నిజామాబాద్, మే 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూడు గంటల వెండితెర వెలుగుల్లో గతమంతా చీకటే. సినిమా ప్రదర్శనలో నిరంతర ఆటంకాలు. గంటలో పదుల సార్లు బొమ్మకు బ్రేక్. రసవత్తర సన్నివేశ సమయంలో ఒక్కసారిగా మూతపడే సినిమా తెర. బొమ్మతో పాటే పైన పంకాలు(ఫ్యాన్లు, ఏసీలు) ఆగిపోవడం. ముచ్చెమటలు ఓ వైపు, సినిమా స్టార్ట్ అవుతుందా? కాదా అన్న సంశయం మరోవైపు… ఇలాంటి దిక్కుమాలిన దుస్థితిని సగటు సినీ ప్రేక్షకుడు 2014కు ముందు అనుభవించాడు.
నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ వంటి పట్టణాలతోపాటు మండల స్థాయిలోని టాకీసుల్లోనూ కరెంట్ కోతలతోపాటు సినిమా కోతలు నిత్యకృత్యంగా మారేది. అంతలో ఆవేశం ఆపుకోలేక చాలా మంది ప్రేక్షకులు థియేటర్లు ధ్వంసం చేసిన ఘటనలు అనేకం. విద్యుత్ సరఫరా నిలిచి జనరేటర్ ఆన్ చేసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయే గడ్డు కాలాన్ని ఎనిమిదేండ్ల క్రితం వరకు థియేటర్ యజమానులు ప్రత్యక్షంగా చూశారు. సీన్ కట్ చేస్తే రాష్ట్రంలో నిరంతర కరెంట్ సరఫరాతో పరిస్థితులు మారిపోయాయి. కోతల్లేని విద్యుత్‌తో సినిమా టాకీసుల్లో ప్రస్తుతం జనరేటర్ల అవసరమే ఉండడం లేదంటే అతిశయోక్తి కాదు.
సినిమా టాకీసుల నిర్వహణలో గతానికీ ఇప్పటికీ భారీ మార్పులు వచ్చాయి. రోజుకు నాలుగు ఆటలు ఆడేలోపు యాజమాన్యాలు ఎదుర్కొనే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణ రాక ముందు సమైక్య పాలనలో కరెంట్ సరఫరా అంతంత మాత్రమే. నిత్యం కరెంట్ తిప్పలతో పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు చతికిల పడ్డాయి. వీటితోపాటే వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు సైతం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడ్డాయి.
సినిమా రీల్ తిరగాలంటే ప్రత్యామ్నాయంగా జనరేటర్ వినియోగం తప్పనిసరిగా ఉండేది. జనరేటర్ నడవాలంటే డీజిల్ వాడకం, అందుకు అయ్యే ఖర్చు అధికంగా ఉండే ది. గంటల కొద్దీ కరెంట్ కోతలతో సినిమా థియేటర్ మొత్తం నిర్వహణ ఒక్కోరోజు జనరేటర్ సాయంతోనే నడిచే దుస్థితి గతంలో ఉండేది. తద్వారా సినిమాలు ఆడించే టాకీసు నిర్వాహకులకు వచ్చే ఆదాయంలో కోతలు తప్పకపోయేవి. డిస్ట్రిబ్యూటర్లు కేవలం టాకీసులతో ఒప్పందం చేసుకొని సినిమాను ప్రదర్శించేది. కరెంట్ కోతలతో వారికి సంబంధమే ఉండేది కాదు. తద్వారా ఒప్పందం మేరకు సినిమా ఆడించాల్సిన అనివార్యతతో కరెంట్ కోతలను ఎదుర్కొని సినిమా టాకీసు యాజమాన్యాలు తమ వ్యాపారాన్ని నిర్వహించేవి.
మారుతున్న డిజిటల్ యుగంలో సినిమాకు, ప్రేక్షకుడికి మధ్య దూరం పెరిగింది. చాలా మంది ఆసక్తిని చంపుకొని ఇంటికే పరిమితమై ఓటీటీ వంటి ప్లాట్ఫామ్లో వీక్షిస్తూ సినిమా కోరికలను తీర్చుకుంటున్నారు. మరికొంత మంది భారీ తెరపై కొత్త చిత్రాలను చూసేందుకు పరుగులు తీస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడే అన్న ముచ్చటే లేకుండా పోయింది. రాత్రి, పగలు తేడా లేకుండా కరెంట్ సరఫరా అవుతున్నది. సినిమా థియేటర్లకు అవసరమైన కరెంట్ నిరంతరం అందుతుండడంతో ఇప్పుడు రిస్క్ చాలా మేరకు తగ్గిపోయింది.
జనరేటర్లు నడిపించడం, నిర్వహణ కోసం జనరేటర్ ఆపరేటర్‌ను పెట్టుకోవడం అన్నది తలకు మించిన భారం కూడా ఇప్పుడు తప్పింది. అంతేకాకుండా గతంలో కరెంట్ కోతల ప్రభావం నేరుగా సినిమా థియేటర్ ఆస్తులపై స్పష్టంగా కనిపించేది. వెండితెరపై సినిమా చూస్తున్న సమయంలో బొమ్మ ఆగిపోతే కొంత మంది పోకిరీలు, యువకులు పనిగట్టుకుని కుర్చీలను, తెరను, థియేటర్ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనలు అనేకం నిజామాబాద్‌లో వెలుగు చూసినవే. సీఎం కేసీఆర్ సారథ్యంలో విద్యుత్ సరఫరా సాఫీగా జరుగుతుండడంతో థియేటర్లలో పరిస్థితులన్నీ చక్కబడ్డాయి.
రాష్ట్ర ప్రభుత్వం నిరంతర కరెంట్ సరఫరా చేస్తున్నది. ప్రస్తు తం కోతలు కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో థియేటర్ల లో సినిమాలు ఆడించాలంటే గంటగంటకు రిస్క్ ఉండేది. దీంతో వెనువెంటనే నిలిచిన సినిమా ప్రదర్శనను పునరుద్ధరించాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్లం.ఇప్పుడు రిస్క్ తగ్గింది.
– నాగేశ్వర్ రావు, థియేటర్ అసోసియేషన్ అధ్యక్షుడు, నిజామాబాద్.
ప్రస్తుతం సినిమా టాకీసుల్లో కరెంట్ పోయే పరిస్థితి లేదు. సినిమా టాకీసు నిర్వహణకు అవసరమైన నాణ్యమైన విద్యుత్ అందుతున్నది. జనరేటర్ లేకపోతే మునుపు థియేటర్ నడవడమే కష్టంగా ఉండేది. ఇప్పుడు జనరేటర్ అవసరం చాలా మేరకు తగ్గింది. ఏడాదిలో జనరేటర్ వినియోగించేది వేళ్ల మీద లెక్కించవచ్చు.
– సంతోష్, దేవీ థియేటర్ మేనేజర్
సినిమా ప్రదర్శనల కోసం గతంలో అనేక ఆటంకాలను ఎదుర్కొన్నాం. ఇప్పుడు రోజుకు నాలుగు ఆటలు ఎలాంటి కరెంట్ కోతల్లేకుండా నడవడం గొప్ప విషయం. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాం. ఇప్పుడు సాఫీగా సినిమాలు ప్రదర్శించబడుతున్నాయి. సిని మా నిలిచిపోతే గతంలో అల్లరి జరిగేది. ఇప్పుడా అవకాశమే లేదు.
– నవీన్, విజయ్ థియేటర్, మేనేజర్
సినిమా చూడాలంటే థియేటర్లలోనే మజా ఉంటుంది. గతంలో టాకీసుల్లో సినిమా చూడాలంటే గంటగంటకు కరెంట్ పోయేది. దీంతో చూస్తున్న సినిమాపై ఆసక్తి పోయేది. ఇప్పుడలా కాదు. కరెంట్ పోవడం అన్నదే కనిపించడం లేదు. ఇంటర్వెల్లో సినిమా ఆగడం తప్ప మధ్యలో ఎక్కడా ఆటంకాల్లేవు.
– విజయ్, సినీ ప్రేక్షకుడు