‘ప్రతిభ వెంటే పేదరికం’ కథనానికి స్పందించిన ప్రభుత్వ విప్
విష్ణు మెమోరియల్ ట్రస్టు ద్వారా ఎంబీబీఎస్ చదువుకు భరోసా
గుండాల, నవంబర్ 27: వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్లో ప్రతిభ కనబర్చిన పడుగోనిగూడెం పంచాయతీ పాలగూడెం గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి ఈసం అన్వేశ్ను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శనివారం అభినందించారు. ఈ విద్యార్థి నీట్లో 503 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 1,752వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో 97వ ర్యాంకు సాధించాడు. కానీ వైద్య విద్యలో ప్రవేశం కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయాన్ని వివరిస్తూ ‘ప్రతిభ వెంటే పేదరికం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన ప్రభుత్వ విప్.. వెంటనే మండల టీఆర్ఎస్ నాయకుల ద్వారా సదరు విద్యార్థిని కరకగూడెంలోని తన సొంత నివాసానికి పిలిపించుకున్నారు. ఆ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. కాగా, మండలంలో లింగగూడెం పంచాయతీ చీమలగూడెం గ్రామానికి చెందిన కల్తి భవాని సైతం రాష్ట్ర స్థాయిలో 355వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో 35వ ర్యాంకు సాధించి అడ్మిషన్, ఇతర ఖర్చులకు ఇబ్బంది పడుతుండగా ఆమెను కూడా ఆదుకుంటానని ఇప్పటికే రేగా భరోసా ఇచ్చారు. తాజాగా అన్వేశ్ ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న ప్రభుత్వ విప్ రేగా.. ఫ్రీ సీటు వచ్చాక కౌన్సెలింగ్లో మిగతా ఖర్చులన్నింటినీ రేగా విష్ణు మెమోరియల్ ట్రస్టు ద్వారా తాను భరిస్తానని విద్యార్థికి భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ నాయకులు మోకాళ్ల వీరస్వామి, సయ్యద్ అజ్జు, కొటెం నారాయణ పాల్గొన్నారు.