TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Medak News
9/23/2015 11:14:26 PM
బుల్లితెరపై వేలూరి బుల్లోడు..!
-సాహిత్యమే తొలిమెట్టుగా..
-అభినయమే పెట్టుబడిగా..
-అంచెలంచెలుగా ఎదుగుతూ..
-రాణిస్తున్న లక్ష్మీకిరణం..
-రాష్ట్ర నందీ అవార్డులను సొంతం చేసుకున్న వైనం
నమస్తే తెలంగాణ ప్య్రతేక కథనం... - వర్గల్ :చిన్నతనం నుంచి తెలుగుసాహిత్యంపై అభిమానం నేడు ఉపాధికి బాసట అయ్యింది. చదుకునే సమయంలో కళాకారులు, నటులు చూపే అభినయం పూర్తిగా వంటబట్టింది. టీవీ బుల్లితెరపై, సినిమాతెరపై ఒక్కసారి కనిపించాలన్న తపన ఊరువిడిచి పట్నానికి పయణం కట్టించింది. ఆంధ్రకళాకారుల సరసన నిలబడి ఏ పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం బాహురే... పల్లెటూరు బుల్లోడా.. అనిపించుకుని ఏకంగా వరుసగా నాలుగు రాష్ట్ర నందీ అవార్డులను కైవసం చేసుకుని స్వరాష్ట్రంలో (తెలంగాణ) బిజీ కళాకారుల మధ్య ఒకడిగా నిలబడ్డ వర్గల్ మండలం వేలూరుకు చెందిన మొలుగు లక్ష్మీకిరణ్‌పై

వేలూరుకు చెందిన మొలుగు వెంకట్‌రావు, అమృతాబాయి దంపతుల రెండో కొడుకు లక్ష్మీకిరణ్ బాల్య విద్య వేలూర్‌లోనే గడిచింది. అన్న రఘుపవన్ వర్గల్ సరస్వతీ ఆలయ నిర్వహణ రోజువారీ కార్యకలాపాల్లో ప్రధానపాత్ర వహిస్తుండగా, చెల్లి శారద కర్ణాటక సాహిత్యంలో పరిశోధన చేస్తుంది. కరణం కుటుంబం కావడం ఒకరకంగా పుట్టుకతోనే లక్ష్మీకిరణ్‌కు తెలుగు సాహిత్యంపై పట్టు అబ్బింది. పద్యపఠనం, పద్య రచనలో చిన్ననాటి తెలుగు గురువు నర్సయ్యసారే ఆదర్శమని కిరణ్ చెబుతాడు. నటనపై మక్కువతో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లక్ష్మీకిరణ్‌కు మొదట్లో ఆంధ్రా కళాకారుల వెకిలి చేష్టలు, ఈసడింపులతో పడరానిపాట్లు పడ్డాడు. అంచెలంచెలుగా కళారంగంపై మక్కువతో ఒడిదుడుకులను ఎదుర్కొని టీవీలో చిన్నచిన్న పాత్రలకు ఎంపికయ్యాడు. ఆ తరువాత స్టేజీలపై ఏకపాత్రాభినయం, స్త్రీ పాత్రలు వేస్తూ మెల్లమెల్లగా దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు.

సర్ధార్‌పటేల్ కాలేజీలో డిగ్రీ చదువుతూనే సావనీర్ చీఫ్ ఎడిటర్‌గా పార్ట్‌టైం విధులు నిర్వహించాడు. రసరం.నిలో డ్రామాలు వేస్తూనే ఎంఏ.థియేటర్‌ఆర్ట్స్‌లో పట్టాపొందాడు. 2005లో తొలిసారిగా విజయవాడలో జరిగిన జాతీయస్థాయి నాటక పోటీల్లో పాల్గొని మొట్టమొదటి సారి నాటకనంది అవార్డు అందుకున్నాడు. ఇక అక్కడితో లక్ష్మీకిరణ్ వెనుతిరిగి చూడలేదు. 2007లో నిజామాబాద్‌లో జరిగిన నందీ నాటకోత్సవంలో మరో అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇంతింతై.. వటుడింతై.. అన్నట్లుగా పరుచూరి బ్రదర్స్ వారు నిర్వహించిన శాపగ్రస్తులు నాటకంలో ఉత్తమ అవార్డు లభించింది. 2009లో టీవీ నాటక నందీ అవార్డులకు గాను విప్రనారాయణ పాత్రకు నాటకనందీ అవార్డు లభించింది. 2014లో నందీ అవార్డుల జ్యూరీ మెంబర్‌గా ఎన్నికయ్యాడు. రకరకాల వేదికలపై ప్రదర్శించిన తీరుకుగాను దాదాపు నూటయాభైకి పైగా అవార్డులు అందుకున్నాడు.

టీవీ రంగంలో ...
ప్రస్తుతం ఈ టీవిలో తూర్పుకువెళ్లే రైలు, భార్యామణి, అంతఃపురం, చంద్రముఖి, నాపేరు మీనాక్షి, మా టీవీలో అష్టాచెమ్మా, జెమిని టీవీలో ఫ్రెండ్స్, మమతల కోవెలతో పాటు ఈ టీవీలో కొత్తగా వస్తున్న సీరియళ్లలో నటిస్తున్నాడు. వ్యాపార యాడ్స్‌లో సువర్ణభూమి, పాల్‌కాన్, శ్రీరామ్‌చిట్స్‌తో పాటు ఇతర యాడ్స్‌ల్లో నటిస్తున్నాడు.

సినిమాల్లో ముందుకు సాగుతూ...
పవర్, గబ్బర్‌సింగ్-2, పిట్టగోడ, ఇంటెలిజెన్స్ ఇడియట్, ప్రేమంత సులువుకాదు, హిందీలో ఇష్క్‌యే హైదరాబాద్ తదితర సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

మస్త్‌మస్త్‌గా.. జబర్దస్త్‌లో..
ఈ టీవీలో ఇటీవల ఎంతోమందిని ఆకట్టుకుంటున్న జబర్దస్త్ ప్రోగ్రాంలో రాకేట్ రాఘవ, చమ్మక్ చంద్ర, రచ్చరవి, శకలక శంకర్ టీంలల్లో ఆకర్షనీయమైన పాత్రలు వేస్తున్నాడు,ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో ముందుకు..
ఒక రాష్ట్రం సాధించడానికి 60ఏండ్ల పోరాటం పట్టింది. తెలంగాణ కళాకారులు ఆంధ్ర కళాకారులతో సమానంగా ఎదగడానికి మరికొంత సమయం పడుతుంది. సొంత రాష్ట్రం కాబట్టి ప్రతిభావంతులకు తొందరగానే గుర్తింపు వస్తది. గ్రామీణా ప్రాతాల్లో ఉన్న కళాకారులను గుర్తించి నాటకరంగం, కళా రంగాల్లో రాణించాడానికి త్వరలోనే కార్యాచరణ రూపొందించబోతున్నా. ముఖ్యమంత్రి చొరవతో మెదక్ జిల్లాతోపాటు తెలంగాణలో ఉన్న కళాకారుల కోసం కొత్త కార్యాచరణ చేపడుతున్నా. దీనికి అందరి ఆశీర్వాదాలు కావాలి.
244
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd