కొండేరులో కొండంత అభివృద్ధి
పల్లెప్రగతితో సుందరంగా పంచాయతీ
నిరంతరం పరిశుభ్రత పనుల నిర్వహణ
ప్రజల చైతన్యంతో ముందుకు..
అలంపూర్/ఇటిక్యాల, ఏప్రిల్ 6 : గతంలో పల్లెల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం, పెంటకుప్పలు, రోడ్లపై పారే మురుగునీరు, మురుగు కాలువల్లో పందుల ఆవాసాలు, అపరిశుభ్రత రాజ్యమేలేది. ఎవరికి వారు ఇది తమ బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరించేవారు.. ప్రస్తుతం ఇవేవీ గ్రామాల్లో కనిపించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయి. ప్రతి పనిలో ప్రత్యేకత చాటుకుంటూ తక్కువ కాలంలోనే అభివృద్ధి సాధిస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కొండేర్ గ్రామపంచాయతీ మండలానికి ఆదర్శంగా నిలుస్తున్నది. కొండేర్ గ్రామంలో 850 కుటుంబాలుండగా, నాలుగు వేలకు పైగా జనాభా ఉన్నారు. గ్రామంలో పల్లెప్రగతి కంటే ముందు ఎక్కడ చూసినా చెత్తాచెదారం కనిపించేది. తాగునీటి బోర్ల వద్ద ఇంకుడు గుంతలు లేక అక్కడే నిలిచిన మురుగునీటిలో పందులు ఆవాసాలు ఏర్పరుచుకునేవి. అయితే, ప్రభుత్వం గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా చేపట్టిన పల్లెప్రగతితో రూపురేఖలు మారిపోయాయి. సర్పంచ్ వీరన్న కృషి, గ్రామస్తుల సహకారంతో, అధికారుల సమన్వయంతో గ్రామం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది.
గ్రామంలో మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు కాలనీల్లో డ్రైనేజీలను నిర్మించారు. ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించారు. పారిశుధ్య పనుల్లో భాగంగా వీధుల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తున్నారు. ట్రాలీ సైకిళ్లతో చెత్తను సేకరిస్తున్నారు. డంపింగ్‌యార్డులో తడి, పొడి చెత్తను వేరుచేసి.. ప్రభుత్వం అందించిన వానపాములతో కంపోస్ట్ ఎరువును తయారుచేస్తున్నారు. గ్రామంలో పాడుబడిన ఇండ్లను తొలిగించారు. పాడుబడిన బావులకు ఇనుపరాడ్లతో రక్షణ కంచె ఏర్పాటు చేశారు. 44వ జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి ప్రవేశించే ప్రధాన రహదారి వెంట హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి నూతన శోభ సంతరించుకున్నది. గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు. వీధుల్లో, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడంతో గ్రామంలో పచ్చదనం పెరిగింది. 150 విద్యుత్ స్తంభాలకు గానూ ప్రస్తుతం 80 ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీల్లో మొక్కల పెంపకం పనులు చకచకా చేపడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి మస్తాన్‌వలీ, సర్పంచ్ వీరన్న నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలపై చర్చించి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
యమునా నీటిపై విషపు నురుగలు..!
పార్కులో చిరుతదాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీడియో