సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలన్నా… పేరు మార్పు చేసుకోవాలన్నా… లోడ్ చేంజ్ చేసుకోవాలన్నా… ఇలా సేవ ఏదైనా ఇంట్లోంచి కాలు కదపకుండానే ఆన్లైన్లో విద్యుత్ సేవలను పొందేలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ శ్రీకారం చుట్టింది. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకుంటోంది. ఇప్పటివరకు విద్యుత్ సంస్థలో ఎలాంటి సేవకైనా ఆయా సెక్షన్ల పరిధిలోని వినియోగదారుల సేవా కేంద్రానికి ప్రత్యక్షంగా వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉండేది. ఇందుకోసం సమయాన్ని కేటాయించాలి. ఒకవేళ అక్కడికి వెళ్లినా పనులు వెంటనే పూర్తయ్యే అవకాశం ఉండేది కాదు. మళ్లీ, మళ్లీ వినియోగదారుల సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. వీటిని గుర్తించిన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆన్లైన్లోనే రకరకాలను సేవలను అందించేందుకు ప్రత్యేకంగా అప్లికేషన్‌ను రూపొందించింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ సేవలను అందిస్తున్నారు. ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో ఆన్లైన్ విధానం అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎవరైనా సులభంగా సేవలను పొందేలా వెబ్సైట్లో అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచారు.
వెబ్సైట్లో ఆన్లైన్ సేవల కోసం కొత్తగా లింక్….
గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించిన విద్యుత్ సేవలను పొందేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌పంపిణీ సంస్థకు చెందిన www.tssouthernpower.comలో అందుబాటులో ఉంది. ఇందులో రకరకాల సమాచారంతో పాటు పే యువర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్లింగ్, ఆన్లైన్ న్యూకనెక్షన్ అండ్ కంప్లెయింట్ రిజిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక లింకులను ఏర్పాటు చేశారు. ఇందులో ఆన్లైన్ న్యూకనెక్షన్ లింక్‌పై క్లిక్ చేయగానే కస్టమర్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) పేరుతో ప్రత్యేకంగా పేజీ వస్తుంది. ఇందులో న్యూ సర్వీస్ కనెక్షన్, అపార్టుమెంట్ కనెక్షన్, లేఅవుట్, కంప్లెయింట్ రిజిస్ట్రేషన్, అడిషనల్ లోడ్ వంటి సేవలను ఆన్లైన్లో పొందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అవసరమైన సర్వీసును ఎంపిక చేసుకొని మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేయగానే మొబైల్ నంబరుకు 4 అంకెలతో ఓటీపీ ( వన్ టైం పాస్ వర్డ్) వస్తుంది. వాటిని ఎంటర్ చేయగానే పొందాల్సిన సేవలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు దరఖాస్తు ఫారం డిజిటల్ ఫార్మాట్లో వస్తుంది. అందులో అడిగిన సమాచారాన్ని నింపుతూ వెళితే సరిపోతుంది. మొత్తం సమాచారం నిం పడం పూర్తయిన తర్వాత ఫీజుల చెల్లింపునకు సంబంధించిన పేజీ వస్తుంది. ఫీజులను సైతం ఆన్లైన్లోనే రకరకాల మార్గాల్లో చెల్లిస్తే సరిపోతుంది.
మొబైల్ యాప్ ద్వారా సేవలు….
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో టీఎస్ఎస్పీడీసీఎల్ పేరుతో ఉంది. ఇప్పటికే వాడుకలో ఉన్న సంస్థకు చెందిన మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ సేవలను పొందవచ్చని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మునుముందు వినియోగదారులకు అవసరమైన మరిన్ని సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభం గా, వేగంగా పొందేలా ఆన్లైన్లో సేవలను అందించేందుకు ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రస్తుతం ఐదు రకాల సేవలు ఆన్లైన్లో…