e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home జిల్లాలు ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ

ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ

  • సిద్దిపేటలో కాంస్య విగ్రహ ఏర్పాటుకు చర్యలు
  • దొడ్డు వడ్లు కొనమని కేంద్రం చేతులేత్తేసింది
  • ప్రాజెక్టుపై కేంద్ర పెత్తనం ఏంటో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లారు
  • రైతులకు ఎల్లప్పుడూ అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
  • సిద్దిపేటలో చాకలి ఐలమ్మ జయంతి
  • అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఐలమ్మ జయంతి నిర్వహణ

మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక.. ఉక్కు మహిళా.. చాకలి ఐలమ్మ అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నంగునూరు మండలం పాలమాకులలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పాటు వర్షబాధితులకు చెక్కులు, వ్యవసాయ పరికరాలను మంత్రి హరీశ్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో సిద్దిపేటలో ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ‘మనం కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయాలని చూస్తున్నది.. దొడ్డు వడ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంటో తేల్చుకోవడానికి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారు’.. అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

సిద్దిపేట, సెప్టెంబర్‌ 26 : మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక, ఉక్కు మహిళా చాకలి ఐలమ్మ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. స్వరాష్ట్రంలో మహనీయుల జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తూ.. వారి గొప్పతనాన్ని భావి తరాలకు తెలిసేలా కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. ఈ క్రమంలో చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణమన్నారు. సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని హౌసింగ్‌ బోర్డు సర్కిల్లో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకొని, తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేస్తామన్నారు. సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో అత్యాధునిక ధోబీఘాట్లు నిర్మించామని తెలిపారు. రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారాజనర్సు, ఆర్డీవో అనంతరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సరోజ, ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం పాల్గొన్నారు. అనంతరం బీసీ స్టడీ సర్కిల్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులా రాజనర్సు పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిచారు.

- Advertisement -

పేదలకు సీఎం సహాయనిధి సంజీవని..

ఆపదలో.. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలన్నదే తన తాపత్రయమని, సీఎం సహాయనిధి నిరుపేదలకు సంజీవనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 31 మంది లబ్ధిదారులకు రూ.12,09,500 సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. పెద్ద ఆపరేషన్‌ అవసరముంటే నిమ్స్‌ దవాఖానలో ఖర్చులు లేకుండా ఎల్‌వోసీ ఇప్పించగలుగుతామని, అత్యవసర వైద్యంపై సిద్దిపేటలో రాము, హైదరాబాద్‌లో కృష్ణారెడ్డి అందుబాటులో ఉంటారని, అత్యవసరమైతే తానే స్వయంగా మాట్లాడుతున్నానని చెప్పారు.

విద్యుత్‌ షాక్‌తో మృతి చెందినకుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా..

నారాయణరావుపేట మండలం కోదండరావుపల్లి గ్రామానికి చెందిన బొంగురం శేఖర్‌ 2018 నవంబర్‌లో వ్యవసాయ పొలం బావి వద్ద విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. కాగా, స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగా మంత్రి చొరవతో విద్యుత్‌ శాఖ నుంచి రూ.4.50 లక్షలు మృతుడి కుటుంబ పిల్లల పేరిట బాండ్ల రూపేనా మంజూరు చేయించడంతో పాటుగా మృతుడి భార్య పేరిట రూ.50 వేలు చెక్కును నందినికి మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ మేరకు నందిని పిల్లలను రెసిడెన్షియల్‌ స్కూల్‌లో జాయిన్‌ చేయిస్తానని, అధైర్యపడొద్దని అండగా ఉంటానని మంత్రి హరీశ్‌రావు భరోసానిచ్చారు.

దొడ్డు వడ్లు కొనమని కేంద్రం చేతులెత్తేసింది..

నంగునూరు, సెప్టెంబర్‌ 26 : ‘మనం కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయాలని చూస్తున్నది.. దొడ్డు వడ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంటో తేల్చుకోవడానికి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారు’.. అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు 53, ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన ఇండ్లకు నష్టపరిహారం చెక్కులు 77, వాటర్‌షెడ్‌ నుంచి టార్పాలిన్‌ కవర్లు 699, బ్యాటరీ స్ప్రేయర్లు 37, తైవాన్‌ స్ప్రేయర్లు 9 మందికి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం రైతులకు ఎంతగానో మేలు చేస్తున్నదన్నారు. చినుకు పడగానే వానకాలం, యాసంగికి పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అన్నారు. గత ప్రభుత్వాలు రైతు ఆత్మహత్యలపై కనీసం ఎక్స్‌గ్రేషియా కూడా ఇవ్వలేదన్నారు. నంగునూరు మండలంలోని దర్గపల్లిలో రూ.7కోట్లతో వారం పదిరోజుల్లో హైలెవల్‌ బ్రిడ్జి పనులు ప్రారంభించుకుందామన్నారు. హన్మకొండ నుంచి సిద్దిపేట మీదుగా రామాయంపేట వరకు జాతీయ రహదారి వస్తుందని, వర్షం కురిస్తే ఈ దారి వెంట వెళ్లేందుకు రాకపోకలకు ఇబ్బందులు ఉన్నాయంటూ.. బస్వాపూర్‌ బ్రిడ్జి పునరుద్ధరణ చేపట్టి హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పాలమాకులలో కూడా రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌తో పాటు డివైడర్‌ మధ్యలో ఫ్లడ్‌ లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

రైతులు పంట మార్పిడి చేయాలి..

‘యాసంగిలో కేంద్రం దొడ్డువడ్లు కొనమని అం టుంది.. మన దేశానికి అవసరమైన పంట దినుసులను, నూనెలను దిగుమతి చేసుకుంటున్నాం.. వాటికి బదులుగా ఇక్కడే ఆయిల్‌ పామ్‌, పప్పు దినుసుల పంటలు సాగు చేసినట్లయితే రైతులకు ఇబ్బందులు ఉండవు’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతులందరూ ఆయిల్‌పామ్‌, మల్బరీ సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే నంగునూరులో వెయ్యి ఎకరాల్లో పామాయిల్‌ తోటలు పెట్టామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఆర్డీవో అనంతరెడ్డి, జడ్పీటీసీ తడిసిన ఉమ, ఏఎంసీ చైర్మన్‌ రాగుల సారయ్య, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు రమేశ్‌, మహిపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ సోంరెడ్డి, స్థానిక సర్పంచ్‌ కుమారస్వామి, ఎంపీటీసీ తులసీపరమేశ్వర్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement