పట్టణ ప్రజలకు అన్ని రకాల సేవలను ఒకేచోట అందించేందుకు రాష్ట్ర సర్కార్ సీఎల్సీ(సిటీ లైవ్లీహుడ్ సెంటర్) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వికారాబాద్ జిల్లా కేంద్రం పాత మున్సిపల్ కార్యాలయ భవనంలో ఈ నెలాఖరులోగా సెంటర్‌ను ఏర్పాటు చేసేలా జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ సెంటర్ వద్దే స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్‌గా పెట్టి విక్రయించనున్నారు. వివిధ రకాల వస్తువుల మరమ్మతులు, గార్డెనింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, వృద్ధ్దులు, వివిధ వ్యాధులతో బాధపడే వారికి సేవలు అందించేవారు, సెక్యూరిటీ తదితర పనులు చేసే వారి సేవలు పొందడానికి సీఎల్సీని సంప్రదించవచ్చు. భవన నిర్మాణానికి సంబంధించి మేస్త్రీ, కూలీలు, పెయింటర్, ప్లంబర్, వెల్డర్, దుస్తుల డ్రై క్లీనింగ్, ఐరన్, దుస్తులు ఉతకడం, డ్రైవర్లు, ట్యాక్సీలు, మెకానిక్‌లు, కొరియర్, ట్రావెల్ గైడ్, డాక్యుమెంట్ రైటింగ్ తదితర అన్ని రకాల సేవలు సీఎల్‌సీల ద్వారా అందనున్నాయి.
పరిగి, సెప్టెంబర్ 15 : పట్టణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సీఎల్సీ(సిటీ లైవ్లీహుడ్ సెంటర్) ఏర్పాటు చేయాలని సంకల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 కొత్త సీఎల్‌సీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా సీఎల్సీ ఏర్పాటు చేయనున్నారు. సీఎల్సీ ఏర్పాటుకు భవనం ఎంపిక సైతం చేపట్టడంతో సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లోని పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈ సీఎల్సీ ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. అన్ని రకాల సేవలు ఒకే దగ్గర లభించే విధంగా ఏర్పాట్లు చేయడం, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఇక్కడే ఎగ్జిబిషన్‌గా పెట్టి విక్రయించడం వంటివి కూడా ఇందులో భాగంగా చేపట్టనున్నారు. వికారాబాద్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం భవనంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
అందుబాటులోకి రానున్న సేవలు..
సిటీ లైవ్లీహుడ్ సెంటర్ ద్వారా వికారాబాద్ పట్టణ ప్రజలకు వివిధ రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా ఇంటి, సంస్థల్లో పనిచేసే విధంగా స్వీపర్లు, వివిధ రకాల వస్తువుల మరమ్మతు చేపట్టడం, గార్డెనింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, వృద్ధులు, వివిధ వ్యాధులతో బాధపడే వారికి సేవలు అందించేవారు, సెక్యూరిటీ తదితర పనులు చేసే వారి సేవలు పొందడానికి సీఎల్సీని సంప్రదించవచ్చు. అలాగే భవన నిర్మాణానికి సంబంధించి మేస్త్రీ, కూలీలు, పెయింటర్, ప్లంబర్, వెల్డర్, దుస్తుల డ్రై క్లీనింగ్, ఐరన్, దుస్తులు ఉతకడం, రవాణాకు సంబంధించి డ్రైవర్లు, ట్యాక్సీలు, మెకానిక్‌లు, సేల్స్ అండ్ పర్చేజ్‌లో క్యాటరింగ్, టిఫిన్, స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులు విక్రయాలు, సాంస్కృతిక విభాగానికి సంబంధించి పాటలు, నృత్యాలు, అవసరమైన వారికి పని కల్పించడం, కొరియర్, ట్రావెల్ గైడ్, డాక్యుమెంట్ రైటింగ్, స్పోర్ట్స్ గైడెన్స్, కోచింగ్ తదితర సేవలు సీఎల్‌సీల ద్వారా అందనున్నాయి.
అందరి సమాచారం సీఎల్సీలో..
సీఎల్సీ కేంద్రం ఏర్పాటు తర్వాత ఆయా వార్డుల వారీగా సంబంధిత పనులు చేసే వారందరికీ మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి వివరాలు, ఫోన్ నంబర్లు రిజిస్టర్ చేసుకుంటారు. సంబంధిత సేవల కోసం ఎవరు ఫోన్ చేసినా ఆయా వార్డుల్లో ఉన్నటువంటి వారు వెళ్లి సేవలు అందజేసేలా సీఎల్సీ పనిచేస్తుంది. ఇందుకుగాను మొదట సర్వీస్ చార్జీగా రూ.50 వసూలు చేస్తారు. ఇవే కాకుండా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించేందుకు సైతం ఒక వేదికగా సీఎల్సీ పనిచేయనుంది. అమేజాన్, ప్లిప్‌కార్డ్ తరహా ఇతర ఈ కామర్స్ ప్లాట్‌ఫారాల్లో ఈ ఉత్పత్తుల విక్రయం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు మరింత ఆర్థికంగా ఎదుగడానికి సీఎల్సీ దోహదం చేస్తుంది. రాబోయే రోజుల్లో వివిధ బ్యాంకులతో మాట్లాడి కస్టమర్ సర్వీస్ సెంటర్లు సైతం ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఆయా బ్యాంకుల ఖాతాదారులు ఇక్కడే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. వీటితోపాటు ఆధార్‌కార్డు సెంటర్ ఏర్పాటు కూడా చేపడుతారు.
సేవలపై విస్తృత ప్రచారం
సిటీ లైవ్లీహుడ్ సెంటర్లో లభించే సేవలపై మున్సిపాలిటీ వారు మొదట విస్తృతమైన ప్రచారం చేపడుతారు. సీఎల్సీలలో ఏ సేవలు లభిస్తాయి తదితర అంశాలతో కూడిన పాంప్లెంట్స్ ప్రింట్ చేయించి పట్టణంలోని అన్ని వార్డుల్లో పంచడం ద్వారా ప్రచారం చేపట్టాలి. సీఎల్సీ ఆధ్వర్యంలో ఒక ఫోన్ నెంబర్‌ను సైతం ప్రత్యేకంగా ఏర్పాటుచేసి, పౌరులు తమకు అవసరమైన సేవల కోసం ఆ ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించనున్నారు. తద్వారా పట్టణంలోని పౌరులు తమకు కావాల్సిన సేవల కోసం ఫోన్లో సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. సీఎల్సీ సెంటర్‌ను సుమారు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం నిర్వహణకు సంబంధించి ఏరియా లెవల్ ఫెడరేషనను మున్సిపల్ కమిషనర్ ఎంపిక చేస్తారు. ఇందులో మేనేజర్, రిసోర్స్ కో-ఆర్డినేటర్, మల్టీపర్పస్ అసిస్టెంట్లు ఉంటారు. సీఎల్సీ కేంద్రానికి రూ.10లక్షలు గ్రాంట్‌గా అందజేస్తారు. ఇందులో సుమారు రూ.3లక్షలతో ర్యాక్స్, ఫర్నీచర్, కంప్యూటర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు డిస్ప్లే చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతారు. వికారాబాద్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో సీఎల్సీ ఏర్పాటు చేయనున్నారు.
పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు
వికారాబాద్‌లో ఏర్పాటు చేయనున్న సిటీ లైవ్లీ హుడ్ సెంటర్ ద్వారా పట్టణ పౌరులకు మెరుగైన సేవలు అందుతాయి. పట్టణంలోని ఆయా వార్డుల వారీగా ఏ సేవలు అవసరమైనా సీఎల్సీని సంప్రదిస్తే తక్కువ సమయంలోనే సేవలు అందుబాటులోకి వచ్చేలా చూస్తారు. దీంతోపాటు స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ సైతం చేపడుతాం. ఈ ఉత్పత్తులను ఈ కామర్స్ ద్వారా విక్రయించేందుకు కూడా సీఎల్సీ వేదికగా ఉండనుంది.