e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home జిల్లాలు వారాంతపు సేద.. పల్లెకు పోదాం పద..

వారాంతపు సేద.. పల్లెకు పోదాం పద..

  • ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఫామ్‌హౌజ్‌లు
  • గ్రామీణ వాతావరణంపై పట్టణవాసుల ఆసక్తి
  • వీకెండ్స్‌ విడిదిగా ఫామ్‌ హౌజ్‌లు, విల్లాల వినియోగం

హైదరాబాద్‌ సమీపంలో ఉండడంతో ఉమ్మడి జిల్లాను ఎంచుకుంటున్న నగరవాసులు
కా్ంరక్రీట్‌ జంగలైన మహానగరంలో నిత్యం ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్న పట్టణవాసులు పల్లె వాతావరణాన్ని కోరుకుంటున్నారు. వీకెండ్స్‌, సెలవుదినాల్లో కుటుంబ సమేతంగా గ్రామాల్లో సరదాగా గడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకోసం హైదరాబాద్‌కు సమీప ప్రాంతాల్లో సకల సౌకర్యాలతో విలాసవంతమైన విల్లాలు, ఫామ్‌ హౌజ్‌లను నిర్మించుకుంటున్నారు. పరిసరాలను ఆహ్లాదంగా తీర్చిదిద్దుకొని కుటుంబ సమేతంగా ఇక్కడకు వచ్చి సేద తీరుతున్నారు. దీంతో మహానగరానికి అతిచేరువలో ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున ఫామ్‌ హౌజ్‌లు, విల్లాలు వెలుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్‌, శంకర్‌పల్లి, చేవెళ్ల, షాబాద్‌ తదితర మండలాలు, వికారాబాద్‌ జిల్లాలో హైదరాబాద్‌ -బీజాపూర్‌ హైవే రోడ్డు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక్క పూడూరు మండల పరిధిలోనే సుమారుగా150 ఫామ్‌హౌజ్‌లు ఉన్నాయి. ఇక్కడ ప్రసిద్ధిగాంచిన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు ఉండడంతో చాలామంది ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు.

పూడూరు మండలంలో..

- Advertisement -

పూడూరు/చేవెళ్ల రూరల్‌, సెప్టెంబర్‌ 25 : గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, విడిది కోసం నగరవాసులు ఎకరం, రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఫాంహౌజ్‌లు నిర్మించుకుంటున్నారు. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో కుటుంబీకులతో వచ్చి ఆటపాటలతో సరదాగా గడుపుతున్నారు. ఫాంహౌజ్‌లు లేని వారు దేవాలయాలకు వెళ్లి దర్శించుకోవడంతో పాటు అటవీ ప్రాంత అందాలను తిలకించి రెస్టారెంట్‌లో భోజనాలు చేసి వెళ్తుంటారు. దీంతో స్థానికులకు ఉపాధి లభిస్తుండడంతో పాటు ఈ ప్రాంతాల్లోని భూముల విలువ భారీగా పెరిగింది. కొన్ని ఏండ్ల కిందటి వరకు హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్ల్లోనే ఫాంహౌజ్‌లు కనిపించేవి. రోజు రోజుకూ నగరం చుట్టూ నివాసాలు పెరుగడం వల్ల కాలుష్యం కూడా పెరుగుతున్నది. నగర శివారు భూములకు అధిక ధరలు పలుకడంతో కొందరు అమ్ముకుని హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవే రోడ్డు ప్రాంతంలో ఎకరం, రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం హైదరాబాద్‌ నగరానికి 60 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఫాంహౌజ్‌లు నిర్మించి పలు రకాల పండ్లు, పూల మొక్కలను పెంచుతున్నారు. మండలంలోని అంగడి చిట్టంపల్లి, చన్గోముల్‌, కడ్మూర్‌, కుత్బుల్లాపూర్‌, మేడిపల్లి కలాన్‌, కంకల్‌, సోమన్‌గుర్తి, పెద్ద ఉమ్మెంతాల్‌, రాకంచర్ల, పూడూరు, కొత్తపల్లి, బాకాపూర్‌, మీర్జాపూర్‌, గొంగుపల్లి, ఎన్కెపల్లి, కండ్లపల్లి, కేరవెళ్లి తదితర గ్రామాల్లో కలిసి సుమారు 150 ఫాంహౌజ్‌ల వరకు ఉంటాయి. ఆదివారం, సెలవు దినాల్లో కుటుంబీకులు, స్నేహితులతో వచ్చి భోజనం చేసి సరదగా గడిపి వెళ్తున్నారు. ఈ ప్రాంతం సమీపంలోనే దామగుండ రామలింగేశ్వరస్వామి, అనంతగిరి దేవాలయం, కోట్‌పల్లి ప్రాజెక్టుతో పాటు అటవీ ప్రాంతం ఉండడం వల్ల చూసేందుకు సరదాగా వచ్చి వెళ్తున్నారు. మండలంలోని మన్నెగూడ-వికారాబాద్‌ రోడ్డు మార్గంలో 120 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో గోల్ఫ్‌ కోర్టు నిర్మించడంతో ఆదివారం దేశ క్రీడాకారులే కాకుండా విదేశాల క్రీడాకారులు సైతం వస్తుంటారు. గోల్ఫ్‌ కోర్టు సమీపంలోని అటవీ ప్రాంతంలో ట్రావెల్స్‌ రెస్టారెంట్‌ ఉండడంతో నిత్యావసరాలను ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకొని వస్తున్నారు. దీంతో రెస్టారెంట్‌, బేకరీ, తందూరిచాయి వంటి వ్యాపారాలు చేస్తూ స్థానికులు ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి రావాలంటే పూడూరు మండల పరిధి నుంచే రావాల్సి ఉంటుంది. పలు గ్రామాలు హైదరాబాద్‌కు సమీపంలో ఉండడం వల్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అభివృద్ధి చెందుతున్నది.

చేవెళ్ల మండల పరిధిలో..

చేవెళ్ల మండలం ఫాంహౌజ్‌లకు వేదికగా మారింది. హైదరాబాద్‌ వాసులు ఫాంహౌజ్‌లు, విల్లాలు నిర్మించుకుంటున్నారు. సెలవు దినాల్లో వచ్చి సరదాగా గడిపి వెళ్తుంటారు. దీంతో వ్యవసాయ భూములకు భారీగా విలువ పెరిగింది. చేవెళ్ల మండల పరిధిలో వ్యవసాయ భూమి ఎకరం విలువ దాదాపు రూ.కోటి నుంచి 3 కోట్లకు పైగా పలుకుతున్నది.

దాదాపు 300 ఎకరాల్లో విల్లాలు.. ఫాం హౌజ్‌ల నిర్మాణం

చేవెళ్ల మండల పరిధిలోని అంతారం గ్రామ సమీపం రాళ్ల గడ్డలో దాదాపు 50 ఎకరాల్లో విల్లాల నిర్మాణం జరుగుతున్నది. తల్లారం గ్రామంలో 25 ఎకరాల్లో, ముడిమ్యాల గ్రామంలో 100 ఎకరాల్లో విల్లాలు ఏర్పాటు చేశారు. చేవెళ్ల మండల కేంద్రానికి సమీపంలో దాదాపు 50 వరకు ఫాం హౌజ్‌లు నిర్మించారు. చుట్టు పక్కల మొయినాబాద్‌, శంకర్‌పల్లి, షాబాద్‌ మండలాల్లో సైతం అధికంగా విల్లాలు, ఫాంహౌజ్‌లను నిర్మించారు.

పెరిగిన ‘రియల్‌’ ప్యాపారం..

విల్లాలు, వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటుతో మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ భూములకు రెక్కలొచ్చాయి. చేవెళ్ల నుంచి పరిగి, వికారాబాద్‌ వెళ్లే హైవేకు దగ్గరలో ఎకరా భూమికి దాదాపు రూ.2 నుంచి 3 కోట్లకు పైగా పలుకుతున్నది.

మండలానికి చేరువ..

గతంలో మొయినాబాద్‌ మండలం, శంకర్‌పల్లికే పరిమితమైన విల్లాలు, ఫాంహౌజ్‌ల సంస్కృతి ఇప్పుడు మండలానికి వేదికైంది. చేవెళ్ల మండలంలో అత్యధికంగా భూముల విలువ పెరుగడంతో ఇక్కడ భూముల కొనుగోలు, వెంచర్లు, వ్యవసాయ క్షేత్రాలు, విల్లాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.

స్థానికులకు ఉపాధి..

ఫాంహౌజ్‌లు, విల్లాల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా చేవెళ్ల మండల పరిధి కాకుండా చుట్టు పక్కల మండలాల్లో అధికంగా విల్లాలు, ఫాంహౌజ్‌లు, రిసార్ట్స్‌ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోనే చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోనే అధికంగా వీటిని ఏర్పాటు చేసుకునేందుకు నగరవాసులు ఇష్టపడుతున్నారు. ఇక్కడి వాతావరణం, హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండడం, రవాణా తదితర సౌకర్యాలు ఉండడమే ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.

రెస్టారెంట్‌తో లాభాలు..

శని, ఆదివారాల్లో నగరవాసులు కుటుంబీకులతో కలిసి వస్తున్నారు. హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవే రోడ్డు పక్కనే నక్షత్ర రెస్టారెంట్‌ ఏర్పాటు చేశాం. సెలవు రోజుల్లో నగర వాసులతో గిరాకీ బాగా ఉంటుంది. లాభాలు వస్తుండడంతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తున్నాం.
ఎస్‌ యాదవరెడ్డి, అంగడిచిట్టంపల్లి గ్రామం, పూడూరు మండలం

వీకెండ్‌లో గడపడానికి ఇష్టపడుతున్నారు..

కరోనా ప్రభావం, నగరవాసులు పల్లెల్లో ఉండడానికి మక్కువ చూపడానికి ప్రధాన కారణం. వీకెండ్‌లో ఫాంహౌస్‌లు, విల్లాల్లో కుటుంబీకులతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తల్లారం గ్రామపంచాయతీ పరిధిలో దాదాపు 24 విల్లాలు, మోడల్‌ హౌజ్‌ల నిర్మాణం జరుగుతున్నది.
నర్సింహులు, తల్లారం గ్రామం, చేవెళ్ల మండలం

ఉపాధి అవకాశాలు అభిస్తున్నాయి..

కరోనా ఎఫెక్ట్‌తో పల్లెల్లో సమయం గడపడానికి పట్టణవాసులు ఆసక్తి చూపుతున్నారు. మా గ్రామం చుట్టు పక్కల పరిశ్రమలు వెలిశాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇది హర్షించదగ్గ విషయమేనని చెప్పాలి.

  • ఎం.రామస్వామి, అంతారం గ్రామం చేవెళ్ల మండలం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement