ఖిలావరంగల్, సెప్టెంబర్ 28: కలెక్టరేట్లో బుధవారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో కలెక్టరేట్ ప్రాంగణానికి తరలివచ్చారు. ఒక్కో శాఖ తమ శాఖ ఉనికిని చాటుకునేలా బతుకమ్మలను తయారు చేసి రాత్రి పొద్దుపోయే వరకు ఆటపాటలతో సందడి చేశారు. కలెక్టర్ గోపి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూలను పూజించే గొప్ప సంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకే దక్కిందన్నారు. జిల్లా ప్రజలు సంతోషంగా బతుకమ్మ, దసరా వేడుకలను జరుపుకోవాలని కోరారు. కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసిన అన్ని శాఖల ఉద్యోగులు, అసోసియేషన్ల బాధ్యులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మలకు గోపి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీ హరిసింగ్, శ్రీవత్స కోట, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.