బోథ్, సెప్టెంబర్ 1: శాంతి భద్రతల పరిరక్షణకు పాటు పడుతూనే ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బోథ్ పోలీసులు. బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముదావత్ నైలు, ఎస్సై రాజు, సిబ్బంది ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర సూచనలతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. మామిడిగూడేనికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారడంతో స్పందించి ఇటీవల మరమ్మతులు చేయించారు. పార్డీ (కే)లో నిరుపేద గిరిజనులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసి ఆదుకున్నారు. పార్డీ (బీ), టివిటి, పరుపులపల్లెల్లోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అజ్జర్-వజ్జర్ పరిధిలో వైద్య శిబిరం ఏర్పాటు చేయించి గిరిజనులకు మెరుగైన వైద్యం అందించారు. మందులు ఇప్పించారు. వాలీబాల్, షటిల్, కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ యువతలో పోటీ తత్వాన్ని పెంపొందిస్తున్నారు. ధన్నూర్ (బీ) వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకోగా, అందులోని ప్రయాణికులను కాపాడారు. ఇటీవల నక్కలవాగు వంతెనపై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో నాలుగు గ్రామాల ప్రజలను సురక్షితంగా దాటించారు.
ప్రజలకు మరింత చేరువయ్యేందుకే..
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత చేరువయ్యేందుకే పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. రోడ్లు వేయడం, క్రీడాపోటీలు నిర్వహించడంవంటివి చేయిస్తున్నాం. ఒకప్పుడు పోలీసులంటే భయం ఉండేది. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఏ సమస్య వచ్చినా 100కు డయల్ చేస్తున్నారు. గ్రామాలకు వెళ్లిన పోలీసులను ఆదరిస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఇదే.
-ముదావత్ నైలు, సీఐ, బోథ్