e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 29, 2021
Home జిల్లాలు తీగలాగితే డొంక కదిలింది

తీగలాగితే డొంక కదిలింది

  • రైతు బంధు స్వాహా కేసులో 23 మందికి రిమాండ్‌
  • ఐదు మండలాల్లో స్వాహాకార్యం
  • 547 చెక్కుల ద్వారా రూ.61.50లక్షల డ్రా
  • చాలెంజ్‌గా తీసుకుని ఛేదించి పోలీసులు

నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్‌14(నమస్తే తెలంగాణ): తప్పు చేస్తే ఎంతటి వారైనా తప్పించులేరన్న దానికి తాజా నిదర్శనమే రైతుబంధు డబ్బులు స్వాహా ఘటన. 2018 ఆగస్టులో రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను అక్రమంగా డ్రా చేశారు. ఎవరు గమనిస్తారులే అనుకున్నారేమో లక్షల రూపాయలను దోచుకుని దాచుకున్నారు. కానీ అప్పట్లో దీనిపై చర్చ జరిగినా పూర్తి వివరాలు సేకరించలేక పోయారు. అనంతరం రైతుబంధు చెక్కులను దుర్వినియోగ పర్చడంపై తీవ్ర విమర్శలు రావడంతో పోలీసు శాఖకు ఈ కేసు సవాల్‌గా మారింది. ఎస్పీ రంగనాథ్‌ పర్యవేక్షణలో దేవరకొండ పోలీసులు తీగ లాగితే డొంక కదిలిన చందంగా శోధిస్తూ ఎట్టకేలకు నిగ్గు తేల్చారు. ఐదు మండలాల పరిధిలో 547 చెక్కులను డ్రా చేసి రూ.61.50 లక్షల రూపాయలను స్వాహా చేసినట్లు వెల్లడైంది. ఇందులో రెవెన్యూ, బ్యాంకు అధికారులు, సిబ్బందితో పాటు మధ్యవర్తులదే కీలకపాత్రగా స్పష్టమైంది. దీంతో మొత్తం 23 మందిపై చీటింగ్‌, నిధుల దుర్వినియోగం సెక్షన్ల కింద అరెస్టు చేసి గురువారం కటకటాల్లోకి పంపించారు. ఈ కేసు ప్రభుత్వ విభాగాల్లో అక్కడడక్కడే ఉండే అక్రమార్కులకు ఓ హెచ్చరికగా కూడా పోలీసులు సూచిస్తున్నారు.
సాగు ఆరంభంలో పెట్టుబడులకు రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన సీఎం కేసీఆర్‌ దేశానికి ఆదర్శవంతమైన రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. 2018 మే నుంచి అమలులోకి వచ్చిన ఈ పథకం ప్రారంభంలో ఒక్కో సీజన్‌లో ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయంగా చెక్కుల రూపంలో ప్రభుత్వం రైతులకు అందజేసింది. ధనిక, పేద తేడా లేకుండా భూమి పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్న ప్రతి రైతుకూ సాయం అందేలా నిబంధనలు రూపొందించారు. ఇదే అదునుగా రెవెన్యూ అధికారులు వక్రబుద్ధ్దిని ప్రదర్శించారు. చెక్కులు పంపిణీ చేసిన తరువాత చనిపోయిన వారి పేర్ల మీద, భూమి వివరాలు తప్పుగా పడి వారి పేర్ల మీద, ఇతర ప్రాంతాల్లో ఉంటూ చెక్కులు తీసుకొని రైతుల పేర్ల మీద వచ్చిన చెక్కులను పక్కదారి పట్టించారు. మాయం చేసిన చెక్కులను డ్రా చేసేందుకు బ్యాంకు అధికారులను, సిబ్బందిని మచ్చిక చేసుకున్నారు. ఈ క్రమంలో వీరికి కొందరు దళారులు కూడా తోడయ్యారు. వీరంతా కలిసి నిబంధనలకు విరుద్ధ్దంగా చెక్కులను డ్రా చేసుకుని పంపకాలు చేసుకున్నారు. ఈ తర్వాత కొందరు రైతులు తమకు చెక్కులు అందకపోవడంతో ఆరా తీశారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రారంభంలో దీన్ని అంతటా పట్టించుకోని అధికారులు ఒక గ్రామంలో కాదు చాలా చోట్ల ఇలానే కొందరు చెక్కులను మాయం చేసినట్లు గుర్తించారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు అప్పట్లో దీన్ని లైట్‌గా తీసుకున్నా… విషయ తీవ్రత దృష్ట్యా ఇటీవల తిరిగి దీన్ని సీరియస్‌గా పరిగణించారు. జిల్లా ఎస్పీ రంగనాథ్‌ పర్యవేక్షణలో దేవరకొండ పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో నిగ్గుతేల్చారు.

ఐదు మండలాల్లో స్వాహాపర్వం

- Advertisement -

ప్రారంభంలో గుర్రంపోడులో గుర్తించిన స్వాహా పర్వాన్ని తర్వాత ఇతర మండలాలకు విస్తరించినట్లు విచారణలో తేలింది. దీంతో ఏకకాలంలో గుర్రంపోడు, నాంపల్లి, పీఏపల్లి, చింతపల్లి, చండూరు మండలాల్లో వేర్వేరు బృందాలుగా కేసును విచారించారు. ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేస్తూ నిందితులను ఒక్కొక్కరిగా గుర్తిస్తూ వచ్చారు. మండలాల వారీగా ఏ గ్రామంలో ఎన్ని చెక్కులను దారి మళ్లించారన్న దానిపై దృష్టి సారించారు. ఇలా మొత్తం 547 చెక్కులను డ్రా చేయడం ద్వారా 61.50లక్షల రూపాయలను నొక్కేశారు. గుర్రంపోడు మండలంలోని కోప్పోలులో అత్యధికంగా 59 చెక్కులను, తెనేపల్లి, గుర్రంపోడ్‌, పోచంపల్లిల్లో ఒక్కొక్కటి, మక్కపల్లిలో 23, జూనూతలలో 3, పేర్లపల్లిలో 7, చేపూరులో 36, పాల్వాయిలో 8 చెక్కుల చొప్పున మొత్తం 139 చెక్కుల ద్వారా 14,02,160 రూపాయలు డ్రా చేశారు. ఇలాగే పీఏపల్లి మండలంలోని గణపురంలో 44, పోల్కంపల్లిలో 5 చెక్కులతో మొత్తం 49 చెక్కుల ద్వారా 3,77,580లను, నాంపల్లి మండలంలో టీపీ గౌరారంలో 90, ఎస్‌.లింగోటం 49, పసునూర్‌ 56, నాంపల్లి 19, తుమ్మలపల్లి 28, రేవల్లి 1, ముష్టిపల్లి 44, కేతేపల్లి 27, మేళ్లవాయి 9, నేరేళ్లపల్లి 5, పెద్దాపురం 4 చొప్పున మొత్తం 332 చెక్కులతో రూ. 38,06,220లను, చింతపల్లి మండలంలో వర్కాలలో 20 చెక్కుల ద్వాదా రూ.3,84,500లు,చండూరులో ఏడు చెక్కుల ద్వారా రూ.1,80, 000లను అక్రమంగా డ్రా చేసినట్లు నిగ్గు తేల్చారు.

నిందితుల్లో రెవెన్యూ వారే కీలకం

ఈ కేసులో మొత్తం 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై 420, 409 ఆర్‌/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌ చేశారు. దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి నేతృత్వంలో ఐదు మండలాల పోలీసులు ఈ కేసు విచారణలో పాలుపంచుకుని ఎక్కడికక్కడే వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. ఈ కేసు పూర్వపరాలను ఏఎస్పీ నర్మద వెల్లడిస్తూ ఈ కేసులో ఒక డిప్యూటీ తాసీల్దార్‌, ఒక ఆర్‌ఐ, నలుగురు వీఆర్వోలు, నలుగురు వీఆర్‌ఏలు, బ్యాంక్‌ అధికారితో పాటు మరో 11 మంది మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు చెప్పారు. మధ్యవర్తుల ద్వారా గ్రామాల్లోని స్థ్ధానికులను సంప్రదించి, అక్కడి వారి వివరాలు సేకరించి అక్రమాలకు తెరలేపినట్లు తెలిపారు. దేవరకొండ, నల్లగొండ డివిజన్‌ పోలీసులు సమన్వయంతో ఈ కేసును చేధించారని, వీరిని ఏఎస్పీ నర్మద ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement