FRIDAY,    December 14, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Karimnagar News
5/8/2016 1:52:23 AM
నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం
(కరీంనగర్ కల్చరల్)
కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా. అమ్మ అనే పిలుపులోనే తీయదనం ఉన్నది. తన కడుపు మాడ్చుకొని మరీ మన కడుపు నింపుతుంది. రెక్కలు ముక్కలు చేసుకొని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే మన నడతను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకొని, కనికరిస్తుంది. కొడుకులు చెట్టంత ఎదిగి దూర తీరాలకేగినా, బిడ్డలు అత్తవారిళ్లకు వెళ్లినా ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసమే పరితపిస్తూనే ఉంటుంది. కన్నపేగుకు ఏ చిన్న కష్టమొచ్చినా నిలువెల్లా తల్లడిల్లిపోతుంది. ఇలా తమ కోసం సర్వస్వం ధారపోసి, పెంచి పెద్ద చేసిన తల్లులను వారి జీవిత చరమాంకంలో కళ్లల్లో పెట్టుకొని కాపాడడం ప్రతి ఒక్కరి విద్యుక్త ధర్మం. ఇదీ మాతృదినోత్సవ నేపథ్యం . .

ఏటా మే నెల రెండో ఆదివారం నిర్వహిస్తున్న ప్రపంచ మాతృదినోత్సవానికి సుదీర్ఘ చరిత్ర, నేపథ్యం ఉన్నాయి. గ్రీస్‌లో రియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్‌గా భావించి ఏడాదికోసారి నివాళులర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపారు. జూలియవర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. బోస్టన్‌లో ఇందు కోసం సమావేశాన్ని నిర్వహించింది. అన్న మేరీ జర్విస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్‌షిప్ డే జరిపించేందుకు చాలా కృషి చేసింది.

ఆమె 1905 మే 9న మృతి చెందగా, ఆమె కూతురు మిస్ జెర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ర్టాల్లో మాతృదినోత్సవం జరపడం మొదలైంది. ఫలితంగా 1914 నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించాడు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటి నుంచి ఏటా మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
1116
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd