e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home జిల్లాలు పంచాయతీరాజ్‌కు బాస్‌ అయ్యారు

పంచాయతీరాజ్‌కు బాస్‌ అయ్యారు

  • ఆవాస తండా నుంచి ఎదిగి..
  • రోడ్డు, బడి సౌకర్యం కూడా లేని చోటు నుంచి వచ్చిన శరత్‌
  • బాల్యంలో 3 కిలోమీటర్లు కాలినడకన బడికి
  • విద్యాభ్యాసమంతా ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతి గృహాల్లోనే..

ఉమ్మడి రాష్ట్రంలో గ్రామపంచాయతీ హోదాకు కూడా నోచని, కనీస సౌలతుల్లేని మారుమూల తండా నుంచి ఎదిగిన ఆయన.. నేడు ఏకంగా పంచాయతీరాజ్‌ శాఖకే కమిషనర్‌ అయ్యారు. చదువుకునేందుకు తండాలో బడి లేదు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లడానికి సరైన రోడ్డూ ఉండేది కాదు. అయినా సద్ది కట్టుకుని కచ్చా రోడ్డుపై కాలినడకన వెళ్లేవారు. ప్రాథమికోన్నత, ఉన్నత విద్యాభాస్యం కూడా ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూనే, ప్రభుత్వ విద్యాసంస్థల్లో పూర్తిచేశారు. తను పుట్టిన తండాలో, పల్లెల్లో సమస్యలను చూసి కలత చెందేవారు. అలాంటి కొద్దిమందికైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పట్టుదలతో ఉన్నతాధికారి అయ్యారు అడావత్‌ శరత్‌నాయక్‌. స్వరాష్ట్రంలో ఎంతో కీలకంగా మారిన పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన్ని నమస్తే తెలంగాణ పలుకరించగా.. పలు విషయాలు, విశేషాలను పంచుకున్నారు.

చదువుకు పేదరికం అడ్డుకాదు..

- Advertisement -

చదువుకు పేదరికం అడ్డుకాదు. చదువుకోవాలనే తపన, లక్ష్య సాధన, పట్టుదల ఉంటే ఫలితాలు మన ముందుకు వస్తాయి. గతంలో కంటే నేడు అనేక అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా చదువు కోసం అనేక అవకాశాలు కల్పించాయి.

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆలయం..

కనిపించే మొదటి దైవం తల్లిదండ్రులు. మా అన్నదమ్ములం అమ్మానాన్నకు ఆలయం నిర్మించాం. ప్రతి ఏడాదీ దైవంతో సమానంగా పూజలు చేస్తాం. వారి పేరు మీద ఎస్‌ఎస్‌ స్పచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు చేయూతనిస్తున్నాం. పల్లెల్లో బస్‌షెల్టర్లు, తాగునీటి ట్యాంకులు నిర్మించాం. నిరుపేదల వివాహాలకు ఆర్థిక సాయం అందించాం.

పాఠశాలకు దినం తప్పకుండా వచ్చేవాడు..

శరత్‌ చురుకైన వాడు. రోజూ నడుచుకుంటూ పాఠశాలకు వచ్చేవాడు. ఏది చెప్పినా క్రమం తప్పకుండా ఆచరించేవాడు. నేడు కమిషనర్‌ స్థాయికి ఎదుగడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన సేవలు అందరికీ ఉపయోగపడాలి.
మధురాంతకం లక్ష్మయ్య, విశ్రాంత ఉపాధ్యాయుడు, కొండ్రపోల్‌

కమిషనర్‌ కావడం ఆనందంగా ఉంది..

శరత్‌ సార్‌ పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌గా నియమితులు కావడం ఆనందంగా ఉంది. ఆయన ఏ స్థాయి ఉద్యోగంలో ఉన్నా సొంత గ్రామాన్ని మర్చిపోరు. ప్రతి పండుగకు మాతోటి ఆనందంగా గడుపుతారు.
మిట్టపల్లి శ్రీధర్‌, కొండ్రపోల్‌

సెలవుల్లో వ్యవసాయ పనుల్లో..

మాకు 20ఎకరాల పొలం ఉంది. ఆరుగురు అన్నదమ్ములం. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగానే ఉంటాం. నేను చదువుకునే రోజుల్లో నాగలితో దున్నాను. వ్యవసాయ పనులంటే నాకెంతో ఇష్టం. ఇప్పటికీ మా ఊరికి వెళ్తే పొలాల వద్దనే కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడుపుతాం. ఓ తమ్ముడు వ్యవసాయం, మరో తమ్ముడు ఎంవీఐ, నాలుగో తమ్ముడు డ్టార్‌. ఏ కార్యక్రమం అయినా అందరం కలిసి పల్లె వాతావరణంలో గడుపుతాం.

పట్టుదలతోనే అవకాశాలు ..

1992లో సివిల్స్‌ రాశాను. రాలేదు. రెండోసారి ప్రయత్నించాను, కస్టమ్స్‌లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే 1994లో గ్రూప్‌-1 రాశా.. స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు వచ్చింది. మహబూబ్‌నగర్‌లో ఆర్డీఓగా ఉద్యోగం సాధించాను. అనంతరం చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌ కలెక్టర్‌గా, కుప్పం నియోజకవర్గంలో 1999 నుంచి 2004 వరకు ప్రత్యేకాధికారిగా పనిచేశాను. గుంటూరు, మెదక్‌ జిల్లాల్లో జేసీగా, గిడ్డంగులు, మార్క్‌ఫెడ్‌ ఎండీగా సేవలు అందించాను. అనంతరం జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా పనిచేశా. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న నన్ను పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌గా నియమించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement