e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిల్లాలు రమణీయం.. రథోత్సవం

రమణీయం.. రథోత్సవం

రమణీయం.. రథోత్సవం

పాపన్నపేట, మార్చి 13 : ‘అమ్మలగన్న మాయమ్మ.. ఏడుపాయల దుర్గమ్మ.. మమ్మల్ని సల్లంగా చూడమ్మా’… అంటూ దుర్గమ్మ నామ స్మరణతో ఏడుపాయల క్షేత్రం మార్మోగింది. ఏడుపాయల జాతరలో కీలక ఘట్టమైన రథోత్సవం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతరలో చివరి కార్యక్రమమైన రథోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. రథాన్ని లాగే కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. రాత్రి 9గంటలకు ప్రారంభమై 11వరకు ముగిసింది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్‌ ఆలయ మర్యాదలతో ఎండోమెంట్‌ కార్యాలయం నుంచి డప్పు చప్పుళ్లతో బయలుదేరారు. రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని రెవెన్యూ అధికారులను ఎదుర్కొని, అక్కడి నుంచి నేరుగా నాగ్సాన్‌పల్లి చేరుకున్నారు. ఆనవాయితీ ప్రకారం గ్రామ పెద్దకాపు సాయిరెడ్డిని బాజా భజంత్రీలు, డప్పుచప్పుళ్ల మధ్య ఎదుర్కొని, దుర్గమ్మ ఆలయం వరకు వెళ్లారు. అక్కడి నుంచి వనదుర్గా భవానీ మాత ఉత్సవ విగ్రహాన్ని ఎదుర్కొని రథం గోలి వరకు తీసుకువచ్చారు. రథం గోలి సమీపాన రథం ముందు పట్టుపరిచి, అన్నం వండి రాసిపోసే కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 కులాలకు చెందిన పనిబాటల వాళ్లు పాల్గొన్నారు. అనంతరం దుర్గామాతను వేడుకుని రథాన్ని లాగే కార్యక్రమాన్ని రంగోలి ప్రాంతం నుంచి ప్రారంభించారు. నేరుగా రాజగోపురం వరకు కొనసాగింది. వేలాది మంది భక్తులు తాళ్లతో రథాన్ని లాగారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించడానికి ఏడుపాయల్లో మూడు రోజలుగా ఉన్న భక్తులు చెట్లు, గుట్టలు, బండరాళ్ల పైకెక్కి తిలకించడానికి పోటీపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు చేపట్టారు. కార్యక్రమం జయప్రదం కావడానికి మెదక్‌ ఆర్డీవో సాయిరాం, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్‌ అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేశారు.
విద్యుత్‌ దీపాలతో అలంకరణ..
ఏడుపాయల్లో రథం గోలి సమీపాన రథాన్ని వివిధ రంగులతో పాటు రంగురంగుల కాగితాలు, విద్యుద్దీపాలతో మిరుమిట్లు గొలిపేలా అలంకరించారు. రథోత్సవం కార్యక్రమం రాత్రి 11గంటల ప్రాంతంలో ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
పోటెత్తిన భక్తజనం..
మూడు రోజుల పాటు జరిగిన ఏడుపాయల జాతరకు భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగింది. రెండోరోజు శుక్రవారం బండ్లు తిరిగే కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు హాజరు కాగా, ఆ భక్తులకు తోడు మూడో రోజైన శనివారం రథోత్సవాన్ని తిలకించడానికి మరింత మంది హాజరయ్యారు. రెండేండ్ల క్రితం పోతంశెట్టిపల్లి పైపు నిర్మించిన రోడ్డు గుండా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. గతంలో ఘనపూర్‌ ఆనకట్ట వైపు నుంచి అధిక సంఖ్యలో ఏడుపాయలకు భక్తులు చేరుకునేవారు. నూతనంగా రోడ్డు సౌకర్యం అందుబాటులోకి రావడంతో పోతంశెట్టిపల్లి వైపు రద్దీ కనిపించింది.
దుర్గమ్మని దర్శించుకున్న మాధవానంద స్వామి..
ఏడుపాయల దుర్గాభవానీ మాతను తొగుట పీఠాధిపతి మాధవానందస్వామి శనివారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే ఏడుపాయల చేరుకున్న స్వామికి ఏడుపాయల అర్చకులు, ఈవో సార శ్రీనివాస్‌ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రమణీయం.. రథోత్సవం

ట్రెండింగ్‌

Advertisement