e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home జిల్లాలు ఉద్యోగాలు, సబ్సిడీ రుణాల పేరిట ఘరానా మోసం

ఉద్యోగాలు, సబ్సిడీ రుణాల పేరిట ఘరానా మోసం

వీఎస్‌.వీపీ కంపెనీ పేరుతో దోపిడీ
మోసపోయిన వంద మంది నిరుద్యోగులు, 20 మంది రైతులు
నిందితుల అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

నల్లగొండ సిటీ, ఆగస్టు 4 : కాంట్రాక్టు ఉద్యోగాలు, సబ్సిడీపై రుణాలు ఇప్పిస్తామంటూ 120 మంది నిరుద్యోగులను ముంచిన కేటుగాళ్లను బుధవారం నల్లగొండ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వీరవెల్లి ప్రదీప్‌రెడ్డి 14 మందితో గ్రూపుగా ఏర్పడి ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లో వీఎస్‌.వీపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేశారు. ఈ క్రమంలో నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామానికి చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2019లో న్యూస్‌ పేపర్‌లో వచ్చిన ప్రకటన చూసి కాంట్రాక్ట్‌ ఉద్యోగం కోసం సంస్థ యాజమాన్యాన్ని సంప్రదించాడు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన సదరు సంస్థ వారు అతని నుంచి లక్షా 50 వేల రూపాయలు తీసుకున్నారు. అనంతరం అసిస్టెంట్‌ బ్రాంచ్‌ మేనేజర్‌గా ఎంపికైనట్లు వెంకట్‌రెడ్డికి అపాయింట్‌మెంట్‌ కాపీ పంపించారు. ఆ తరువాత శిక్షణ పేరుతో కొంతకాలం కాలయాపన చేశారు. అలాగే అనేక మంది నిరుద్యోగుల నుంచి డీడీల రూపంలో డబ్బు వసూలు చేసి జాబ్‌లో జాయిన్‌ చేసుకున్నారు. జీతం చెల్లించకపోవడంతో ఆ ఉద్యోగాలు మోసపూరితమైనవని తెలుసుకొని బాధితులు నిలదీయగా సంస్థ చైర్మన్‌ ప్రదీప్‌రెడ్డి అగ్రికల్చర్‌ ప్రాజెక్టు వచ్చిందని, అందులో పని చేస్తే జీతాలు ఇస్తామని చెప్పి పనులు చేయించుకున్నారు.

సభ్యులను చేర్పిస్తే జీతాలు చెల్లిస్తామని.. రైతులకు, యువకులకు ట్రాక్టర్లు, జేసీబీలు, మోటర్‌ సైకిళ్లను సబ్సిడీ కింద ఇస్తామని నమ్మించారు. వాహనాలకు 40 శాతం సబ్సిడీ పోగా 60 శాతం కంపెనీకి చెల్లించాలని చెప్పారు. దీంతో బాధితుడు వెంకట్‌రెడ్డి రెండు బైకులు, 13 ట్రాక్టర్లు సబ్సిడీపై ఇప్పించాడు. అతనితోపాటు కంపెనీలో పనిచేసే మరికొంత మంది నిరుద్యోగులకు వాహనాలు ఇప్పించారు. అయితే.. ముందుగానే 60 శాతం డబ్బును తీసుకున్న సదరు సంస్థ యాజమాన్యం ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ వారు వాహనాలను తీసుకెళ్లారు. దీంతో బాధితులు వెంకట్‌రెడ్డిని నిలదీయగా.. మోసపోయినట్లు గుర్తించిన ఆయన నాలుగు రోజుల క్రింతం నల్లగొండ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రంగారెడ్డి, ఖమ్మం, భూపాలపల్లి, కామారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్‌, జనగాం జిల్లాల్లో వందలాది మంది బాధితులు ఉన్నట్లు విచారణలో తెలుసుకున్నారు. అయితే.. నల్లగొండ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్‌ కాలనీలో ఉన్న సంస్థ కార్యాలయానికి బుధవారం డైరెక్టర్‌ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు నిఘా పెట్టారు. ప్రదీప్‌రెడ్డి, నవీన్‌రెడ్డితోపాటు సంస్థలో పని చేస్తున్న బిట్ల సాయి, జ్ఞానేశ్వర్‌, శ్రీనును మర్రిగూడ బైపాస్‌ వద్ద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి అపాయింట్‌మెంట్‌ కాపీలు, ఎంప్లాయ్‌మెంట్‌ బాండు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో 9 మంది పరారీలో ఉన్నారని, వారిని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. గత ఏడాది హైదరాబాద్‌లోని కూషాయిగూడ, కామారెడ్డి పోలీస్‌స్టేషన్లలో సంస్థ చైర్మన్‌ ప్రదీప్‌రెడ్డి, డైరెక్టర్‌ నవీన్‌రెడ్డిపై కేసు నమోదు కాగా, పోలీసులు రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. సమావేశంలో టూటౌన్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana