కులకచర్ల, మార్చి 18 : కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మహిళా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం తీసుకుని ఏదో ఒక వ్యాపారం, లేదా వివిధ జీవనోపాధులకోసం స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు తీసుకుంటారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. గ్రామాల్లో సెర్ప్ ద్వారా కొత్తగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసేందుకు స్పెషల్‌డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి సంఘాల్లో లేని మహిళలను సభ్యులుగా చేర్చుకుంటున్నది. దీని కోసం ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నారు. కులకచర్లలో 44 గ్రామ పంచాయతీలు ఉండగా, మండలంలో సుమారుగా 38 గ్రామ సంఘాలు ఉన్నాయి. 1106పైగా సంఘాలు ఉండగా, అందులో 11,060కిపైగా సభ్యులు ఉన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి సిబ్బంది మహిళలను సంఘాల్లో చేర్పిస్తున్నారు. కొత్తగా 78 సంఘాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో నమోదు కూడా చేశారు. ఇంకా మరో 100కు పైగా సంఘాలను తయారు చేసేందుకు బ్యాంకుల్లో ఖాతాలను ఓపెన్ చేసందుకు డాక్యుమెంట్లు అందజేశారు. కొత్త సంఘాలను ఏర్పాటు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.
ఇంటింటికీ సర్వే
కొత్త సంఘాలను ఏర్పాటు చేసేందుకు సెర్ప్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో వీవోఏలు, సీసీలు ఇంటింటికీ తిరిగి సర్వేను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అనుబంధ గ్రామాల్లో కూడా సర్వేను చేపట్టారు.
సభ్యులుగా చేరేందుకు మహిళల ఆసక్తి..
గ్రామాల్లో మహిళా సంఘాల్లో లేని మహిళలు కొత్తగా సంఘాలు చేస్తున్నరనే విషయాన్ని తెలుసుకొని కొత్త సంఘాల్లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. మహిళా సంఘాల్లో చేరితే తమకు కూడా రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని, తమ జీవనోపాధిని కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని మహిళలు సంఘాల్లో ఆసక్తిగా చేరుతున్నారు.
కొత్త సంఘాలకు శిక్షణ
గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త సంఘాలకు సీఆర్పీల ద్వారా శిక్షణను ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో సిబ్బంది తయారు చేసిన సంఘాలకు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నారు.