విలువలకు అధిక ప్రాధాన్యమిచ్చిన ఆయనంటే స్వంతపార్టీలోనే కాదు, ఇతర అన్నివిప్లవ శక్తుల్లో కూడా ఎంతో గౌరవం. అనేక సందర్భాల్లో ఆయన్ని నిర్భందించాలని వలవేసిన పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా బయటపడ్డ సంఘటనలు కోకొల్లలు. ఉద్యమక్రమంలో చాలా ఏండ్లుగా జిల్లాకు దూరమైనా పిండిప్రోలు, తెట్టెలపాడు, ఖమ్మం రూరల్ మండలంలోని వెంకటాయపాలెం, అర్బన్ మండలంలోని రామనర్సయ్యనగర్, వేపకుంట్ల ప్రజలతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్నారు.

నేడు పిండిప్రోలులో అంత్యక్రియలు..!
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న రాయల సుభాష్‌చంద్రబోస్ మరణాన్ని ఆపార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. కిందిస్థాయి కార్యకర్త నుంచి పైస్థాయి నాయకుడి వరకు రవన్నగా పిలుచుకునే ఆయన ఇకలేరని తెలుసుకున్న ఎన్‌డీ వర్గాలు శోకసంద్రంలోకి వెళ్లాయి. హైదరాబాద్‌లో మరణించిన ఆయన భౌతికకాయాన్ని గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మానికి తీసుకువస్తున్నారు. తొలుత ప్రజల సందర్శనార్ధం నగరంలోని రామనర్సయ్య విజ్ఞాణకేంద్రానికి తీసుకురానున్నారు. అనంతరం ఆయన స్వగ్రామం పిండిప్రోలుకు తరలించి అక్కడే అంత్యక్రియలు జరిపించనున్నారు.

రవన్న ఆశయాలను నెరవేరుస్తాం..
అజ్ఞాత దళ కమాండర్ మధు
రక్త సంబంధం కన్నా వర్గ సంబంధమే మిన్నా అని వెలుగెత్తి చాటిన వాడు, 5 దశాబ్దాల విప్లవోద్యమ యోధుడు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) మృతి విప్లవోద్యమానికి తీరని లోటని ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏరియా కమిటీ కార్యదర్శి మధు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీడిత జన బ్రతుకులల్లో కొవ్వొత్తిలా వెలిగినవాడు, రేపటి భావి తరాలకోసం నవసమాజ నిర్మాణం కోసం అలుపెరగని పోరు సలిపాడిన వ్యక్తి రవన్న అని ఆయన అభివర్ణించారు.

45 సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపిన ఆయన నయారివిజనిజాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా యుద్ధ పంథాలో కొనసాగారు. పిండిప్రోలు ప్రాంతంలో భూస్వామి అయిన ఉన్నం నాగేశ్వరరావు దౌర్జన్యాలను ఎదిరించి ప్రజా ఉద్యమంతో తిప్పికొట్టాడు. ఆయన అకాల మరణం విప్లవోద్యమానికి తీరనిలోటు. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం. రవన్న అడుగు జాడల్లో ప్రజలంతా పయనించాలని, నూతన ప్రజాస్వామిక విప్లవ పరిపూర్తికి సహకరించాలని పిలుపునిచ్చారు.
374
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd