బంజారాహిల్స్ : ‘టాయ్‌లెట్ ఉందా..’ అంటూ ఓ అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్‌లోకి వచ్చిన గుర్తుతెలియని యువకుడు అక్కడున్న వాచ్మెన్ కుమార్తెలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని విష్ణూ బ్లూ లోటస్ అపార్ట్‌మెంట్స్‌లోకి ఈ నెల 12న హెల్మెట్ ధరించిన ఒక యువకుడు ప్రవేశించాడు. అక్కడున్న వాచ్మెన్ కొడుకును టాయ్‌లెట్ ఉందా అని అడగ్గా పార్కింగ్ పక్కనున్న టాయ్‌లెట్స్ చూపించి బయటకు వెళ్లిపోయాడు. లోనికి వెళ్లిన యువకుడు టాయ్లెట్నుంచి బయటకు వచ్చాడు.
పక్కనే తమ గదిముందు నిలబడిన వాచ్మెన్ ఇద్దరు కూతుళ్లను చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా గదిలోకి వచ్చి అభ్యంతరకరమైన రీతిలో ప్రవర్తించాడు. దాంతో ఆందోళనకు గురైన బాలికలు బయటకు వచ్చి కేకలు పెట్టడంతో అక్కడినుంచి పారిపోయాడు. కాగా ఈ వ్యవహారం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయింది. జరిగిన సంఘటనను గురించి అపార్ట్మెంట్ యజమాని ఖాజా అసిఫ్ అహ్మద్ బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో గుర్తుతెలియని యువకుడిపై ఐపీసీ 354(ఏ)తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.