చార్మినార్ : చారిత్రక సిటీ కాలేజీ మరో ఘనతను సాధించిందని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బాలభాస్కర్ తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిటీ కాలేజీకి స్వయంప్రతిపత్తి హోదాను కొనసాగిస్తూ గురువారం యూజీసీ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. అధ్యాపక బృందంతోపాటు ప్రతి ఒక్కరు చేసిన కృషికి నిదర్శనంగా ఈ ఘనతను సాధించామని తెలిపారు.
గత 2017 నుండి ఆమోద ముద్ర వేస్తూ మరో 5 సంవత్సరాలపాటు సిటీ కాలేజీకి స్వయంప్రతిపత్తి హోదాను కొనసాగించనున్నారని ప్రిన్సిపల్ వెల్లడించారు. గత జూలై, ఆగస్టు నెలల్లో యూజీసీ కమిటీ సభ్యులు కాలేజీని సందర్శించి కాలేజీలో 26 వివిధ అంశాల్లో అందిస్తున్న విద్యాభోధన, ల్యాబ్‌లోని సౌకర్యాలు, విద్యార్థులకు సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారని తెలిపారు.