e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home జిల్లాలు విస్తరణకు రైట్‌ రైట్‌..

విస్తరణకు రైట్‌ రైట్‌..

  • భువనగిరి మెయిన్‌ రోడ్డు
  • విస్తరణకు టెండర్లు ఖరారు
  • త్వరలోనే పనులు ప్రారంభం
  • రోడ్డుకిరువైపులా చెట్ల తొలగింపు.. కూల్చివేత ఇండ్లకు మార్కింగ్‌
  • విస్తరణ పూర్తయితే యాదాద్రికి వెళ్లే భక్తులకు సువిశాల రహదారి

యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రమైన భువనగిరిలో ప్రధాన రోడ్డు విస్తరణకు లైన్‌క్లియర్‌ అయ్యింది. రహదారి బంగ్లా నుంచి సాయిబాబాగుడి వరకు చేపట్టనున్న పనులకు మంగళవారం టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రూ.15.18కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు సంబంధించిన టెండర్లను మంగళవారం ఓపెన్‌ చేయగా.. ముగ్గురు కాంట్రాక్టర్లు మూడు ప్యాకేజీల్లో దక్కించుకున్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో విస్తరణకు నోచుకుంటున్న ఈ రహదారి పనులు
పూర్తయితే యాదాద్రికి వెళ్లే భక్తుల ప్రయాణం హాయిగా సాగనున్నది.
భువనగిరి అర్బన్‌ : జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ అంశం ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉంటూ వస్తున్నది. హెచ్‌ఎండీఏ నిధులు రూ.15.18కోట్లతో ప్రతిపాదన ఉన్నప్పటికీ చాలాకాలం కాలయాపన జరుగుతూ వస్తున్నది. కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రోడ్డు డివైడర్‌ మధ్యలో ప్లాంటేషన్‌ చేపట్టడం, లైటింగ్‌ వంటి ఏర్పాట్లు జరిగాయి. అయితే రోడ్డు విస్తరణలో జాప్యం నెలకొంటూ వస్తున్నది. యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తులు ప్రధానంగా ఈ రహదారి మీదుగానే వెళ్లాల్సి వస్తుండడం.. వాహనాల రద్దీ నేపథ్యంలో ఇరుకు రోడ్డుతో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణపై రెండేళ్లుగా కసరత్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్‌ 2న ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ భువనగిరి వచ్చిన సందర్భంగా రోడ్డు విస్తరణపై స్పష్టత ఇచ్చారు. త్వరతగతిన పనులు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ఈ క్రమంలో విస్తరణ పనుల్లో కదలిక వచ్చింది. రూ.15.18కోట్లకుగాను అడ్వాన్స్‌గా హెచ్‌ఎండీఏ రూ.5కోట్లను జిల్లా కలెక్టర్‌ ఖాతాలో జమ చేసింది. అనంతరం సంబంధిత అధికారులు రోడ్డు విస్తరణకు సంబంధించి సర్వేను ముమ్మరం చేశారు. మొదటగా రోడ్డుపై ఉన్న రూ.4,84,384 లక్షల విలువైన 113 చెట్ల తొలగింపునకు మున్సిపాలిటీ కౌన్సిల్‌ ఆమోదం తెలిపి నవంబర్‌ 20న చెట్ల కొట్టివేతకు బహిరంగ టెండర్‌ను పిలిచింది. ఈమేరకు రూ.5.32 లక్షలకు టెండర్‌ను దక్కించుకున్న గుత్తేదారు పెద్ద చెరువు కట్ట సమీపం నుంచి శ్రీలక్ష్మీనర్సింహస్వామి డిగ్రీ కళాశాల వరకు 4 కిలోమీటర్ల వరకు ఉన్న 113 చెట్లను తొలగించారు. 4.8కిలోమీటర్ల మేర చేపట్టనున్న విస్తరణలో కూల్చివేతకు గురయ్యే 470 నిర్మాణాలను సైతం గుర్తించారు.

పూర్తయిన టెండర్ల ప్రక్రియ..

- Advertisement -

మూడు ప్యాకేజీల్లో చేపట్టాల్సిన రోడ్డు విస్తరణకు సంబంధించిన పనులకు పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ టెండర్లను పిలిచారు. మొదటిసారి పిలిచిన టెండర్లకు గుత్తేదార్ల నుంచి స్పందన కరువవ్వడంతో రెండోసారి పిలిచారు. మంగళవారం టెండర్లను ఓపెన్‌ చేయగా, ముగ్గురు గుత్తేదార్లు పనులను దక్కించుకున్నారు. భువనగిరి హౌసింగ్‌బోర్డు నుంచి జగదేవ్‌పూర్‌ చౌరస్తా వరకు ఒక ప్యాకేజీ, జగదేవ్‌పూర్‌ చౌరస్తా నుంచి వినాయక చౌరస్తా వరకు రెండో ప్యాకేజీ, సాయిబాబాగుడి వరకు మూడో ప్యాకేజీ పనులు చేపట్టనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో డివైడర్‌కు ఇరువైపులా 50 ఫీట్ల చొప్పున చేపట్టాల్సిన రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మున్సిపల్‌ శాఖ నిర్మాణాల కూల్చివేత పనులను మొదలుపెట్టి ఆ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే విస్తరణ పనులు ప్రారంభించనున్నారు.

యాదాద్రికి వచ్చే భక్తులకు తీరనున్న ఇక్కట్లు

ప్రస్తుతం ఉన్న రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా రోడ్డు లేకపోవడం, చిరు వ్యాపారులు రోడ్లపైనే వ్యాపారులు చేస్తుండడంతో పట్టణ ప్రజలకు సైతం రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీనికితోడు వివిధ ప్రాంతాల నుంచి యాదాద్రికి వచ్చే భక్తులు ఇదే దారిన ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాదాద్రికి రద్దీ పెరగడంతో వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఆలయాన్ని పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతుండడంతో ఊహించని స్థాయిలో యాదాద్రికి భక్తజనం పోటెత్తనుంది. ఈ పరిస్థితుల్లోనే భువనగిరి జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణకు ఏర్పాట్లు జరుగుతుండడంతో వాహనదారులు ఇన్నాళ్లుగా పడ్డ ఇబ్బందులు సైతం శాశ్వతంగా తీరనున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana