తెలంగాణ పడుచు బోనమెత్తితే దుర్గమ్మ పరవశిస్తుంది!
తెలంగాణ పడుచు బతుకమ్మ ఆడితే ప్రకృతి పులకరిస్తుంది!
హిందూ ముస్లింల అలయ్బలయ్లు తెలంగాణతో మమేకం!
గంగాజమునా తెహజీబ్ తెలంగాణకే ప్రత్యేకం!
మనకంటూ ప్రత్యేక విశిష్టత..
మనదంటూ ప్రత్యేక సంస్కృతి..
..ఇలా మన పండుగల విశిష్టతను చాటుతూ ఏడు, ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాల్లో ముద్రించిన పాఠాలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను విపులంగా వివరించేలా.. విద్యార్థి దశ నుంచే మన పండుగల నేపథ్యాన్ని తెలుసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠ్యాంశాలను పొందుపర్చింది.
ములుగుటౌన్, సెప్టెంబర్28 : ప్రపంచంలో అరుదైన పూల పండుగగా తెలంగాణ బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తిం పు ఉన్నది. పూర్తిగా ప్రకృతిని ఆరాదిస్తూ తీరొక్క పూలతో సంప్రదాయ బద్ధంగా తొమ్మిది రోజుల పాటు చిన్నాపెద్దా తేడా లేకుండా అంబరాన్నంటేలా జరుపుకొనే వేడుక ఇది. ఇలా తొమ్మిది రోజుల పాటు ఏయే పేర్లతో పండుగ నిర్వహిస్తారో పాఠ్యాంశాలల్లో వివరించారు. సద్దుల బతుకమ్మ గురించి ప్రత్యేకంగా తెలిపారు. కూడళ్ల వద్ద బతుకమ్మ ఆడిన తర్వాత ఊరేగింపుగా వెళ్లి చెరువులు, వాగులు, కాల్వల్లో నిమజ్జనం చేయడం, అక్కడ తమ వెంట తెచ్చుకున్న సత్తులను ఒకరికొకరు వాయనంగా ఇచ్చిపుచ్చుకొని ఎలా అనుబంధాన్ని పంచుకుంటారో చక్కగా వర్ణించారు.
ఏడో తరగతి ఉపవాచకంలో ‘మన పండుగలు’ పాఠం ముద్రించారు. ఇందులో పండుగ విశిష్టతను వివరించారు. పూర్వం చోళ రాజు ధర్మాంగదడు దక్షిణ భారత దేశాన్ని పాలించేవాడని, ఆయనకు వందమంది కుమారులు కాగా, వీరంతా యుద్ధంలో చనిపోయారని, తర్వాత ఎన్నో పూజలు చేయడం వల్ల ఆయన భార్య దైవ స్వరూపమైన లక్ష్మీదేవికి జన్మనిచ్చిందని, ఆ పాప ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడిందని, అందుకే ఆమె పేరు బతుకమ్మ అని పెట్టారని పాఠ్యాంశంలో పేర్కొన్నారు. ఆడబిడ్డల జీవితాలు, వారు పడే కష్టాలు, ఎదుర్కొనే సమస్యలను ఎనిమిదో తరగతి తెలుగు జానపద గేయాలు పాఠంలో వివరించారు. తెలంగాణ ఉద్యమాన్ని బతుకమ్మ పాటలు ఎలా ప్రభావితం చేశాయో రాశారు.
పాఠ్య పుస్తకాల్లో ఉన్న పండుగల పాఠం ద్వారా నీటి విశిష్టతను, ప్రకృతి ఆరాదనను పిల్లలకు వివరిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను విద్యార్థి దశ నుంచే కాపాడుకునే అవకాశం కలుగుతుంది. వారిలో పండుగలపై గౌరవం పెరుగుతుంది. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
– కమలాదేవి, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు