e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home కామారెడ్డి అర్వింద్‌కు.. ‘ఎక్స్‌టెన్షన్‌'!

అర్వింద్‌కు.. ‘ఎక్స్‌టెన్షన్‌’!

స్పైసెస్‌ బోర్డు రీజినల్‌ ఆఫీస్‌ పనితీరును, ఉపయోగాన్ని నేటికీ వివరించని వైనం
నిజామాబాద్‌ జిల్లాలో కార్యాలయం ఉన్నట్టే రైతులకు తెలియని దుస్థితి
సూచిక బోర్డుతోనే సరిపెట్టుకుంటున్న ఎక్స్‌టెన్షన్‌ కార్యాలయం
ఇద్దరు అధికారులు, ఇద్దరు సిబ్బంది మాత్రమే దిక్కు
నిజామాబాద్‌, మార్చి 17, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రోజురోజుకూ జఠిలమవుతున్న పసుపు బోర్డు అంశం నుంచి బయటపడేందుకు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆపసోపాలు పడుతున్నారు. ఎన్నికల వేళ రైతులకు బాండ్‌పేపర్‌ రాసిచ్చిన అర్వింద్‌.. ఆ తర్వాత అటు పసుపుబోర్డుపై తేల్చక, ఇటు రాజీనామా చేయక ఏడాదిన్నరగా కాలయాపన చేస్తూ వచ్చారు. ఇప్పుడు పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం పసుపు బోర్డును ఏర్పాటుచేయలేమంటూ తేల్చిచెప్పడంతో.. అర్వింద్‌ ఇబ్బందికరపరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర, జాతీయ అంశాలపై నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆయన.. పసుపు రైతులకు తన ప్రయత్నాలను వివరించి ఒప్పించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. స్పైసెస్‌ బోర్డు ఎక్స్‌టెన్షన్‌ కేంద్రాన్నీ నిజామాబాద్‌లో ఏర్పాటు చేయించినట్లు చెబుతున్న ఎంపీ.. గత ఆరునెలలుగా దానివల్ల రైతులకు ఒరిగిందేమిటో మాత్రం ఎక్కడా వివరించడంలేదు. ఈ నేపథ్యంలో పసుపు రైతుల నిరసనాగ్నిని జిల్లాలో ఆయన ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది.

పసుపు బోర్డు ఏర్పాటు అంశం నుంచి బయట పడేందుకు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ చేస్తోన్న ప్రయత్నాలు అనేకం. లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన తొలి రోజే బోర్డు ఏర్పాటుపై మాట మార్చాడు. ఏడాదిన్నర కాలంగా సాగదీతతో కాలం గడిపాడు. ఇందూరు ప్రాంత రైతులు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా బోర్డు ఏదంటూ? నిలదీతలు మొదలు పెడుతుండడంతో నిజామాబాద్‌ జిల్లాకే ముఖం చాటేశారు. 2020 మార్చి 22 నుంచి మే నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పేరుతో నిజామాబాద్‌ను కన్నెత్తి చూడలేదు. సడలింపుల అనంతరం కూడా దిశ మీటింగ్‌, బీజేపీ రాజకీయ కార్యక్రమాలకు అటెండ్‌ కావడానికే పరిమితం అయ్యాడు. ప్రజల్లో తిరిగితే రైతులు ఎదురు తిరుగుతారని నిత్యం ఏదో ఒక అంశంపై వివాదాస్పద కామెంట్లు చేయడం, వార్తల్లో నిలిచేందుకే ప్రాధాన్యం ఇచ్చినట్లుగా రైతులు గుర్తించారు. తద్వారా రైతుల దృష్టి మరల్చి బోర్డు అంశాన్ని మూలకు పెట్టాలని ఎంపీ అనుకున్నట్లుగా బీజేపీ సానుభూతిపరులే బహిరంగంగా చెప్పుకొస్తున్నారు. రైతులు మాత్రం తమ సత్తా చాటుతుండడం, పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు కీలకమైన ప్రకటనలు చేయడంతో ఎంపీ అర్వింద్‌ పడరాని పాట్లు పడుతున్నట్లు అర్థం అవుతున్నది. పసుపు రైతులకు మెరుగైన సౌకర్యం ఏ విధంగా తీసుకువచ్చాడు? అదీ ఎంత మేరకు ఉపయోగపడుతుందో వివరించలేక.. రైతులకు ముఖం చూపెట్టలేక పడరాని పాట్లు పడుతుండడం గమనార్హం.

- Advertisement -

ఎక్స్‌టెన్షన్‌ ఆఫీస్‌ ఉత్తదే..
నిజామాబాద్‌ నగరంలోని వినాయక్‌నగర్‌లో గుట్టుగా ఖమ్మం నుంచి తీసుకు వచ్చి ఏర్పాటు చేసిన స్పైసెస్‌ బోర్డు ఎక్స్‌టెన్షన్‌ కమ్‌ రీజినల్‌ ఆఫీస్‌ ఉత్తదే అన్నట్లు తెలుస్తున్నది. 2020 అక్టోబర్‌లో అద్దెగదిలో నెలకొల్పిన రీజినల్‌ ఆఫీస్‌లో నాలుగు బల్లాలు, నాలుగు కుర్చీలు మినహా ఏ ఇతరత్రా వ్యవసాయాధారిత, పసుపు పంటకు సంబంధించిన పరికరాలు కనిపించడం లేదు. నామమాత్రంగా ఒక డిప్యూటీ డైరెక్టర్‌ బాలసుభ్యమని వెంకటేషన్‌ను అపాయింట్‌ చేశారు. మరొక అడిషినల్‌ డైరెక్టర్‌ పోస్టుకు స్వప్న థోమర్‌ అనే అధికారిణిని నియమించారు. వీరు ఇరువురు స్పైసెస్‌ బోర్డు – కొచ్చి నుంచి ఆదేశాలను మాత్రమే పాటిస్తారు. సుగంధ ద్రవ్యాల బోర్డులో అనేక రకాల పంట ఉత్పత్తులు ఉంటా యి. అందులో పసుపు ఒకటి. డీడీ, ఏడీలకు సహాయంగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఇద్దరు కింది స్థాయి ఉద్యోగులను నియమించి కేంద్ర ప్రభుత్వం మమ అనిపించింది. సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇంటిలో తలదాచుకుంటున్న స్పైసెస్‌ బోర్డునే బోర్డు కంటే భారీ వ్యవస్థ అంటూ ఎంపీ అర్వింద్‌ పదే పదే ప్రకటనలు చేస్తూ రైతులను మోసగిస్తున్నట్లుగా ఆయనకు ఓట్లు వేసిన వారంతా భావిస్తున్నారు.

తాను తవ్వుకున్న గోతిలో..
బీజేపీ 2019 సాధారణ ఎన్నికల్లో వాస్తవ దూర హామీలతో, అబద్ధాలతో ప్రజల ముందుకు వెళ్లింది. ముఖ్యంగా పసుపు రైతుల భావోద్వేగాన్ని, వారిలో ఉన్న పసుపు బోర్డు డిమాండ్‌ను ఆసరా చేసుకుంది. 2014 నుంచి 2019 వరకు ఎంపీ కల్వకుంట్ల కవిత లోక్‌సభలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం పోరాటం చేశారు. అడుగడుగునా సందర్భానుసారం కేంద్రాన్ని నిలదీసినా.. బోర్డుపై ప్రకటన చేయని బీజేపీ ప్రభుత్వం… లోక్‌సభ సీటు గెలవాలనే ఏకైక లక్ష్యం తో ప్రజలను మభ్య పెట్టింది. ఇందుకు బీజేపీ జాతీయ నాయకులు, నాటి హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, మరో క్యాబినెట్‌ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, రాంమాధవ్‌ వంటివారు బోర్డుపై హామీ ఇచ్చారు. రైతులను రెచ్చగొట్టి ఎన్నికల్లో మరింత మంది నిలబడేలా ప్రోత్సహించి ఓట్లను నిలువునా చీల్చింది. ఇలా మైండ్‌గేమ్‌తో ఎంపీ సీటును దక్కించుకున్న బీజేపీ తీరా అదే రైతులకు నమ్మక ద్రోహం చేసింది. మద్దతు తెలిపిన పసుపు రైతులే ఇప్పుడు రివర్స్‌ అవుతున్నారు. ఎంపీ అర్వింద్‌ రాజీనామా కోరుతూ తిరుగుబాటు చేస్తుండడంతో బీజేపీ తాను తవ్వుకున్న గోతిలో తానే పడినట్లుగా అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒక ఇంటర్వ్యూ.. అనేక అబద్ధాలు..
2019, డిసెంబర్‌ 22న ఎంపీ అర్వింద్‌ ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. పసుపు బోర్డుపై మీ అభిప్రాయం ఏంటని అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేక అర్వింద్‌ తనదైన శైలిలో తప్పించుకున్న వైనం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. పసుపు బోర్డు తీసుకు రావడంలో విఫలమైన అర్వింద్‌.. ఎప్పుడు రాజీనామా చేస్తారు? అంటూ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు పొంతన లేని సమాధానం ఇచ్చారు. విఫలం అయినట్లు నేను చెప్పిన్నా అంటూ దాటవేశారు. మనం రేపిన సెంటిమెంటే మనకు చుట్టుకుంటూ ఉంటే సొల్యూషన్‌ కోసం అర్వింద్‌ వెతుక్కుంటున్నారా? అని ప్రశ్నించగా.. నా మెడ గట్టిదంటూ అర్వింద్‌ వ్యాఖ్యానించాడు. బాండ్‌ పేపర్‌ ప్రమాణం ఏమైందని అడిగితే… మీరు చదివారా? అంటూ విలేకరిని ఎదురు ప్రశ్నించారు. పసుపు బోర్డు కన్నా ఎఫెక్టివ్‌ వ్యవస్థ రాబోతోందని ఎంపీ చెప్పగా బోర్డు రానెట్టేనా? అసలు సంగతి ఏంటని ప్రశ్నించగా.. అసలు వస్తది. అంత కు మించి వస్తదంటూ అర్వింద్‌ జవాబిచ్చారు. ఆది నుంచి ఉల్టా పల్టా మాటలతో గారడి చేస్తూ వచ్చిన అర్వింద్‌ ఎట్టకేలకు 15 నెలల అనంతరం కేంద్రంలోని బీజేపీ పెద్దలే పసుపు బోర్డు ఏర్పాటు ప్రతిపాదనే లేదని స్పష్టం చేయడంతో ఆగమాగం కావాల్సిన దుస్థితి ఏర్పడింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement