అంగవైకల్యం ఆత్మైస్థెర్యం ముందు తలవంచింది. వైకల్యం శరీరానికే గానీ మనస్సుకు కాదనుకుని ముందుకు సాగుతూ మంచి మెకానిక్‌గా పేరుతెచ్చుకున్నాడు. మరో పది మందికి తన దగ్గర ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.. వ్యవసాయ మోటర్ల రిపేర్లు, అన్ని రకాల విద్యుత్ పరికరాల మరమ్మతులో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు దామరచర్ల మండల కేంద్రానికి చెందిన నకిరేకంటి పాపయ్య. పాపయ్య సొంత గ్రామం పాలకవీడు మండలం మూసొడ్డు సింగారం. తల్లిదండ్రులకు తొలి సంతానం. ఆరు నెలల వయస్సులో పోలియో కారణంగా కుడిచేయి పడిపోయింది. మూడేండ్ల వయసులో ఆడుకుంటూ కింద పడగా చేయికాస్తా విరిగిపోవడంతో పూర్తిగా తొలగించారు. పాపయ్య చిన్న వయసులోనే తండ్రి సోమయ్య చనిపోయాడు. తల్లి కూలి పనులకు వెళ్తూ చదివించడంతో పదో తరగతి వరకు నెట్టుకొచ్చాడు. ఇద్దరు తమ్ముళ్లు, నలుగురు చెల్లెళ్లు.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో చదువు మానేసి తనకు తెలిసిన వారితో 1991లో దామరచర్లకు చేరుకున్నాడు. స్నేహితుడి వద్ద కరంటు పని పనినేర్చుకున్నాడు. తరువాత సొంతంగా మెకానిక్ షాపు పెట్టుకున్నాడు.
80మందికి ఉపాధి చూపిన పాపయ్య..
దామరచర్లలో గత 26 సంవత్సరాలుగా విద్యుత్తు మెకానిక్‌గా పనిచేస్తున్న పాపయ్య వద్ద ఇప్పటి వరకు 80 మంది పనినేర్చుకొని స్థానికంగా, ఇతర ప్రాంతాల్లో షాపులు పెట్టుకొని ఉపాధిపొందుతున్నారు. వీరితో పాటుగా పలు పరిశ్రమల్లో కూడా కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో అనేక మంది యువకులు ఈ వృత్తిని ఎంచుకున్నారు. దాంతో ఎంతో మంది పాపయ్య వద్ద పనినేర్చుకొని స్థిరపడ్డారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ నెలకు 3,016రూపాయల పింఛన్ ఇస్తుండడంతో దివ్యాంగులు సగర్వంగా బతుకుతున్నరు. కాలానుగుణంగా విద్యుత్ పరికరాల మరమ్మతులో ఆధునిక యంత్రాల వాడకం పెరిగింది. ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే వాటిని సమకూర్చుకుంటాను’ అని పాపయ్య అంటున్నాడు.
ఒంటి చేత్తో మరమ్మతు
కరెంటు పరికరాల మరమ్మత్తులో ఏ పని అయినా చిటికెలో చేసేస్తాడు. ఫ్యాన్లు, మిక్సీలు, చిన్న మోటర్లు, వ్యవసాయ మోటర్లు, కూలర్లు రిపేర్లు చేస్తాడు. బోర్లల్లో పైపులు వేయడం, కొత్త ఇండ్లలో పైపులు వేయడం సహా పెద్దపెద్ద పనులు కూడా చేస్తాడు.