చాదర్‌ఘాట్ : మూడు అడుగుల వ్యక్తి… దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. నగరానికి చెందిన శివలాల్ నేత (30) నేత డ్రైవింగ్‌లో తన ప్రతిభను కనబర్చి లైసెన్స్ పొందడం ద్వారా ది వండర్ బుక్ ఆప్ రికార్డ్స్‌లో లో స్థానం దక్కించుకున్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్ కార్యాలయంలో దృవీకరణ పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బింగి నరేందర్ గౌడ్ మాట్లాడుతూ అన్ని అవయవాలు ఉన్నా కూడా నాలుగు చక్రాల వాహనాన్ని నడిపించడం అందరికీ సాధ్యం కాదు. కానీ మరుగుజ్జుగా కేవలం మూడు అడుగులు ఉన్న శివలాల్ నేత తన ప్రతిభతో రవాణ శాఖ అధికారుల టెస్ట్ రైడ్‌లో ఉత్తీర్ణత సాధించి డ్రైవింగ్ లైసెన్స్ పొందడం విశేషం అన్నారు.
శివలాల్ నేత మాట్లాడుతూ 170 దేశాల్లో ప్రతి సంవత్సరం ప్రచురితమయ్యే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిభ, సాహసం, పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహిస్తున్న ప్రపంచ వండర్ బుక్ ఆఫ్ రికార్డు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.