కమ్మర్పల్లి, అక్టోబర్ 17 : గ్రామంలో పచ్చదనం కోసం ఆ ముగ్గురు పరితపిస్తున్నారు. మొక్కల సంరక్షణకు తమవంతు కృషి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, గ్రామ సర్పంచ్ బద్దం పద్మ భర్త బద్దం చిన్నారెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు పోతు రాజేశ్వర్, వృద్ధుడు ఆకుల దేవయ్య మండలంలోని ఉప్లూర్‌లో పచ్చదనానికి కారకులవుతున్నారు. గ్రామానికి చెందిన ఈ ముగ్గురూ హరితహారానికి తమవంతు చేయూతనందిస్తున్నారు.
కేసీఆర్ పిలుపునివ్వడమే ఆలస్యం..
తెలంగాణ ఉద్యమకారుడు, గ్రామ సర్పంచ్ బద్దం పద్మ భర్త బద్దం చిన్నారెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా ముందుంటాడని ఉద్యమ కాలం నుంచి పేరుంది. హరితహారానికి సర్పంచులు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునివ్వడం, తన భార్య సర్పంచ్‌గా ఉండడంతో గతేడాది చిన్నారెడ్డి సుమారు రూ.20 వేల సొంత ఖర్చుతో గ్రామంలో రోడ్ల పక్కన, పలు కూడళ్లలో, రైతు వేదిక భవనం వద్ద వంద మొక్కలను తెప్పించి నాటించాడు. వాటిలో 50 మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయించాడు.
సొంతూరికి ఏదైనా చేయాలని..
ఉప్లూర్‌కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పోతు రాజేశ్వర్ గ్రామానికి తనకు తోచినంతలో సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి. సొంతూరిలోని పాఠశాలలో పేద విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, ఇతర వస్తువులు అందిస్తూ ఉంటాడు. తన సేవ, వితరణ కార్యక్రమాల్లో హరితహారాన్ని జోడించాడు. దీంతో గతేడాది గ్రామంలో నాటిన మొక్కలకు ట్రీ గార్డుల కోసం రూ.6 వేల ఆర్థిక సహాయం అందజేశాడు.
కంటికి రెప్పలా మొక్కల సంరక్షణ..
గ్రామానికి చెందిన వృద్ధుడు ఆకుల దేవయ్య హరిత ప్రియుడు. గ్రామంలో పల్లెప్రగతి ద్వారా వైకుంఠధామాన్ని నిర్మించకముందే అక్కడ మొక్కలను నాటించారు. మొక్కల సంరక్షణ బాధ్యతను దేవయ్యకు అప్పగించారు. నాలుగేండ్ల క్రితం వానలు కురవక, మొక్కలు వాడిపోతుండడంతో వాటిని దేవయ్య సంరక్షించిన తీరును అందరూప్రశంసిస్తారు. మండుటెండల్లో చెరువు లేదా వ్యవసాయ బోర్ల వద్ద నుంచి మట్టిగొబ్బలతో నీళ్లుతీసుకువచ్చి మొక్కమొక్కకూ పోసి సంరక్షించిన తీరును గుర్తు చేస్తుంటారు. ఆ మొక్కలే ప్రస్తుతం వృక్షాలుగా మారి నీడనిస్తున్నాయి. వైకుంఠధామాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దేవయ్య కృషి గ్రామస్తుల ద్వారా తెలుసుకొని అతడితోనే రిబ్బన్ కట్ చేయించి అభినందిచారు.
హరితహారం.. ప్రకృతికి ఆభరణం
హరితహారం.. ప్రకృతికి పచ్చని ఆభరణం
కరువును పారద్రోలే అద్భుత బ్రహ్మాస్త్రం
పచ్చని చేట్లే మన ప్రగతికి మార్గం
గుర్తించాలి ఈ నిజాన్ని నేటి మానవ వర్గం
అడవులు నరికే స్వార్థాన్ని వీడాలి మనం
తరువులు పెంచే గుణాన్ని పొందాలి జనం
హరితహారం నేటి ఆధునిక ఉద్యమం
కాలుష్యరక్కసిని తరిమికొట్టే అద్భుత అస్త్రం
హరితహారంలో భాగస్వామ్యమవ్వాలి మనమందరం
మొక్కలు నాటి చేయాలి ప్రకృతి సుందరం
వాడవాడలో పెంచాలి పచ్చని వనం
అందేకే కదలాలి మనం..పెంచాలి వనం