జనంలో అనూహ్య స్పందన
పకడ్బందీగా సర్వే చేస్తున్న ఉద్యోగులు
గడపగడపకూ వెళ్తున్న బృందాలు
పరీక్షలతోపాటు టీకా ఇస్తున్న సిబ్బంది
లక్షణాలున్నవారికి కిట్ల అందజేత
కరీంనగర్, జనవరి 21 (నమస్తే తెలంగాణ)/విద్యాన గర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇంటింటా జ్వర సర్వే మంచి ఫలితాలను ఇస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన ఈ సర్వేపై కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసలు కురిపించింది. గతేడాది మే నెలలో చేపట్టిన ఈ సర్వే కారణంగా కరోనా వైరస్ బారిన పడిన వారిని ముందుగానే గుర్తించగలిగారు. దీంతో వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచి నిరంతరం పర్యవేక్షించారు. ఐసొలేషన్ కిట్‌లో ఐదు రోజులకు సరిపడా మందులు ఇచ్చారు. ఈ మందులు వాడినా కరోనా తగ్గక పోతే దవాఖానల్లో చేర్పించి వైద్యం చేయించారు. అలా గతేడాది మే నెలలో చేపట్టిన జ్వర సర్వే ఐదు విడుతలుగా కొనసాగుతున్నది. ఇందులో కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 4,93,908 ఇండ్లలో సుమారు 10 లక్షల మందిని పరీక్షించారు. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నపుడు నిర్వహించిన మొదటి సర్వేలో 6,402 మందికి ఐసొలేషన్ కిట్లను పంపిణీ చేశారు. రెండో విడుతలో గణనీయంగా కేసులు తగ్గాయి. ఈ విడుతలో 2,195 కిట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత జ్వరాలు తగ్గుతూ వచ్చాయి. మూడో రౌండ్లో 620, నాలుగో రౌండ్లో 592 మందికి మాత్రమే జ్వర సర్వేలో భాగంగా ఐసొలేషన్ కిట్లు పంపిణీ చేశారు. కొనసాగుతున్న ఐదో విడుతలో భాగంగా 1,030 మందికి ఇప్పటివరకు కిట్లను పంపిణీ చేశారు. గత నెల వరకు జ్వరాలు తగ్గినా అధికారులు జ్వర సర్వేను అక్కడక్కడా కొనసాగిస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం నుంచి మరోసారి సర్వేను విస్తృతం చేశారు.
ముందుగానే కరోనా కంట్రోల్..
కరోనా వైరస్ బారిన పడి ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే ఎంతగానో తోడ్పడింది. గతేడాది చేపట్టిన జ్వర సర్వేల్లో ఇలాంటి ఆసక్తికర విషయాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. హోం ఐసొలేషన్‌లోనే ఉండి చికిత్స పొందిన వందలాది మంది కరోనా నుంచి విముక్తి పొందారు. జ్వర సర్వే ద్వారా ముందుగానే కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించగలిగారు. ఇలాంటి వారిని క్వారంటైన్లో ఉండే విధంగా చూడగలిగారు. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగారు. ముఖ్యంగా రెండో విడతలో తీవ్ర స్థాయిలో విజృంభించిన కరోనా జ్వర సర్వే కారణంగానే అదుపులోకి వచ్చింది.
మరోసారి జ్వర సర్వే
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రారంభమైంది. ఇందుకు పంచాయతీ కార్యదర్శి లేదా కారోబార్ లేదా గ్రామ పంచాయతీకి చెందిన మరో ఉద్యోగి, ఆశ కార్యకర్త, ఏఎన్ఎం, వీవోతో బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు నిర్దేశిత ఫార్మాట్‌ను అందించడంతోపాటు, ఆరు రకాల మందులతో కిట్లను అందజేశారు. వీరు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి ఏ ఒక్క లక్షణం ఉన్నా టెస్టులతో సంబంధం లేకుండా వారికి ఔషధ కిట్లు అందజేస్తున్నారు. ఇందులో అజిత్రోమైసిన్, పారాసిటమాల్, లెవోసిట్రిజన్, రానిటిడైన్, విటమిన్ సీ, మల్టీ విటమిన్, విటమిన్ డీని అందజేస్తున్నారు. కిట్ వాడిన తర్వాత ఐదు రోజుల వరకు జ్వరం తగ్గకపోతే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. దీంతో పాటు ఏడు రోజుల ఐసొలేషన్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని తెలియజేస్తున్నారు. ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో 700లకు పైగా బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందం ప్రతి రోజూ 25నుంచి 30 ఇండ్లలో సర్వే నిర్వహిస్తున్నది. వీటిని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీలు ఉండగా, ఇందులో 2,56,464 నివాస గృహాలున్నాయి. వీటిలో సర్వే చేపట్టేందుకు 2,608 మంది సభ్యులతో 652 బృందాలను ఏర్పాటు చేశారు. ఆరు రోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా సర్వేతో పాటు, మందుల పంపిణీ పూర్తి చేయాలని నిర్దేశించారు. కలెక్టర్ గుగులోత్ రవి, పంచాయతీ శాఖ అధికారులు, డీఆర్డీఏ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ పర్యవేక్షించారు.
పెద్దపల్లి జిల్లాలో 410 బృందాలు ఏర్పాటు చేయగా, వైద్యారోగ్య సిబ్బందితో పాటు అంగన్వాడీ సిబ్బంది కలిసి దాదాపుగా 1000 మంది వరకు సర్వేలో పాల్గొంటున్నారు. జిల్లాలోని 267గ్రామాల్లో ఇంటింటా సర్వే చేస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని నమోదు చేస్తున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కే ప్రమోద్‌కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో తొలిరోజు నిర్వహించిన సర్వేలో 608 మంది జ్వరపీడితులను గుర్తించి, మెడికల్ కిట్లను అందించారు. జిల్లాలో మొత్తం లక్ష పైచిలుకు ఇండ్లను సర్వే చేయాలనే లక్ష్యంతో 489 బృందాలను కేటాయించింది. ఐదు రోజుల్లో సర్వే మొత్తం పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అధికారులు అన్ని మండలాల్లో ఒకేసారి సర్వేను ప్రారంభించారు. తొలిరోజు 22వేల 214 ఇళ్లను సర్వే చేసి, 608 మంది జ్వరపీడితులను గుర్తించారు.