e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జిల్లాలు వార్‌ వన్‌సైడేనా

వార్‌ వన్‌సైడేనా

వార్‌ వన్‌సైడేనా

మహబూబ్‌నగర్‌, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి పూర్తి స్థాయిలో కలిసి రానున్నదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రెండు స్థానాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ.. ఆది నుంచే ప్రత్యేక వ్యూ హంతో ఎన్నికల బరిలో నిలిచింది. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. వివాదాలు సృష్టించాలని ప్రయత్నించినా.. కేవలం చేసిన అభివృద్ధినే వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టింది. గత ఆరేండ్లలో చేసిన అభివృద్ధే తమకు శ్రీరామ రక్ష అంటూ ఆ పార్టీ నేతలు పట్టభద్రులకు వివరించారు. ఉద్యోగాలు ఇవ్వలేదంటూ బూటకపు ప్రచారం చేస్తూ ఓటర్లను సందిగ్ధం చేసేందుకు ప్రతిపక్షాలు, ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చివరి వరకు ప్రయత్నించింది. దీనిపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌ స్పష్టంగా 1,32,899 ఉద్యోగాలు కల్పించినట్లు ఆధారాలతో సహా చెప్పడంతో.. ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు మిగిలిన ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారంటూ కొత్త పల్లవి అందుకున్నారు.


12 లక్షల ఎకరాల ఆయకట్టు..
ఆరేండ్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగునీటి రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుతో 12 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. వలసలు గణనీయంగా తగ్గాయి. ముంబై బస్సెక్కే వలస కూలీలు నేడు తమ భూముల్లో బంగారు పంటలు పండిస్తున్నారు. వ్యవసాయం ఊపందుకోవడంతో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యమైంది. రైతుబంధు, రైతు బీమా, నిరంతర ఉచిత విద్యుత్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, పింఛన్లు, డబుల్‌ బెడ్రూం గృహాలు.. ఇలా చెప్పుకుంటూపోతే ఏదో ఓ పథకం ద్వారా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నది. ఎన్నో ఏండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న భూముల సమస్యకు ధరణి ద్వారా శాశ్వత పరిష్కారం లభించింది. లంచం లేకుండానే పనులు అయ్యేలా రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో మార్పులు వచ్చాయి. వ్యవసాయానికి ఉపాధి హామీని జోడించి రైతులు బాగుపడేందుకు ఇతోధికంగా సాయం చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యోగాలిచ్చిన సర్కారు.. మరిన్ని పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. అందుకే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ.. తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యమని విజ్ఞప్తి చేస్తోంది. విజ్ఞులైన పట్టభద్రులు అభివృద్ధికే పట్టం కట్టాలని కోరుతున్నది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వివాదాలను సృష్టించి ఓటర్లను ప్రతిపక్షాలు గందరగోళానికి గురిచేస్తున్నాయని టీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పాలమూరు ఎలా ఉండేది.. రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్లలో మార్పు ఎలా ఉందో గమనించాలని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఎవరు ఉద్యోగాలు కల్పిస్తున్నారో.. ఉన్న ఉద్యోగాలు తీసేందుకు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నదెవరో గమనించాలని కోరుతున్నారు.


మరోవైపు పీఆర్సీ పేరుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించి విపక్షాలు భంగపడిన తీరుపై అధికార పార్టీ నేతలు స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు అపారమైన నమ్మకం ఉండడం వల్లే రాష్ట్రంలోని ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతును ప్రకటించాయి. ఉద్యోగస్తుల ఓట్లు కొల్లగొట్టేందుకు చేసిన కుటిల యత్నం విఫలమవ్వడంతో దానిపైనా వివాదాలతో రచ్చరచ్చ చేయాలని ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలను ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తిప్పికొట్టాయి. రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్న టీఆర్‌ఎస్‌కే తమ మద్దతు అని అన్ని సంఘాలు ప్రకటించడంతో ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. సీఎం కేసీఆర్‌పై ఉన్న ప్రగాఢమైన నమ్మకంతో రాష్ట్రంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం అయిన పీఆర్టీయూ (టీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి చేసిన ప్రకటన ఉపాధ్యాయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈనెల 20న అసెంబ్లీలో పీఆర్సీ ప్రకటన, పదవీ విరమణ వయస్సు పెంచే అంశంపై ప్రకటన చేస్తారని తమకు ప్రగాఢమైన నమ్మకముందని ప్రకటించారు. ఈ తరుణంలో ఉద్యోగాల కల్పన లేదని యువతను, పీఆర్సీ లేదని ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ప్రతిపక్షాలకు పోలింగ్‌కు ముందే చుక్కలు కనిపించేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాలమూరు ఓటర్లు ఎంతో విచక్షణ కలిగి ఉన్న వారని ఇప్పటికే గత రెండు పట్టభద్రుల ఎన్నికల్లో తమకు ఎదురైన అనుభవం వారిని మరోమారు ఆ తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకునేలా చేసిందని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వార్‌ వన్‌సైడేనా

ట్రెండింగ్‌

Advertisement