కరీంనగర్‌ను కొవిడ్ రహిత జిల్లాగా మార్చాలి
26వ తేదీలోగా రెండో డోస్ వందశాతం పూర్తి చేసిన గ్రామాలకు ప్రోత్సాహకం
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
విద్యానగర్, జనవరి 21: జిల్లాలో ఈనెల 26వ తేదీలోగా వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేసి కొవిడ్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం కొవిడ్, ఒమిక్రాన్‌పై నిర్వహించిన జిల్లా సమన్వయ సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లా కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ 103 శాతం, రెండో డోస్ 97 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. 15-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ 75 శాతం, బూస్టర్ డోస్ 30 శాతం పూర్తయినట్లు తెలిపారు. ఇంటింటా సర్వే చేసి అర్హులందరికీ వ్యాక్సిన్ వేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కొవిడ్ థర్డ్ వేవ్‌ను ఎదురొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. జ్వర సర్వేలో కొవిడ్ లక్షణాలున్న వారికి హోం ఐసొలేషన్ కిట్ అందజేయాలని సూచించారు. ఈనెల 26వ తేదీలోగా రెండో డోస్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయి మొదటి స్థానంలో నిలిచిన గ్రామ పంచాయతీకి రూ. లక్ష, ద్వితీయ స్థానంలో నిలిచే గ్రామ పంచాయతీకి రూ.50 వేలు, తృతీయ స్థానంలో నిలిచే గ్రామ పంచాయతీకి రూ. 25 వేల చొప్పున ప్రోత్సాహకాన్ని గణతంత్ర వేడుకల్లో తన సొంత నిధులతో అందజేస్తానని మంత్రి ప్రకటించారు. ఉద్యమాల పురిటి గడ్డగా పేరొందిన కరీంనగర్‌ను కరోనా రహిత జిల్లాగా కూడా ప్రథమ స్థానంలో నిలుపాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, ఇంటింటా జ్వర సర్వే చేపట్టి, కొవిడ్ లక్షణాలున్న వారికి హోం ఐసొలేషన్ కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసి, లక్షణాలున్న వారికి మందులు అందజేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో సరిపడా మెడికల్ కిట్లు, కొవిడ్ వ్యాక్సిన్లు నిల్వ ఉన్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీలోగా కొవిడ్ రెండో డోస్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.