e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home జిల్లాలు ప్రగతి తెచ్చిన మార్పు ముందే పన్ను చెల్లింపులు

ప్రగతి తెచ్చిన మార్పు ముందే పన్ను చెల్లింపులు

  • నాలుగేండ్ల క్రితం వరకు 40 శాతం కూడా వసూలు కాని వైనం
  • గతేడాది రికార్డు స్థాయిలో 98 శాతం చెల్లింపు
  • ఈ ఏడాది ఇప్పటికే 23 శాతం వసూలు

నాలుగేండ్ల క్రితం వరకు సూర్యాపేట జిల్లాలో 40 శాతం కూడా పన్నులు వసూలు కాకపోయేది. ప్రస్తుతం ప్రభుత్వం నెల నెలా కోట్లాది రూపాయలు వెచ్చించి అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పిస్తుండడంతో పన్ను వసూళ్లు పెరుగుతున్నాయి. గతేడాది రికార్డు స్థాయిలో 98 శాతం వసూలయ్యాయి. ప్రతి ఆర్థిక సంవత్సరపు చివరి మూడు నెలలు, ప్రధానంగా మార్చిలోనే దాదాపు 85 శాతం పన్నులు వసూలవుతుండగా ఈ ఏడాది ఇప్పటికే 23 శాతం కావడం గమనార్హం.

అన్ని వర్గాలు సంతోషపడేలా..

- Advertisement -

గతంలో పన్నులు వసూలు చేయడం ఓ ప్రహసనం కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లె ప్రగతి పేరిట నెలనెలా కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాల్లో వెలుగులు నింపుతుండడంతో ప్రజలు పన్నులు సకాలంలో చెల్లిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎంతో మంది పాలకులు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రగల్భాలు పలికారు తప్ప, పల్లెలపై కనీస దృష్టి సారించలేదు. నయా పైసా వెచ్చించలేదు. దీంతో నాడు పల్లెల్లో తాగునీటి కోసం తండ్లాటలు, కరెంటు కోసం కోట్లాటలు జరిగేవి. స్వరాష్ట్రంలో తమకు ఇది కావాలి అనే డిమాండ్‌ లేకుండా, రాకుండా అన్ని వర్గాలు సంతోషపడేలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపడుతుండడంతో పన్నులు సకాలంలో చెల్లిస్తున్నారు.
2019 నుంచి పల్లె ప్రగతి పేరిట నెలనెలా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కోట్లాది రూపాయలు ఇస్తుండడంతో నేడు ప్రతి గ్రామం పచ్చగా, పరిశుభ్రంగా మారింది. మిషన్‌ భగీరథతో స్వచ్ఛమైన తాగునీరు, 24 గంటల విద్యుత్‌ సరఫరా, పల్లెల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, హరితహారం ద్వారా మొక్కల నాటింపు, ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌, ఇంటింటికీ చెత్త సేకరణ, వీధుల్లో విద్యుద్దీపాలకంరణ, పారిశుధ్యంపై స్పెషల్‌ డ్రైవ్‌ తదితర కార్యక్రమాలతో పల్లెలు వెలుగుతున్నాయి. వీటికితోడు సాగు నీరు పుష్కలంగా రావడంతో వ్యవసాయం పండుగలా సాగుతున్నది. వెరసి ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి సంతోషకరమైన జీవనం సాగిస్తూ సకాలంలో పన్నులు చెల్లిస్తున్నారు.

ఇబ్బంది పడకుండా పన్నులు చెల్లిస్తున్నారు

గతంలో గ్రామాల్లో పన్నులు వసూలు చేసే సిబ్బందిని నిలదీసి నానా మాటలు అనేవారు. కానీ నెల నెలా పల్లె ప్రగతి నిధులతో సమస్యలు పరిష్కారమవుతుండడంతో నేడు ప్రజలు మాట మాట్లాడకుండా పన్నులు చెల్లిస్తున్నారు. కోట్లాది రూపాయలతో పనులు చేయడమే కాకుండా పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, డీఎల్‌పీఓల రిక్రూట్‌మెంట్లు జరిగి వారి పర్యవేక్షణ పెరుగడం కూడా పన్నుల వసూళ్లకు మరో కారణంగా చెప్పవచ్చు.

  • యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి

పని చేసే ప్రభుత్వానికి సహరించాలి

గతంలో గ్రామాల్లో సమస్యలు తిష్టవేసేవి. మురుగు నిల్వ ఉండి దోమలు విజృంభించేవి. పల్లెప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుండడంతో ఒక్కొక్క సమస్య పరిష్కారమవుతున్నది. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వీధి దీపాల వెలుగులు, గ్రామాల్లో పచ్చని వాతావరణం కల్పించే పనులు చేస్తుండ్రు. అందుకే పన్నులు సకాలంలో చెల్లించి ప్రభుత్వానికి సహకరిస్తున్నం.

  • వైకుంఠపు గురుస్వామి, మేళ్లచెర్వు

గతంలో గ్రామాల్లో ఆస్తి పన్ను కోసం సిబ్బంది ఇంటింటికీ వెళ్తే.. తాగునీరు రావట్లేదని, కరెంటు ఉండటం లేదని, డ్రైనేజీలు కంపు కొడుతున్నాయని, వీధుల్లో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయని, రోడ్లు గుంతలమయం అయ్యాయని, స్తంభాలకు లైట్లు వెలగడం లేదని వాపోయేవారు. అంతేకాకుండా శాపనార్దాలు, తిట్ల దండకాలు ఉండేవి. కానీ, నేటి పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది. ప్రభుత్వం పల్లెల్లో చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తాము కట్టాల్సిన పన్నులను కట్టేస్తున్నారు. పాలకుల్లో మార్పు వస్తే ప్రజల్లోనూ వస్తుందనడానికి ఇదే నిదర్శనం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana