e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జనగాం పడిలేచిన కెరటం

పడిలేచిన కెరటం

పడిలేచిన కెరటం

నాడు వైభవం.. ఆదరణ కరువై తగ్గిన ప్రాభవం
కాలగర్భంలోకి కాకతీయుల నిర్మాణం
వందల ఏళ్ల తర్వాత మొదలైన పూజలు
వేయిస్తంభాల గుడిని పోలిన కట్టడం
శివలింగాన్ని మీటితే సప్తస్వరాలు
పూర్వవైభవం కోసం గ్రామస్తుల ప్రయత్నం
దేవుడి మాన్యాలను కాపాడాలని విన్నపం
భీమదేవరపల్లి, మార్చి 13:కాకతీయుల ఏలుబడిలో శివాలయం లేని ఊరంటూ లేదు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముత్తారంలో ఓ పురాతన త్రికూటాలయం ఉన్నా వందల ఏళ్ల వరకు ఇక్కడో గుడి ఉన్నట్లు బాహ్య ప్రపంచానికి తెలియలేదు. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం, వేయిస్తంభాల గుడిని పోలి ఉండగా ఇందులోని రెండు ఆలయాల్లో శివలింగాలు (మహామృత్యుంజయ, సూర్యేశ్వర), మరోదానిలో విష్ణుమూర్తి విగ్రహం ఉండడం శైవ, వైష్ణవ మతాల సామరస్యానికి అద్దం పడుతున్నది. పొట్ట చుట్టూ సర్పం చుట్టబడిన అరుదైన విఘ్నేశ్వరుడి విగ్రహం, శివలింగాన్ని మీటితే వచ్చే సప్తస్వరాలు, ఆలయం మధ్యలో అందమైన రాతిపలక.. ద్వారాలకు చెక్కి ఉన్న రమ్యరమణుల విగ్రహాలు.. ఇలా అపురూప శిల్పకళతో ఉన్న ఆలయం, గుప్తనిధుల పేరిట కొనసాగిన దాడితో ఆనవాళ్లు కోల్పోయింది. ఇటీవల రాజయోగి సిద్ధేశ్వర్‌ మహరాజ్‌ సూచనతో వందల ఏళ్ల తర్వాత ఇక్కడ పూజలు మొదలుకాగా పూర్వవైభవం దిశగా కసరత్తు జరుగుతున్నాది.

కాకతీయులు కట్టించిన కళా వైభవాల్లో వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలోని పురాతన త్రికూటాలయం ఒకటి. కానీ, ఇక్కడ ఇంతటి అద్భుతమైన ఆలయం ఉందని బాహ్య ప్రపంచానికి తెలియదు. సుమారు 200 సంవత్సరాల క్రితం ములుకనూరు గ్రామం నుంచి కొంతమంది ఇక్కడికి వలస రావడంతో ముత్తారం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా ఇంటి నిర్మాణాలు కావడం, అడవిని నరికి భూమిని సేద్యం చేస్తుండగా అపురూప శిల్పసంపదతో కూడిన త్రికూటాలయం వెలుగుచూసింది.

శైవ, వైష్ణవ మతాల ఐక్యత
ఈ ఆలయాన్ని పరిశీలిస్తే శైవ, వైష్ణవ మతాల సామరస్యం ప్రతిబింబిస్తుంది. ఒక ఉపాలయంలో గ్రానైట్‌తో చెక్కిన శివలింగం ఉంటే, మరో ఉపాలయంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. చతుర్భుజుడి ఆకారంలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం పాదాల వద్ద లక్ష్మీదేవి, గరుత్మంతుడు కొ లువై ఉన్నారు. ఆలయంపైన అష్టకోణం కనిపిస్తుంది. ఉత్తర ద్వారం పైన గజలక్ష్మి, కింది భాగాన ద్వారపాలకులను సేవిస్తున్న పరిచారికలు, గుడిలోకి వెళ్లాలంటే కాళ్లు కడుక్కోవాలని చెప్పేందుకు కడవలతో సేవికలు కనిపిస్తున్నారు. ఒక సింహంపై మరో సింహం ఉన్నట్లు ద్వారంలో చెక్కి ఉంది. పైన రెండు వరుసలతో చెక్కిన అద్భుతమైన తామరపుష్పం చూపరులను కట్టిపడేస్తుంది.

మీటితే సప్తస్వరాలు
ఆలయంలో శిలలతో చేసిన శివలింగాలను మీటితే సప్తస్వరాలు వినిపిస్తాయి. శివలింగాలకు పానవట్టం ఉంది. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత శివలింగాలకు అభిషేకం చేసిన నీళ్లు పానవట్టం నుంచి ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. పవిత్ర జలం కావడంతో భూగర్భంలోకి పంపే ఏర్పాట్లు చేసి ఉంటారని చరిత్రకారులు చెబుతారు.

గుప్తనిధులకోసం తవ్వకాలు
గుప్తనిధుల కోసం పెద్ద ఎత్తు న తవ్వకాలు జరిగాయి. ఆలయం మధ్యభాగాన ఉన్న రాతిఫలకాన్ని ధ్వంసం చేశా రు. గతంలో విష్ణుమూర్తి విగ్రహం చేతులను నరికివేసినట్లు తెలుస్తున్నది. గర్భగుడుల్లోని లింగాలను మీటితే సప్తస్వరాలు వస్తుండడంతో వాటిని గుర్తుతెలియని వ్యక్తులు పెకిలించారు. ఎనిమిదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొంతమంది తో కలిసి విష్ణుమూర్తి విగ్రహా న్ని పెకిలించి అపహరించే ప్రయత్నం చేసి గ్రామస్తుల కు దొరికిపోయాడు. వారి కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినా నే టికీ గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. కొందరు భక్తు లు పూజలు చేసేవారు.

13వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం
13వ శతాబ్దంలో ఆలయం నిర్మించినట్లు తెలుస్తున్నది. త్రికూటాలయంలోని రెండు గుడుల్లో శివలింగాలు (మహామృత్యుంజయ, సూర్యేశ్వర), మరోదానిలో విష్ణుమూర్తి విగ్రహం ఉన్నాయి. ఆలయ పైభాగాన నిర్మాణాన్ని వదిలివేశారు. సుమారు 1.70 మీటర్ల ఎత్తున నక్షత్రాకార వేదికపై దీనిని నిర్మించారు. ఇంతటి విశిష్టమైన ఆలయం హన్మకొండలోని వేయిస్తంభాల గుడిని పోలి ఉన్నది. ఆలయం సమీపంలో తవ్వకాలు జరుపగా విఘ్నేశ్వరుడి విగ్రహం బయటపడింది. అక్కడి చెట్టు కింద విఘ్నేశ్వరుడి విగ్రహం నేటికీ అలానే ఉన్నది. వినాయకుడి పొట్ట చుట్టూ సర్పం చుట్టబడి ఉండగా ఇలాంటి విగ్రహం చాలా అరుదుగా కనిపిస్తుందని చరిత్రకారులు చెబుతారు.

చరిత్రలోకి వెళ్తే..
కాకతీయులు తూర్పు, పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. కాకతీయులకు మూలపురుషుడు కాకర్త్యగుండ్యణ. వీరి ఇష్టదైవం పరమేశ్వరుడు. మొదట్లో కాకతీయుల సామ్రాజ్యానికి హన్మకొండ రాజధానిగా ఉంది. రుద్రదేవుడు (1158-1195) వరంగల్‌ కోటను నిర్మించ తలపెట్టగా గణపతి దేవుడు చక్రవర్తిగా ఉన్న సమయంలో కోట పూర్తయింది. ఆ తర్వాత గణపతి దేవుడు 1254లో రాజధానిని హన్మకొండ నుంచి వరంగల్‌కు తరలించాడు. గణపతిదేవుడు, రుద్రమదేవికి రాజగురువు విశ్వేశ్వర శివాచార్యుడు. 1261లో మందడ గ్రామాన్ని రుద్రమదేవి అతడికి అప్పగించింది. కాకతీయ సామ్రాజ్యంలోని అన్ని గ్రామాల్లో విశ్వేశ్వర శివాచార్యుడు శివాలయాలను ప్రతిష్ఠించాడు. కాకతీయుల కాలంలో ఆలయం లేని గ్రామం లేదని చరిత్రకారులు చెబుతారు.

ఆలయంలో రమ్యరమణులు
ఆలయ ద్వారాలకు రమ్యరమణుల విగ్రహాలు చెక్కి ఉన్నాయి. ఇందులోని రెండు ఆలయాల్లో శివలింగాలకు పానవట్టం ఉంది. మరో ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం ఉంది. త్రికూటాలయం మధ్యలో అందమైన రాతిపలక ఉండేదని, గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపి ఆనవాళ్లు లేకుండా చేశారని గ్రామస్తులు చెబుతారు. ఆలయం వెనుకభాగంలో చెరువు ఉంది. ఇందులో స్నానాలు ఆచరించిన తర్వాత ప్రత్యేక పూజలు చేసేవారు.

వందల ఏళ్ల తర్వాత పూజలు..
కొన్ని వందల ఏళ్ల తర్వాత ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు ఇటీవల మొదలయ్యాయి. శ్రీశ్రీశ్రీ రాజయోగి సిద్ధేశ్వర్‌ మహరాజ్‌ కొద్ది రోజుల క్రితం ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయ గొప్పదనాన్ని గ్రామస్తులకు వివరించి పూజలకు శ్రీకారం చుట్టించారు. అప్పటిదాకా దేవాలయానికి ఇంతటి విశిష్టత ఉందని గ్రామస్తులకు సైతం తెలియదు. ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఇక్కడో త్రికూటాలయం ఉందనే విషయాన్నే ప్రజలు మరిచిపోయారు. ఇప్పుడు గ్రామస్తులు చేయీచేయీ కలిపి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పడిలేచిన కెరటం

ట్రెండింగ్‌

Advertisement