e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home జిల్లాలు భయం వీడి బడికి

భయం వీడి బడికి

  • సంగారెడ్డి జిల్లాలో 49.26 శాతం, సిద్దిపేటలో 48.23 శాతం, మెదక్‌లో 40శాతానికి పైగా హాజరు
  • ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న విద్యార్థుల హాజరు
  • ప్రత్యక్ష బోధనకే మొగ్గు చూపుతున్న తల్లిదండ్రులు
  • విద్యార్థులు హాజరయ్యేలా చొరవ చూపుతున్న టీచర్లు
  • అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం
  • కొవిడ్‌ నిబంధనలు, జాగ్రత్తలతో మధ్యాహ్న భోజనం

కరోనా కారణంగా ఏడాదిన్నర తర్వాత ఈ నెల 1న విద్యాసంస్థలు పునఃప్రారంభం కాగా, క్రమంగా విద్యార్థుల హాజరు శాతం పెరుగుతున్నది. సంగారెడ్డి జిల్లాలో 49.26 శాతం, సిద్దిపేటలో 48.23శాతం, మెదక్‌లో 40శాతానికి పైగా హాజరు శాతం నమోదవుతున్నది. మొదట్లో ప్రత్యక్ష బోధనకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చలేదు. ఆన్‌లైన్‌ బోధనలో అనేక ఇబ్బందులు ఉండడం, విద్యాసంస్థల్లో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అన్ని ఏర్పాట్లు చేయడంతో తమ పిల్లలను బడులకు పంపుతున్నారు. దీంతో పాఠశాలలు కళకళలాడుతున్నాయి. అన్నిచోట్లా సందడి వాతావరణం నెలకొన్నది. ఇప్పటి వరకూ పాఠశాలల్లో కరోనా కేసులు నమోదు కాకపోవడం మరో సానుకూల అంశంగా మారింది. కొవిడ్‌ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్నం భోజనం వడ్డిస్తున్నారు.

సంగారెడ్డి, సెప్టెంబర్‌ 15 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు క్రమంగా పుంజుకుంటోంది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కరోనా భయం నుంచి బయటపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ఆసక్తిచూపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజ రు శాతం పెరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల్లో భరోసా పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు నచ్చజెబుతున్నారు. ప్రత్యక్ష తరగతులకు హాజరుకావడంతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు బడిబాటపడుతున్నారు. మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు 49.26 శాతానికి చేరింది. త్వరలోనే మరింత హాజరు శాతం పెంచుతామని అధికారులు ధీమాగా చెబుతున్నారు.
సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రభుత్వం విద్యాసంస్థలను ప్రారంభించింది. తొలిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు కేవలం 24.29 శాతం నమోదైంది. మొత్తం 1272 పాఠశాలలుండగా, తొలిరోజు కేవలం 28,269 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఆ తర్వాత క్రమంగా విద్యార్థులు బడికి వస్తున్నారు. పిల్లలను ప్రత్యక్ష తరగతులకు పంపితే కరోనా బారిన పడతారన్న భయాందోళనను తల్లిదండ్రులు క్రమంగా వీడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నది. తరగతి గదులతోపాటు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా తరగతి గదుల్లో విద్యార్థులను దూరం దూరంగా కూర్చోబెడుతున్నారు. తమ పిల్లలను ఇంకా పాఠశాలలుకు దూరంగా ఉంచితే వారు విద్యకు దూరమవుతారన్న ఆందోళనతో తల్లిదండ్రులు బడులకు పంపేందుకు ఆసక్తిచూపుతున్నారు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో 60 నుంచి 80శాతం వరకు విద్యార్థులు హాజరవుతున్నారు. జిల్లా సరాసరి సగటు హాజరు శాతం తీసుకుంటే మాత్రం విద్యార్థుల హాజరుశాతం 49.26శాతం ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు సుముఖత కనబరుస్తున్నారని, త్వరలోనే వందశాతం హాజరు శాతం ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అవుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

ఫలితమిస్తున్న ఆకస్మిక తనిఖీలు

ఉన్నతాధికారులు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరుపై దృష్టి పెడుతున్నారు. కలెక్టర్‌ హనుమంతరావు ఈ నెల 3న రుద్రారం పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. హాజరుశాతం పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చూడాలని హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు సూచించారు. అదనపు కలెక్టర్‌ రాజర్షి షా ఇటీవల కంది మండలం ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్‌ జిల్ల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారు. విద్యార్థుల హాజరుశాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంలు, మండల విద్యాధికారులకు సూచిస్తున్నారు. పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తమ పాఠశాల పరిధిలో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. పిల్లలను ప్రత్యక్ష తరగతులకు పంపాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉంటుంది. మంగళవారం ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులు హాజరు 24.4 శాతం ఉంది.

బడి బాటన విద్యార్థులుతొలిరోజు 34 శాతం.. నేడు 50 కి చేరువలో హాజరుశాతం

సిద్దిపేట అర్బన్‌, సెప్టెంబర్‌ 15 : కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర తర్వాత ఈ నెల 1న విద్యాసంస్థలు పునఃప్రారంభం కాగా, క్రమం గా విద్యార్థుల హాజరు శాతం పెరుగుతున్నది. మొదట్లో ప్రత్యక్ష బోధనకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చకపోగా, ప్రస్తుతం పాఠశాలలకు పాతకళ వస్తున్నది. అధికారులు విస్తృత అవగాహన కల్పించడం.. ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పాఠాలు అర్థం కాకపోవడం వంటి కారణాలతో ప్రత్యక్ష బోధనకే మొగ్గు చూపుతున్నారు. దీంతో పాఠశాలల్లో సందడి నెలకొంది. ఇప్పటి వరకూ పాఠశాలల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాకపోవడం మరో సానుకూల అంశంగా మారింది.

సిద్దిపేటలో 48.23శాతం..

సిద్దిపేట జిల్లాలోని మొత్తం 1192 పాఠశాలల్లో 1,43,550 మంది విద్యార్థులుండగా, మొదటి రోజు 49,360 మంది హాజరు కాగా, 34.4శాతం హాజరు నమోదైంది. పాఠశాలలు ప్రారంభమై రెండు వారాలు కావడంతో విద్యార్థుల హాజరుశాతం క్రమంగా పె రుగుతూ వస్తున్నది. బుధవారం 1,43,550 మంది విద్యార్థులకు గానూ 69,237 మంది రాగా, 48.23శాతం హాజరు నమోదైంది. విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు సమకూర్చారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించేలా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం

పాఠశాలలు పునఃప్రారంభం కా వడంతో అన్ని పాఠశాలల్లో మధ్యా హ్న భోజనానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వంటగది, భోజన ప్రదేశం, వస్తు సామగ్రి శుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు తాజావి అందుబాటులో ఉంచారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే విద్యారులు భోజ నం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana